మళ్లీ వ్యవసాయ సంక్షోభం దిశగా రాష్ట్ర రైతాంగం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మళ్లీ వ్యవసాయ సంక్షోభం దిశగా రాష్ట్ర రైతాంగం..

మళ్లీ వ్యవసాయ సంక్షోభం దిశగా రాష్ట్ర రైతాంగం..

Written By news on Thursday, July 3, 2014 | 7/03/2014

రైతు నెత్తిన పిడుగు
బాబు సీఎంగా ప్రమాణం చేసి నెలవుతున్నా మాఫీపై స్పష్టత కరువు
తాకట్టు బంగారం, భూములు వేలం వేస్తామంటూ బ్యాంకుల హెచ్చరికలు
రైతులకు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి చేస్తున్న బ్యాంకు అధికారులు
పాత రుణాలు పూర్తిగా తీరనిదే కొత్తవి ఇచ్చేది లేదని స్పష్టీకరణ
రైతుల్లో తీవ్ర ఆందోళన.. రుణాల మాఫీపై ఆవిరవుతున్న ఆశలు
మళ్లీ వ్యవసాయ సంక్షోభం దిశగా రాష్ట్ర రైతాంగం.. నిపుణుల ఆందోళన


నెట్‌వర్క్: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత మళ్లీ పెనుగండంలో పడ్డాడు. ఒకవైపు వ్యవసాయ రుణాల మాఫీపై చంద్రబాబు సర్కారు పిల్లిమొగ్గలు.. మరోవైపు రుణాలు తిరిగి చెల్లించాలంటూ బ్యాంకుల తాఖీదులు.. ఇంకోవైపు మళ్లీ సాగు కోసం కొత్త రుణాలు లభించిని దుస్థితి.. బ్యాంకుల రుణాలు, సాగు కోసం ప్రయివేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి.. ఇంత చేసినా ఖరీఫ్ ఆరంభమైనా వర్షాల జాడలేని ఆందోళనకరస్థితి.. అన్నీ కలగలిసి రైతన్నను అగాథంలోకి నెట్టివేస్తున్నాయి. తీవ్ర ఆందోళన, ఆశాభంగం, నిరాశానిస్పృహలతో రాష్ట్ర రైతాంగం కుంగిపోతోంది. నలుదిక్కుల నుంచీ సమస్యల దాడితో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సర్కారు ఇప్పటికైనా ఆదుకుంటుందా.. అన్నమాటను నిలబెట్టుకుంటుందా.. అని దైన్యంగా నిరీక్షిస్తోంది!!

ఎన్నికల వేళ.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలుత వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఊరూవాడా విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రైతుల రుణాల మాఫీపైనే తొలి సంతకం చేస్తాననీ హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణం చేయగానే ఫైలుపై సంతకం కూడా చేశారు. కానీ.. అది రుణాల మాఫీపై అధ్యయనానికి సంబంధించిన ఫైలు! మాఫీ ఎలా, ఎవరికి, ఎంత చేయాలి వంటి విధివిధానాలను సిఫారసు చేయటానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ఫైలు! కమిటీ 15 రోజుల్లో మధ్యంతర నివేదిక ఇస్తుందని, దాన్ని బట్టి రుణ మాఫీపై స్పష్టత ఇస్తామని బాబు ప్రకటించారు. ఆ 15 రోజులూ గడిచాయి. మధ్యంతర నివేదికకే మరో 10 రోజుల గడువు పెంచారు. బాబు సీఎంగా ప్రమాణం చేసి దాదాపుగా నెల కావస్తున్నా రుణ మాఫీ ఊసే లేదు! ఎట్టకేలకు సదరు కోటయ్య కమిటీ తాత్కాలిక నివేదిక ఇచ్చినా.. అందులో విధివిధానాల మాట లేదు!! ఇప్పుడేమో రుణాల మాఫీ మాట పక్కన పెట్టేసి రీషెడ్యూల్ రాగం వినిపిస్తున్నారు! అంటే రుణాల మాఫీ ఇప్పుడుండదు. ఎప్పుడుంటుందో తెలియదు. ఎవరికుంటుందో కూడా తెలియదు! పోనీ రీషెడ్యూల్ అయినా జరుగుతుందా అంటే అదీ అయోమయమే! ఇన్ని వేల కోట్ల రూపాయల రుణాలను రీషెడ్యూల్ చేయటం సాధ్యం కాదని భారతీయ రిజర్వు బ్యాంకు స్వయంగా స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా, కోటయ్య కమిటీ కలిసి విజ్ఞప్తి చేసినా అదే మాటను పునరుద్ఘాటించింది.
 రుణ మాఫీపై స్పష్టత ఇవ్వండని తాజాగా రాష్ట్ర స్థాయి సమావేశంలో బ్యాంకర్లు కోరినా బాబు నుంచి స్పష్టతే రాలేదు. మాఫీకి కట్టుబడ్డామన్నారే తప్ప ఎప్పుడు, ఎలా, ఎంత రుణాన్ని మాఫీ చేస్తామన్నది మాత్రం చెప్పలేదు. పైగా రైతు రుణాలను రీషెడ్యూల్ చేయండంటూ బ్యాంకర్లను కోరారు బాబు! ఆర్‌బీఐ అంగీకరిస్తేనే అది సాధ్యమని, ఆర్‌బీఐని సంప్రదించి అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తామని బ్యాంకర్లు స్పష్టంచేశారు. మరి రీషెడ్యూలైనా జరుగుతుందా, జరిగితే ఎన్ని మండలాలకు, ఎంతమందికి, ఎంత మొత్తానికి, బంగారం రుణాలకు, టర్మ్ రుణాలు కూడా వర్తిస్తుందా వంటి అనేకానేక ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. కానీ వీటిలో ఒక్కదానిపైనా స్పష్టత లేదు!! ఒకవైపు ఖరీఫ్ సీజన్ మొదలై రోజలు, వారాలు గడిచిపోతున్నాయి. మరోవైపు గత ఏడాది తీసుకున్న వ్యవసాయ రుణాల చెల్లింపు గడువు ముగిసిపోయింది. తీసుకున్న అప్పులు మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకుల నుంచి రైతులకు నోటీసులు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే తాకట్టు పెట్టిన బంగారాన్ని, భూములను వేలం వేసి తమ రుణాలకు జప్తులు చేసుకుంటామని హెచ్చరిస్తున్నాయి.

నోటీసు అందుకున్న 15 రోజుల్లో బ్యాంకు బకాయి చెల్లించకుంటే నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని స్పష్టంచేస్తున్నాయి. పలు చోట్ల రైతులు తాకట్టు పెట్టిన నగలు వేలం వేస్తున్నారు కూడా. కొన్ని ప్రాంతాల్లో అయితే రుణ బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకుల సిబ్బంది రైతులకు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి తెస్తున్నారు. ‘అసలు రుణమాఫీ అయ్యేది కాదు.. రీషెడ్యూలు చేసినా మీకే భారం పెరుగుతుంది. వడ్డీ పెరుగుతుంది. చక్ర వడ్డీ పడుతుంది. ఇప్పుడు చెల్లిస్తేనే మంచిది. కొత్త రుణాలు వస్తాయి. లేదంటే కొత్త అప్పులూ పుట్టవు’ అని చెప్పేస్తున్నారు. దీంతో.. రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పైగా.. బకాయిలు చెల్లించే దాకా కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు తేల్చి చెప్తున్నారు. రుణాలు రికవరీ కాకపోవడంతో పంట రుణాల పంపిణీని బ్యాంకులు పూర్తిగా పక్కన పెట్టాయి.

సమస్యల సుడిగుండంలో...

అప్పులు కట్టే మార్గం లేదు.. అప్పులు పుట్టకపోతే మళ్లీ సాగు చేసేదెలాగో తెలీదు! ప్రభుత్వ ఇచ్చిన హామీల మేరకు రుణాలన్నీ మాఫీ అవుతాయని.. మళ్లీ కొంత అప్పుచేసి సాగు చేసుకోవచ్చని గంపెడాశతో ఎదురు చూస్తున్న అన్నదాతలపై పిడుగులు పడ్డట్లే అవుతోంది. ఖరీఫ్ సీజన్‌లో అదును దాటిపోతుండటంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. వంద రూపాయలకు మూడు రూపాయలు, ఐదు రూపాయలు వడ్డీ చొప్పున అప్పులు చేస్తూ పాత బకాయిలపై వడ్డీలు కడుతున్నారు. వ్యవసాయం చేయకపోతే బతుకే లేని పరిస్థితుల్లో ప్రయివేటు అప్పులతో సాగుకు సమాయత్తమవుతున్నారు. పైగా.. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలోనే తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది.

ఇక అప్పులు చేసి సాగు చేసినా పంటల పరిస్థితి ఏమిటన్న భయాందోళనలు రైతులను పీడిస్తున్నాయి. బ్యాంకుల అప్పులు మాఫీ కాక, బ్యాంకుల నుంచి కొత్త రుణాలు రాక.. పాత బాకీలు తీర్చటానికి, మళ్లీ సాగుచేయటానికి భారీ వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేస్తూ... ఇలా ఎటు చూసినా రైతన్న మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. వెరసి ఆంధ్రప్రదేశ్ మళ్లీ వ్యవసాయ సంక్షోభం దిశగా పయనిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీపై సర్కారు పిల్లిమొగ్గలు, బ్యాంకుల నోటీసులు, కొత్త అప్పుల బాధలతో చాలామంది రైతుల నోట ఆత్మహత్యల మాటలు వినిపిస్తుండటం పెను ప్రమాద ఘంటికలను మోగిస్తోందని.. ప్రభుత్వం తక్షణమే తన వైఖరిని మార్చుకుని అన్నదాతను ఆదుకోకపోతే పది పదిహేనేళ్ల కిందటి పరిస్థితులు పునరావృతమవుతాయని హెచ్చరిస్తున్నారు.

బ్యాంకర్లు, అధికారులు ముందే వివరాలిచ్చినా...

నిజానికి కోటయ్య కమిటీ ఏర్పాటుకు ముందే, అంటే బాబు సీఎంగా ప్రమాణం చేయడానికి ముందే ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో రైతులకు ఎంత మేరకు రుణాలు ఇచ్చామన్న విషయాన్ని బ్యాంకర్లు, అధికారులు ఆయనకు నివేదికలు అందించారు. పంట రుణాలెన్ని, బంగారం కుదవపెట్టి వ్యవసాయానికి తీసుకున్న రుణాలెన్ని వంటి వివరాలన్నింటినీ కేటగిరీలవారీగా అందజేశారు. అయినా బాబు మాత్రం వాటి సంగతిని పక్కన పెట్టి కోటయ్య కమిటీ వేశారు. అదేమో తన పని ప్రారంభిస్తూనే రుణాలు తీసుకున్న రైతుల సంఖ్యను, తద్వారా రుణాల మొత్తాన్ని కుదించడంపైనే దృష్టి సారించింది!
Share this article :

0 comments: