అండగా నేనున్నాంటూ భరోసా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అండగా నేనున్నాంటూ భరోసా

అండగా నేనున్నాంటూ భరోసా

Written By news on Wednesday, July 16, 2014 | 7/16/2014

ఆర్తులకు అండగా..
శ్రీకాకుళం అర్బన్: కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడిచేందుకు.. బాధితుల బతుకు బాధలు తెలుసుకునేందుకు.. అండగా నేనున్నాంటూ భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టనున్నారు. వారం రోజుల వ్యవధిలో తమిళనాడులోని చెన్నై, ఆ సమీపంలో జరిగిన దుర్ఘటనల్లో మృతి చెందిన జిల్లావాసుల కుటుంబాలను గురు, శుక్రవారా ల్లో ఆయన పరామర్శించనున్నారు. అమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట, టెక్కలి, పాలకొండ  నియోజకవర్గాల పరిధిలో పొట్టకూటి కోసం వలస చెన్నై ప్రాంతానికి వెళ్లిన వారిలో 14 మంది భవనం కూలిన ఘటనలో చనిపోగా ఇద్దరు గాయపడ్డారు. కొద్ది రోజుల వ్యవధిలోనే తిరువళ్లూరు జిల్లాలో గోడ కూలిన దుర్ఘటనలో మరో 9మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. వీరి కుటుంబాలను జగన్ తన పర్యటనలో పరామర్శించి, అండగా ఉంటానని భరోసా ఇవ్వనున్నారు.

 పాలకొండ నియోజకవర్గంలో ప్రవేశం
 విజయనగరం పర్యటన ముగించుకుని బుధవారం సాయంత్రం ఆయన శ్రీకాకుళం జిల్లా పాలకొండకు వస్తారని వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలు తెలిపారు. 17, 18 తేదీల్లో ఎల్‌ఎన్‌పేట, భామిని, హిరమండలం, కొత్తూరు, పాలకొండ, కోటబొమ్మాళి, నరసన్నపేట, బూర్జ, సారవకోట తదితర మండలాల్లో పర్యటిస్తారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి జిల్లాకు వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి కోసం జిల్లా ప్రజలతోపాటు, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. బాధల్లో ఉన్న తమను ప్రభుత్వం పెద్దగా పట్టిం చుకోకపోయినా.. తమ కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వస్తున్న జగన్ కోసం బాధిత కుటుంబాలు కూడా ఆశ గా ఎదురుచూస్తున్నాయి.

 రెండు రోజుల పర్యటన : కృష్ణదాస్
 బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు వస్తున్న జగన్‌మోహనరెడ్డి పర్యటనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నైలో నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం కూలిన ఘటనలో అందులో విజయనగరం, శ్రీకాకుళంకు చెందినవారు చనిపోయారన్నారు. అలాగే గోడ కూలిన ఘటనలో జిల్లాకు చెందిన 9మంది మృతి చెందారని పేర్కొన్నారు.  బాధిత కుటుంబాలకు ప్రకటించిన రాయితీలను ప్రభుత్వం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. వైఎస్ మరణం తట్టుకోలేక చని పోయిన వారిని ఓదార్చి అండగా నిలిచినట్లే.. ఇపుడు చనిపోయిన వారి కుటుంబాలకు మనోస్ధైర్యం కలిగించేందుకు వస్తున్నారన్నారు.

 పార్టీ నాయకుడు నర్తు నరేంద్ర యాదవ్ మాట్లాడుతూ పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి చనిపోవడం దురదృష్టకరమన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు సత్వరమే రుణాలు అందించాలన్నారు. రుణమాఫీ వాగ్దానాన్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎం.వి.పద్మావతి, చల్లా అలివేలు మంగ, టి.కామేశ్వరి, జె.ఎం.శ్రీనివాస్, శిమ్మ వెంకట్రావు,  మామిడి శ్రీకాంత్,  కె.ఎల్.ప్రసాద్, మండవిల్లి రవి, కోణార్క్ శ్రీను,  శ్రీనివాస్ పట్నాయక్, గుడ్ల మల్లేశ్వరరావు, రామారావు, కోరాడ రమేష్, కె.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ
   పార్టీ నాయకుడు తమ్మినేనిసీతారాం
 ఆమదాలవలస: ఆపదలో ఉన్నవారికి, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుం బాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉం టుందని పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నా రు. తన స్వగృహం లో ఆమదాలవలస నియోజకవర్గ స్థారుు పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల చెన్నైలో జరిగిన రెండు ప్రమాదాల్లో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికులకు చెందిన కుటుంబాలను ఓదార్చేందుకు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు వస్తున్నారని, ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సరుబుజ్జలి ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జెడ్పీటీసీ ప్రతినిధి సురవరపు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు జె.జె.మోహన్‌రావు, బి.రవికుమార్, బి.రమేష్‌కుమార్‌లతో పాటు నాలుగు మండలాలకు చెందిన పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీ సభ్యులు, కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.

   పర్యటన ఇలా..
  బుధవారం సాయంత్రం జగన్‌మోహన్‌రెడ్డి పాలకొండ ప్రాంతంలో జిల్లాలోకి ప్రవేశిస్తారు. పాలకొండకు చెందిన ఊళ్ల రవి అనే మృతుడి కుటుం బాన్ని పరామర్శిస్తారు.
  గురువారం ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గా ల్లో చెన్నై సంఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శిస్తారు.
   శుక్రవారం నరసన్నపేట నియోజకవర్గంలో మిగిలిపోయిన ప్రాంతాల తో పాటు టెక్కలి నియోజకవర్గంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లాఅధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
Share this article :

0 comments: