సీఎం స్థాయి వ్యక్తి ఇంత దిగజారాలా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం స్థాయి వ్యక్తి ఇంత దిగజారాలా!

సీఎం స్థాయి వ్యక్తి ఇంత దిగజారాలా!

Written By news on Monday, July 7, 2014 | 7/07/2014

సీఎం స్థాయి వ్యక్తి ఇంత దిగజారాలా: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా.. లేక గూండాస్వామ్యమా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అసలు ఆంధ్రరాష్ట్రంలో ఉండాలంటేనే భయమేస్తోందన్నారు.  హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను సోమవారం ఉదయం కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ సాగించిన అరాచకాలను సాక్ష్యాలతో సహా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

మెజారిటీ లేకపోయినా.. ఇతర పార్టీల సభ్యులను ప్రలోభపెట్టడం దగ్గర్నుంచి భయానక వాతావరణం సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించడం, వైఎస్ఆర్ సీపీ సభ్యులందరినీ బయటకు పంపేసి టీడీపీ వాళ్లు జడ్పీ ఛైర్మన్లుగా ఎన్నికైనట్లు ప్రకటించడం లాంటి అరాచకాలన్నింటినీ గవర్నర్ నరసింహన్ కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరించారు. వీటికి సంబంధించిన దృశ్యాలను సీడీల రూపంలో ఆయనకు అందించారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇంకా జగన్ ఏమన్నారంటే..
ఆ మూడు రోజులూ ప్రజాస్వామ్యం ఖూనీ
''గవర్నర్ గారిని కలిశాం. మొన్న 3, 4, 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరును వివరించాం. ఆ మూడు రోజులు మండల పరిషత్ ఛైర్మన్లు, జడ్పీ ఛైర్మన్లు, మునిసిపల్ ఛైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, సాక్షాత్తు అధికార పార్టీయే దారుణాలకు పాల్పడింది. ఇది ఎంతవరకు న్యాయమని గవర్నర్ కు డీవీడీ కాపీలు కూడా ఇచ్చాం. మామూలుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ కార్పొరేషన్ల పదవుల్లోకి వేరే పార్టీల బీఫారాల మీద గెలిచినవాళ్లను లాక్కోవాలనే ప్రయత్నం ఇంతవరకు ఎవరూ చేయలేదు. ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోకుండా.. చివరకు మండలపరిషత్, మునిసిపాలిటీలు, జడ్పీ పదవులు కూడా లాక్కోవాలనుకోవడం దౌర్భాగ్యం.
సీఎం స్థాయి వ్యక్తి ఇంత దిగజారాలా?
టీడీపీ బీ ఫారాల మీద గెలవకపోయినా.. ప్రజలు వాళ్లకు వ్యతిరేకంగా ఓటేసి, వైఎస్ఆర్ సీపీ వారిని గెలిపించినా, వారిని భయపెట్టి, బెదిరించి, కిడ్నాప్ చేసి వాళ్లతో బలవంతంగా ఓట్లేయించుకునే కార్యక్రమం చేశారు. సాక్షాత్తు సీఎం స్థాయి వ్యక్తి ఫోన్లు చేసి జడ్పీటీసీలతో మాట్లాడారంటే వ్యవస్థ ఎటు పోతోందో మనమంతా ఆలోచించాలి. ఈ రకంగానే స్థానిక పదవులను లాక్కోవాలనుకుంటే పార్టీ గుర్తుల మీద ఎన్నికలు ఎందుకు జరిపారు? మీరే నామినేట్ చేసుకుంటే సరిపోయేది కదా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానం ఉంది. బలం ప్రకారం అయితే 4 జడ్పీ ఛైర్మన్లు మాకు రావాలి. కానీ కడప ఒక్కటే వచ్చింది. కోరం ఉన్నా కూడా కావాలని రెండుచోట్ల వాయిదా వేయించారు. టీడీపీవాళ్లతో కలెక్టర్ సమక్షంలోనే పోలీసుల సాయంతో దిగజారి రాజకీయాలు చేస్తే చెప్పుకోడానికి ఎక్కడికి పోవాలి?

మాకున్న బలం ప్రకారం 239 ఎంపీపీలు గెలవాలి, 200 మాత్రమే గెలిచాం. అలాగే 36 మున్సిపల్ ఛైర్మన్ పదవులు దక్కించుకోవాలి.. 19 మాత్రమే దక్కాయి. ప్రజలు మాకు బలం ఇచ్చినా అధికార దుర్వినియోగంతో పదవులను చేజిక్కించుకోవాలని సీఎం పదవిలో ఉన్న వ్యక్తి చేయడం ఎంతవరకు న్యాయం, ధర్మం? చంద్రబాబుకు ఒక్కమాట చెప్పదలచుకున్నా. ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకుంటే.. అధికారంలో ఉన్నాం కదా అనుకోవడం మూర్ఖత్వం. నిజమైన ప్రతిపక్షం మీకు ఓట్లేసిన ప్రజలే. మేనిఫెస్టోలో మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్న మీరు నిజంగా మనుషులు కారనిపిస్తోంది.
 
ప్రజలే విపక్షం.. వారే కాలర్ పట్టుకుంటారు
ప్రజాస్వామ్యంలో విపక్షమన్నదే లేకుండా చేయాలని గొంతు నొక్కుతున్నారు. ప్రజలే కాలర్ పట్టుకునే రోజు వస్తుంది . రైతులకు రుణమాఫీ చేస్తామని అబద్ధాలు చెప్పారు. ఇంటింటికీ ఉద్యోగం, ఇవ్వలేకపోతే 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రైతులు, నిరుద్యోగులు మీ కాలర్ పట్టుకుంటారు. రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. గవర్నర్ గారికి లేఖ ఇచ్చాం. చంద్రబాబు ఎన్నికైన తర్వాత 17 మంది వైసీపీ కార్యకర్తలను చంపించడం, 110 మందిని తీవ్రంగా గాయపర్చడం, చీనీ చెట్లను నరికించడం.. ఇవీ చంద్రబాబు చేయించిన పనులు. ఈ నేరాలపై కేసులు పెట్టడానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు స్టేషన్లకు వెళ్తే, కేసులు ఎందుకు పెట్టడంలేదు? టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహించి ఇలా చేయించడం ఎంతవరకు న్యాయం? మృతుల్లో సగానికి పైగా ఎస్సీలు, మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యాలు చేయిస్తున్నారు. ఇది భావ్యమేనా?
రాష్ట్రపతిని, ప్రధానిని కూడా కలిసి ఫిర్యాదుచేస్తాం
మేం ఇంతటితో ఆపం. రాబోయే రోజుల్లో రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, కేంద్ర హోం మంత్రిని కూడా కలిసి చెబుతాం. రాబోయే రోజుల్లో ఆళ్లగడ్డ, నందిగామ అసెంబ్లీ, నంద్యాల ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అవి ఎలా జరుగుతాయోనని ఆశ్చర్యంగా ఉంది. ఇంత భయాందోళనల మధ్య ఎస్పీలు, కలెక్టర్లు అందరూ చంద్రబాబు చెప్పినట్లే చేస్తుంటే ఎలాగోనని భయమేస్తోంది. ఆంధ్రరాష్ట్రంలో బతకాలంటేనే భయం వేస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి అధికార పార్టీ ఇదే తరహాలో ప్రవర్తిస్తుంది. అందరినీ నామినేట్ చేసేస్తారు. ఇదే జరిగితే రాబోయే తరాలకు తప్పుడు సందేశం పంపినట్లవుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, వైఖరి మార్చుకోండి. గవర్నర్ గారు బాగానే స్పందించారు. ఆయన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం.''
లేఖ పూర్తి ప్రతి ఇక్కడ చదవండి..
Share this article :

0 comments: