విజయోత్సాహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయోత్సాహం

విజయోత్సాహం

Written By news on Tuesday, July 15, 2014 | 7/15/2014

విజయోత్సాహం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మెజారిటీ స్థానాలు దక్కించుకున్నా తెలుగుదేశం కుయుక్తులకు జెడ్పీ పీఠం పూర్తిగా చేజారిపోతుందన్న ఆందోళనలో ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఆదివారం జరిగిన పరిణామాలు ఉత్సాహాన్ని నింపాయి.  వైఎస్సార్ సీపీ నేత, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రచించిన వ్యూహం తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ పరిణామాలతో జెడ్పీ పీఠం అధిష్టించిన ఈదర హరిబాబును సస్పెండ్ చేశామని చెప్పుకోవడం తప్ప వారికి ఏం మిగలలేదు.

జిల్లా జెడ్పీ పీఠాన్ని ఏ విధంగానైనా చేజిక్కించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి శిద్దా రాఘవరావు, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్యేలు రచించినవ్యూహాలు ఫలితాన్నివ్వలేదు.

* ముగ్గురు సభ్యులను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకున్న తెలుగుదేశం పార్టీ బలాబలాలు సమానం కావడంతో హైదరాబాద్ నుంచి వస్తున్న జెడ్పీటీసీలను అడ్డుకుని మార్కాపురం జెడ్పీటీసీ రంగారెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం తదితర పరిణామాలతో బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు.

* చంద్రబాబు మొదటి నుంచి జెడ్పీ చైర్మన్ పదవి నీకేనంటూ హామీ ఇచ్చి ఈదర హరిబాబుకు చివరి నిముషంలో చెయ్యివ్వడంతో అసంతృప్తిగా ఉన్న విషయం గుర్తించి తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించారు.

* జెడ్పీటీసీ రంగారెడ్డిని పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులో అరెస్టు చేయడంతో తెలుగుదేశం బలం 28 ఉండగా, వైఎస్సార్ సీపీ బలం 27కు పడిపోయింది. దీంతో తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయించి ఈదర హరిబాబుతో చర్చలు జరిపారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

*హైదరాబాద్‌లో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ తెలుగుదేశానికి షాక్ ఇచ్చారు. ఎక్స్ అఫిషియో సభ్యులను కూడా గెలుచుకోవడంతో తెలుగుదేశం నాయకులకు గెలుపుపై ఎటువంటి అనుమానాలు లేకుండా పోయాయి.

* ఈదర హరిబాబు పసుపు కండువా వేసుకోకుండా రావడంతో అసంతృప్తితో ఉన్నాడని ఊహించినా ఎక్స్‌అఫిషియో సభ్యులకు మద్దతు ఇవ్వడంతో దేశం నేతలకు ఎటువంటి అనుమానం లేకుండా పోయింది. మన్నం రవీంద్ర పేరును తెలుగుదేశం నేతలు ప్రతిపాదించే వరకూ కూడా హరిబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ ఉండటంతో వారు గెలుపు మెట్టువరకూ వచ్చామన్న ధీమాకి వచ్చారు. అయితే చివరి నిముషంలో ఈదర హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడటం.. వైఎస్సార్ సీపీ మద్దతు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.

* ఈ పరిణామాలన్నీంటి వెనుక బాలినేని అమలు చేసిన వ్యూహం ప్రత్యర్థులకు అందకుండా పోయింది. ఈదర హరిబాబును వ్యతిరేకించినా తమకే ఓటు వేస్తారని ఊహించిన తెలుగుదేశం నేతలకు అతను ఏకంగా జెడ్పీ చైర్మన్ అయిపోవడం మింగుడు పడలేదు.

* మార్కాపురం జెడ్పీటీసీని అరెస్టు చేయడంతో పూర్తిగా చేజారిపోతుందన్న జెడ్పీ స్థానాన్ని తెలుగుదేశంకు దక్కకుండా చేయడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నూకసాని బాలాజీకి వైస్ చైర్మన్ పదవి దక్కేలా చేయడంతో వైఎస్సార్ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. జిల్లాలో పలు ఎంపీపీలు, మున్సిపాలిటీలు ఆఖరికి జెడ్పీటీసీలలో అధికార గర్వంతో వ్యవహరించిన తెలుగుదేశానికి చెక్ పెట్టడంతో కార్యకర్తల్లో నైతిక స్థైర్యం పెరిగిందని చెప్పవచ్చు.
Share this article :

0 comments: