ఉపేక్షిస్తే ఊరుకోం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉపేక్షిస్తే ఊరుకోం

ఉపేక్షిస్తే ఊరుకోం

Written By news on Tuesday, July 29, 2014 | 7/29/2014

ఉపేక్షిస్తే ఊరుకోం
సాక్షి, కడప : ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న  జిల్లాలో అధికారులు ప్రోటోకాల్‌ను పాటించకుండా వ్యవహరిస్తున్నారని... ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అల్టిమేటం ఇచ్చారు.  సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కేవీ రమణను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి,  ఎమ్మెల్యేలు దేవగుడి ఆదినారాయణరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి,  గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌బీ అంజాద్‌బాష, కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, జయరాములు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కడప మేయర్ కె.సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు కలిశారు.

 ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సోమవారం చైర్మన్ పక్కన ఎమ్మెల్యేను ఎందుకు కూర్చోబెట్టలేదని ఎంపీ, ఎమ్మెల్యేలు కలెక్టర్‌ను గట్టిగా ప్రశ్నించారు. కౌన్సిలర్ల మధ్య కుర్చీ వేసి ఎమ్మెల్యేను కూర్చోమనడం సబబుగా లేదని... గతంలో వరదరాజులురెడ్డి, లింగారెడ్డిలను పక్కన కూర్చొబెట్టిన అధికారులు ప్రస్తుతం అలా చేయకుండా  ఎందుకు పక్షపాతం చూపుతున్నారని ప్రశ్నించారు.

టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ నిబంధనలను తుంగలో తొక్కితే చూస్తూ ఊరుకునేది లేదని, అవసరమైతే ఆందోళనలు చేయడానికి కూడా సిద్ధమని వారు హెచ్చరించారు. జిల్లాలో ఎన్నో ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏజెన్సీలు నిర్వహిస్తున్న వారిపై పార్టీ రంగు పులుముతూ ఇబ్బందులకు గురి చేయడం తగదని... రేషన్‌షాపు డీలర్లను  వేధింపులతోపాటు బెదిరింపులకు గురిచేయడం సహేతుకం కాదని కలెక్టర్‌కు వివరించారు.

జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం
జిల్లాలో అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో సహకరిస్తామని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు కలెక్టర్‌కు స్పష్టం చేశారు. జిల్లాకు ఎయిమ్స్‌తోపాటు సెయిల్, సెంట్రల్ యూనివర్శిటీలను తీసుకు రావాలని... ఈ విషయంలో ఎలాంటి అవసరం వచ్చినా తాము ముందుంటామని వారు తేల్చి చెప్పారు. పెద్ద పెద్ద పరిశ్రమలతోపాటు ప్రాజెక్టులు జిల్లాకు తీసుకువస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో ప్రాజెక్టులతోపాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు.

నూతన ఎస్పీ గులాఠీతో కాసేపు....
 నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టేందుకు సోమవారం సాయంత్రం కడపకు వచ్చిన జిల్లా ఎస్పీ గులాఠీని వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కలిశారు. పోలీసు అతిథి గృహంలో ఉన్న ఎస్పీ గులాఠీని మర్యాద పూర్వకంగా కలిసి జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న ఎస్పీకి వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.

జేసీ, జెడ్పీ సీఈఓలతో  చర్చలు
కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్, జెడ్పీ చైర్మన్ తదితరులు జేసీ రామారావును కలిశారు. టీడీపీ ఛోటా నేతల వేధింపులు, ఇతరఅంశాలపై వారు రామారావుతో చర్చించారు. అనంతరం జెడ్పీ కార్యాలయంలోసీఈఓ మాల్యాద్రితో కూడా భేటీ అయ్యారు. జెడ్పీ అభివృద్దికి సంబంధించిన అనేక అంశాలపై కూలంకషంగా చర్చించారు. జిల్లా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ముందుండాలని, ఇందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
Share this article :

0 comments: