జగన్ అండగా ఉంటారు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అండగా ఉంటారు..

జగన్ అండగా ఉంటారు..

Written By news on Wednesday, July 30, 2014 | 7/30/2014

ఈ బాధ ఎవ్వరికీ వద్దు
తూప్రాన్:  ‘సార్.. మా ఇద్దరు బిడ్డలను మాయదారి రైలు పొట్టనబెట్టుకుంది.. కన్నబిడ్డలు ఇద్దరు పోయి నిత్యం క్షోభకు గురవుతున్నాం.. ఈ గుండెకోత మరే తల్లిదండ్రులకూ రావొద్దు..’ అంటూ ఇస్లాంపూర్‌కు చెందిన తుమ్మ వీరబాబు వైఎస్సార్ సీపీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పట్టుకుని బోరున విలపించారు. దీంతో ఎంపీ కళ్లు చెమర్చాయి.. పక్కనే ఉన్న పార్టీ రాష్ట్రనేతలు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ చలించిపోయారు.

రైలు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను మంగళవారం వైఎస్సార్ సీపీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులతో కలిసి పరామర్శించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటన మేరకు.. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.50 వేల చొప్పున, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున అందించారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ భిక్షపతి, క్లీనర్ రమేశ్ కుటుంబాలకూ వైఎస్సార్‌సీపీ ఆర్థిక చేయూతనిచ్చింది. గుండ్రెడ్డిపల్లిలో తరుణ్ ఇంటివద్దకు చేరుకున్న ఎంపీ శ్రీనివాస్‌రెడ్డిని మహిళలు ఏడుస్తూ చుట్టుముట్టారు.

తరుణ్ తల్లి బాలమణిని ఎంపీ ఓదార్చారు. ‘అమ్మా అన్న ఎక్కడపోయాడు.. నేను టాటా చెప్పకుండా ఎటెళ్లాడు.. అంటూ నా బిడ్డ నన్ను అడుగుతోంది. తనకు ఏం చెప్పాలే.. అంటూ  విలపించింది. అక్కా..ధైర్యం తెచ్చుకో నీకు మేమున్నామంటూ చెమర్చిన కళ్లతో శ్రీనివాస్‌రెడ్డి ఓదార్చారు. ఇస్లాపూర్‌లో చిన్నారి వైష్ణవి కుటుంబ సభ్యులను శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. వైష్ణవి మేనమామ భూషణంగౌడ్, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

వైఎస్ జగన్ అండగా ఉంటారు..
మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెందిన 18 మంది చిన్నారుల కుటుంబాలను ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా నేతలు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితుల కుటుంబాల ఇళ్లలోకి వెళ్లి ఘటన వివరాలు తెలుసుకున్నారు. తమ ఎదుట కన్నీటి పర్యంతమవుతున్న తల్లిదండ్రులను సముదాయిస్తూ మీరు అధైర్యపడవద్దు.. మీకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని ధైర్యం చెప్పారు.

డ్రైవింగ్‌లో నా భర్తకు 30 ఏళ్ల అనుభవం ఉంది
తన భర్త భిక్షపతిగౌడ్‌కు డ్రైవింగ్‌లో 30 ఏళ్ల అనుభవం ఉందని, ప్రమాదంలో ఆయన తప్పిదం ఉండకపోవచ్చని భార్య శివలక్ష్మి అన్నారు. వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్, రైలు ప్రమాదంలో మృతి చెందిన భిక్షపతిగౌడ్ కుటుంబాన్ని ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించారు. శివలక్ష్మికి ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి రూ.50 వేలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త 30 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారని, ఆయన తప్పు చేయకపోవచ్చని తెలిపారు. అయితే ప్రమాదంలో చిన్నారులు చనిపోయిన విషయం గుర్తుకు వస్తే గుండె తరుక్కుపోతోందని విలపించారు. అలాగే రైలు ప్రమాదంలో మృతి చెందిన బస్సు క్లీనర్ రమేశ్ కుటుంబ సభ్యులను ఘనాపూర్ గ్రామంలో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.

రైలు ప్రమాద స్థలంలో నివాళి

రైలు ప్రమాదం చోటు చేసుకున్న మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద ఎంపీతో పాటు రాష్ట్ర, జిల్లా నేతలు మృతి చెందిన చిన్నారులకు నివాళులర్పించారు. మృతిచెందిన విద్యార్థుల చిత్రపటం వద్ద ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో పార్టీ నాయకులు సంజీవరావు, క్రీస్తుదాస్, జగదీశ్వర్‌గుప్తా, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు సంతోష్‌రెడ్డి, యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, జిల్లా నాయకులు రాంరెడ్డి, రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, శివశంకర్‌పాటిల్, మశ్చేందర్, నర్సింలు, సుధాకర్‌గౌడ్, పరశురాంరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సిద్ధిరాములుగౌడ్, రఘునందన్‌రావు, టీఆర్‌ఎస్ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: