
వాయిదా వేయడం విడ్డూరం:
ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. మా పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మను పోలీసులు తీసుకెళ్లి బెదిరించారు. ఓటు వేయలేనని చెప్పించారు. ఇంతకంటే దారుణం లేదు. 5వ తేదీన జరిగిన ఎన్నికల ప్రక్రియ సందర్భంగా మా సభ్యుడొకరిని అధికార పార్టీ నేతలు బలవంతంగా తీసుకెళ్లారు. అయినా ఆదివారం ఎన్నిక నాటికి మాకు 23 మంది సభ్యుల బలం ఉంది. పోలీసులు మా సభ్యులను బెదిరించారు. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినం. మాకు 22 మంది, టీడీపీకి 22 మంది సభ్యులున్నా కోరం లేదంటూ వాయిదా వేయడం విడ్డూరంగా ఉంది. నిజానికి టాస్ ద్వారా జెడ్పీ చైర్మన్ ఎన్నికను నిర్వహించాల్సి ఉంది. కానీ కలెక్టర్ అది చేయలేదు. ఎన్నికల పరిశీలకులు వచ్చినా ఒరిగిందేమీలేదు. అధికారపార్టీ ఆగడాలను ప్రజలు చూస్తున్నారు. ప్రజలే ప్రతిపక్షంగా తయారై చంద్రబాబు అంతు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
- మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ,
వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత
దురదృష్టకరం :
మాకు ఆదివారం నాటికి 23 మంది సభ్యులున్నారు. అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు మా సభ్యులపై జులుం ప్రదర్శించారు. మా పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మను బెదిరించారు. ఆమె ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఇది మరింత దుర్మార్గం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు దాన్ని కాలరాయడం దురదృష్టకరం. ప్రజలు మాకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినా అధికారపార్టీ వారు జెడ్పీ చైర్మన్ పదవి దక్కకుండా చేసేందుకే కుట్రలు చేశారు. చివరకు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికను వాయిదా వేయించారు.
వరప్రసాద్, తిరుపతి ఎంపీ
అధికారపార్టీ దౌర్జన్యం:
అధికారపార్టీ దౌర్జన్యం సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ఇది బ్లాక్‌డే. మాకు మెజార్టీ సభ్యులున్నా వారిని దౌర్జన్యంగా బెదిరించడం దారుణం. పోలీసులు పోలీసుల్లా వ్యవహరించలేదు. అధికారపార్టీకి తొత్తులుగా పనిచేశారు. టీడీపీ నేతలు సంతలో పశువులను కొన్నట్లు జెడ్పీటీసీ సభ్యులను కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇలాంటి వ్యవస్థలో శాసనసభ్యులుగా ఉన్నందుకే సిగ్గుగా ఉంది. జిల్లా పరిషత్ ఎన్నిక సందర్భంగా అక్రమాలకు పాల్పడిన అందరి అధికారులపై చర్యలు తీసుకోవాలి.
కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే
అధికారపార్టీవి నీచరాజకీయాలు:
అధికారపార్టీ విలువలకు తిలోదకాలు ఇచ్చి నీచరాజకీయాలకు పాల్పడింది. వైఎస్సార్‌సీపీకి మెజార్టీ జెడ్పీటీసీ సభ్యులున్నా ఆది నుంచి వారిని ప్రలోభాలకు గురిచేశారు. డబ్బు ఆశ పెట్టారు. పోలీసులను అడ్డుపెట్టి అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగారు. ఆదివారం నాటికి 23 మంది సభ్యులున్నారు. పోలీసుల జులుంతోనే పెంచలమ్మ భయభ్రాంతులకు గురైంది. ఇరు పార్టీలకు 22 మంది సభ్యులున్నా టాస్ ద్వారా ఎన్నిక నిర్వహించాల్సిన అధికారులు కోరం లేదంటూ వాయిదా వేయడం దారుణం. హైకోర్టు దీనిపై చర్యలు తీసుకోవాలి.
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరురూరల్ ఎమ్మెల్యే
ఇది అప్రజాస్వామికం:
జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతలు, అధికారులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం. ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. అధికారపార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టి దౌర్జన్య రాజకీయాలకు తెరలేపారు. పోలీసుల బెదిరింపులతోనే మా సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. కోరం లేదంటూ వాయిదా వేయడం అప్రజాస్వామికం.
మేకపాటి గౌతమ్‌రెడ్డి,
ఆత్మకూరు ఎమ్మెల్యే
దిగజారుడు రాజకీయాలకు
నిదర్శనం:
అధికారపార్టీ నేతలు సిగ్గువిడచి దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. వీరికి పోలీసులు వత్తాసు పలకడం మరింత సిగ్గుచేటు. వైఎస్సార్‌సీపీకి మెజార్టీ సభ్యులున్నా అధికారపార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టి అన్ని రకాలుగా అడ్డుకున్నారు. మా సభ్యులను ప్రలోభపెట్టారు. బెదిరించారు. పోలీసులను అడ్డుపెట్టి వేధింపులకు గురిచేశారు. దీంతో సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. చైర్మన్ ఎన్నిక నిస్పక్షపాతంగా జరపాల్సిన కలెక్టర్, ఎస్పీ అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. మా పార్టీ గుర్తుపై గెలిచిన వారు ఇతర పార్టీలకు మద్దతు పలకడం నీచ సంస్కృతి.
డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్,
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే
సినీ ఫక్కీలో డ్రామా :
అధికారపార్టీ నేతలు పోలీసులతో కలసి సినిమా ఫక్కీలో డ్రామా ఆడారు. మా సభ్యులను పక్కకు తీసుకెళ్లి బెదిరించారు. సాక్షాత్తు ఎన్నిక పరిశీలకులు, జిల్లా కలెక్టర్ సాక్షిగా ఇలా జరగడం దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా పరిషత్‌ను దక్కించుకోకూడదనే దురుద్దేశంతోనే అధికారపార్టీ నేతలు నీచానికి దిగజారారు.
పాశం సునీల్‌కుమార్,
గూడూరు ఎమ్మెల్యే
చంపేస్తామంటూ బెదిరించారు:
అధికారపార్టీ ఆదేశాలతో పోలీసులు పట్టుబట్టి మాపై జులుం ప్రదర్శించారు. మా సభ్యులను బెదిరించడంతో పాటు కిడ్నాప్ చేశారు. వైఎస్సార్‌సీపీకి ఓటేస్తే చంపేస్తామంటూ పెద్ద ఎత్తున బెదిరించారు. మాకు మెజార్టీ ఉన్నా పోలీసులు అడ్డుకోవడంతోనే కొందరు సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. తప్పుడు కేసులు పెట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలను ఆపాలి.
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే
ఇది దుర్దినం:
ప్రజాస్వామ్యంలో ఇది దుర్దినం. అధికారపార్టీ నేతలు, పోలీసులు కలసి ప్రజాస్వామ్యాన్ని మంట గలిపారు. మెజార్టీ జెడ్పీటీసీ సభ్యులున్నా వైఎస్సార్‌సీపీకి చైర్మన్ పదవి రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. టీడీపీ దౌర్జన్యాలను ప్రజలు చూస్తున్నారు. ఆ పార్టీకి ప్రజలు బుద్దిచెప్పే రోజు వస్తుంది. అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.
కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే
0 comments:
Post a Comment