అందరి సహకారంతో అభివృద్ధి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అందరి సహకారంతో అభివృద్ధి

అందరి సహకారంతో అభివృద్ధి

Written By news on Friday, July 25, 2014 | 7/25/2014

అందరి సహకారంతో అభివృద్ధి
 నెల్లూరు(పొగతోట): రాజకీయాలకు అతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం శ్రమిస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో 14వ చైర్మన్‌గా ఆయన  గురువారం ఉదయం 11.15 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. పండితులు వేదమంత్రాలు జపించి బొమ్మిరెడ్డిని ఆశీర్వదించారు.
 
 జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అవినీతి రహిత పాలన అందిస్తానన్నారు. గతంలో తాను ఏఎస్‌పేట జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా పని చేశానని, జిల్లా పరిషత్ పాలనపై అవగాహన ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు, రోడ్లు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని బొమ్మిరెడ్డి చెప్పారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో తనకు సహకరించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 24, 25, 26 తేదీల్లో నిర్వహించే ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. ఈ ఆందోళనల్లో ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ బొమ్మిరెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మంచి వ్యక్తి అన్నారు. జిల్లాలో సుపరిపాలన అందించగల సత్తా బొమ్మిరెడ్డికి ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి పి. నారాయణ, 10 మంది ఎమ్మెల్యేలు కలసి పని చేయాలని పిలుపునిచ్చారు. రాగద్వేషాలను పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి అందరూ ముందుకు రావాలన్నారు.
 
 గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ 23 మంది జెడ్పీటీసీ సభ్యులు తమ వెన్నంటి ఉండి అఖండ విజయాన్ని అందించారన్నారు. బెదిరిం పులకు భయపడక, ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా తమ వెన్నంటి ఉన్న జెడ్పీటీసీ సభ్యులు ఆణిముత్యాలన్నారు. నిరుపేదలైన బీసీ, ఎస్‌సీ, ఎస్ టీ జెడ్పీటీసీ సభ్యులు తమకు అండగా నిలిచారన్నారు. కోటీశ్వరులైన సభ్యులు ఏ విధంగా ప్రవర్తించారో ప్రజలకు తెలుసునన్నారు. నెల్లూరు నగర, సూళ్లూరుపేట, సర్వేపల్లి ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల ఉద్యోగులు బొమ్మిరెడ్డికి అభినందనలు తెలిపారు.
 
 మొదటి సంతకం మహిళాభివృద్ధికే...
 జెడ్పీ సీఈఓ జితేంద్ర సమక్షంలో చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తన మొదటి సంతకం మహిళాభివృద్ధి కోసమే చేశారు. మహిళా ప్రాంగణంలోని భవనాల మరమ్మతుల కోసం రూ.5 లక్షల గ్రాంటు మంజూరు చేస్తూ సంతకం చేశారు.
Share this article :

0 comments: