హత్యారాజకీయాలపై చర్చను పక్కదోవ పట్టిస్తూ టీడీపీ ఎదురుదాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హత్యారాజకీయాలపై చర్చను పక్కదోవ పట్టిస్తూ టీడీపీ ఎదురుదాడి

హత్యారాజకీయాలపై చర్చను పక్కదోవ పట్టిస్తూ టీడీపీ ఎదురుదాడి

Written By news on Saturday, August 23, 2014 | 8/23/2014

నోటికొచ్చినంత..
 హత్యారాజకీయాలపై చర్చను పక్కదోవ పట్టిస్తూ టీడీపీ ఎదురుదాడి
 పరుష పదజాలంతో జగన్‌పై విమర్శలు..
 దీటుగా తిప్పికొట్టిన వైసీపీ

 
 సాక్షి, హైదరాబాద్: హత్యా రాజకీయాలపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ అట్టుడికింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హత్యలపై శాసన సభలో చర్చ జరగాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. ఈ చర్చ జరగనీయకుండా పక్కదారి పట్టించడానికి అధికార తెలుగుదేశం పార్టీ తొలి నుంచీ ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగుతోంది. చర్చ కోరిన ప్రతిసారీ పరిటాల రవి అంశాన్ని ప్రస్తావిస్తూ అధికార పార్టీ అడ్డగోలు ఆరోపణలతో అడ్డుతగులుతోంది. పరిటాల రవి హత్యను ప్రస్తావించిన దరిమిలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వంగవీటి రంగా హత్యను ప్రస్తావనకు తేవడంతో పరస్పర వాగ్వాదానికి దారి తీస్తోంది. చివరకు శుక్రవారం అధికారపక్షం దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పైన, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైన, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపైన ఏకంగా వ్యక్తిగత దూషణలకే దిగింది.

వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచిపోషించారని, రాక్షస పాలన సాగించారని తెలుగుదేశం పార్టీ సభ్యులు దూషించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక ఉన్మాది అని, నరరూప రాక్షసుడని, హంతకుడంటూ  అడ్డగోలు దూషణలకు దిగారు. దీనికి జగన్ స్పందిస్తూ చేయని తప్పుకు బఫూన్లతో ఇలా అనిపించుకోవాలా అని అన్నారు. వెంటనే అధికారపక్ష సభ్యులు నిరసనలకు దిగారు. దీంతో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలపై వైఎస్సార్ సీపీ ఇచ్చిన నోటీసుపై శుక్రవారం లఘు చర్చకు అనుమతించారు. ఈ సందర్భంగా మరోసారి వంగవీటి రంగా, పరిటాల రవి హత్యల ప్రస్తావన వచ్చింది. దీంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని తాము లేవనెత్తిన అసలు సమస్యకే చర్చను పరిమితం చేద్దామని హితవు పలికారు. అధికార, ప్రతిపక్షాలు రెండు వైపుల నుంచి పాత విషయాలను పక్కనపెట్టి ఈ మూడు నెలల కాలంలో జరిగిన 14 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తల హత్యలపై చర్చ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

రాజకీయ హత్యలకు గురైన వారి కుటుంబాలకు న్యాయం చేయడం అందరి కర్తవ్యమని, ఎప్పుడో జరిగిన హత్యల గురించి విపక్షం ప్రస్తావించదని, అలాగే అధికార పక్షం కూడా ప్రస్తావించకుండా గత మూడు నెలల్లో జరిగిన హత్యలకే చర్చను పరిమితం చేద్దామని సూచించారు. తన పార్టీ ఎమ్మెల్యేలకూ సూచిస్తానని, అధికారపక్షం కూడా దీనికి కట్టుబడి ఉండాలని కోరారు. అయినప్పటికీ అధికారపక్షం మాత్రం చర్చకన్నా పదేపదే పరిటాల రవి అంశాన్ని ప్రస్తావిస్తూ అమర్యాదపూర్వకమైన మాటలతో అడ్డగోలు వాదనలకు దిగింది. దాంతో ఒక దశలో పరస్పరం ఆవేశకావేశాలు ప్రదర్శించారు. ప్రతిపక్ష నేత ఆర్థిక ఉన్మాది అని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు దొంగలు, స్మగ్లర్లు అంటూ అధికార తెలుగుదేశం పక్షం నేతలు దూషణలకు దిగారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపైన కూడా దూషణలను దిగారు. ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషించారని, రాక్షస పాలన సాగించారంటూ దూషించారు. జగన్ నరరూప రాక్షసుడని, హంతకుడని, అవినీతి పరుడంటూ తీవ్రస్థాయిలో ఒకరితర్వాత ఒకరన్నట్టు దూషించడం మొదలుపెట్టారు. ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో లేని, ఇక రాలేని, సమాధానం చెప్పుకోలేని వ్యక్తులపై (వైఎస్‌పై) అడ్డగోలుగా మాట్లాడకుండా కట్టడి చేస్తూ రూలింగ్ ఇవ్వాలని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష సభ్యుడు కాకాని గోవర్ధన్‌రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అయినప్పటికీ దూషణల పర్వం కొనసాగిస్తుండటంపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. చేయని తప్పుకు బఫూన్లతో ఇలా అనిపించుకోవాలా? అని ఆవేదనతో ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలపై అధికారపక్ష సభ్యులు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను శనివారానికి వాయిదా వేశారు.
 
 శాంతిభద్రతల సమస్యపై సభలో చర్చ సాగిన తీరిదీ..
 
 కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ): తొలి బడ్జెట్ సమావేశాల్లో శాంతిభద్రతల సమస్యపై చర్చించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. టీడీపీ అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినా ఎన్నికల హామీల అమల్లో అడుగు మందుకు పడలేదు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు, వారి ఆస్తుల విధ్వంసం విషయంలో ప్రభుత్వం జెట్ వేగంతో ముందుకెళుతోంది. విపక్ష పార్టీ కార్యకర్తలను రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా చూడటం దుర్మార్గం. ప్రజల గొంతుకకు ప్రతి పక్షం తోడు కాకుండా ఉండటానికే అధికారపక్షం దాడులకు తెగబడుతోంది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు, దాడులుగానే చూడాలి. నాకు గన్‌మెన్ అక్కర్లేదని సరండెర్ చేశాను. కానీ ఇప్పుడు భయమేస్తోంది. వంగవీటి రంగా, ఎన్‌కౌంటర్ పత్రిక ఎడిటర్ పింగళి దశరథరామ్, మల్లెల బాబ్జీ, ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు హత్యలు గుర్తుకొస్తున్నాయి. ఎన్టీఆర్ మరణం గుర్తుకొస్తోంది.

 తెలుగుదేశం పార్టీ సభ్యులు: ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం పట్ల అభ్యంతరం

 వైఎస్ జగన్: గత మూడు నెలల్లో జరిగిన 14 హత్యల మీదే చర్చను పరిమితం చేద్దాం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందో చెప్పాలి. ప్రభుత్వం ఏం చెబుతుందో అని ఆ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి.

 ధూళిపాళ్ల నరేంద్ర (టీడీపీ): లేని సమస్యను తీసుకొచ్చి అధికార పార్టీ మీద బురద చల్లడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. మేం ఎవరినీ శత్రువులుగా చూడటంలేదు. వంగవీటి రంగా, ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన మత ఘర్షణలకు కారణం ఎవరు?

 బోండా ఉమామహేశ్వరరావు (టీడీపీ): వైఎస్ రాజశేఖరరెడ్డి నరమేధాన్ని సృష్టించారు. రాక్షస పాలన సాగించారు. వైఎస్ ప్రభుత్వం 120 మందిని హత్య చేసింది. నరరూప రాక్షసుడు. ప్రాణభయం ఉందంటూ పరిటాల రవి నిండు సభలో చెప్పారు.
 కాకాని గోవర్ధన్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ): (పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ) సభలో లేని వ్యక్తులు, ఇక్కడకు వచ్చి సమాధానం చెప్పుకోలేని వారి మీద నిందారోపణలు చేయడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై స్పష్టమైన రూలింగ్ ఇవ్వాలి.

 డిప్యూటీ స్పీకర్: దీనిపై స్పీకర్ రూలింగ్ ఇస్తారు.

 ధూళిపాళ్ల నరేంద్ర (టీడీపీ): వారు వంగవీటి రంగా, ఎన్టీఆర్ గురించి మట్లాడారు. మమ్మల్ని మాట్లాడొద్దంటే ఎలా?

 వైఎస్ జగన్: సభను రాష్ట్రం మొత్తం చూస్తోంది. ఇక్కడ ప్రవర్తించే తీరును ప్రజలు గమనిస్తున్నారు. శాంతిభద్రతల మీద చర్చ కోసం పట్టుబడినప్పటికీ 11 హత్యలు జరిగాయి. చర్చ మొదలుపెట్టేసరికి హత్యల సంఖ్య 14కు చేరింది. హత్యా రాజకీయాలపై ప్రభుత్వ తీరులో మార్పు వచ్చే దిశగా చర్చ జరగాలి. చర్చను తప్పుదోవ పట్టించడానికి పరిటాల రవి కేసును తీసుకొస్తున్నారు. ఆ కేసు విచారణ ఎప్పుడో ముగిసింది. నా మీద చేస్తున్న ఆరోపణలన్నీ సత్యదూరమని చంద్రబాబుకూ తెలుసు. నాతోపాటు అనంతపురానికి చెందిన జేసీ సోదరులకు రవి హత్యతో సంబంధం లేదని కోర్టు చెప్పింది. అందుకే జేసీ సోదరులను చంద్రబాబు పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చారు. వంగవీటి రంగా పేరును మా ఎమ్మెల్యేలు ప్రస్తావించరు. పరిటాల రవి పేరును మీరూ (అధికారపక్షం) తేవద్దు. 14 బాధిత కుటుంబాలకు మంచి చేయాలంటే చర్చ బాగా సాగాలి. ఆ కేసుల దర్యాప్తు, విచారణ సక్రమంగా జరిపి, న్యాయం చేసే విధంగా ప్రభుత్వం హామీ ఇవ్వాలి. రాజకీయ హత్యలకు గురైన కుటుంబాలకు రూ. 20 లక్షల సాయం ప్రకటించాలి.

 బోండా ఉమామహేశ్వరరావు (టీడీపీ): పరిటాల రవి హత్యలో పాత్రధారి, సూత్రధారి జగన్. వైఎస్సార్ సీపీ వల్లే శాంతిభద్రతల సమస్య. హత్యలు చేయించి బతికిన ఘనత జగన్‌దే.

 కొడాలి నాని (వైఎస్సార్ సీపీ): శాంతిభద్రతల మీద చర్చ అడిగినప్పటికి 11 హత్యలు జరిగాయి. ఈ రెండు మూడు రోజుల్లో మరో 3 హత్యలు జరిగాయి. అంతకుముందు ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యల గురించి చర్చ కోరలేదు. గతంలో హత్యలు జరిగినప్పుడు వైఎస్సార్ సీపీ అధికారంలో లేదు. మా పార్టీ పెట్టి 3 సంవత్సరాలే అయింది. అప్పుడు జగన్ సీఎం కాదు. రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చి నిలబెట్టింది టీడీపీనే. నేను వ్యతిరేకంగా ఓటేస్తే అనర్హత వేటువేసి ఒక సంవత్సరం ఇంటి వద్ద కూర్చోబెట్టారు. మంత్రి ఉమామహేశ్వరరావు ప్రోద్బలంతోనే కృష్ణా జిల్లా గొట్టుముక్కల గ్రామంలో హత్య జరిగిందని మేం బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు స్థానికులు చెప్పారు. పరిటాల హత్య కేసులో జగన్, జేసీ సోదరుల ప్రమేయం లేదని కోర్టు చెప్పింది. అందుకే జేసీ సోదరులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. రాజకీయంగా వాడుకోవడానికే జగన్ పేరును పదేపదే టీడీపీ ప్రస్తావిస్తోంది. మేం కూడా వారి పార్టీలో చేరితే రవి కేసుతో సంబంధం లేదని చెబుతారేమో! వైఎస్‌ఆర్ అంటే డాక్టర్ వైఎస్‌ఆర్. డాక్టర్‌గా పదిమందికి ప్రాణాలు పోయడం తప్ప తీయడం తెలియని నాయకుడు. ఆరోగ్యశ్రీ పెట్టి వేలాది మంది ప్రాణాలు కాపాడిన మహానుభావుడు. మనిషి రూపంలో ఉన్న దేవుడు. అలాంటి వ్యక్తిని నరరూప రాక్షసుడని నిందించడం న్యాయమా? జగన్ రాజకీయాల్లోకి వచ్చిన మూడేళ్లకే 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు ఆశీర్వదించారు. 30 ఏళ్ల టీడీపీకి 1.35 కోట్ల ఓట్లు వస్తే, మాకు 1.30 కోట్ల ఓట్లు వచ్చాయి. 14 హత్యల మీద న్యాయవిచారణ జరిపించాలి. హత్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

 మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు: గొట్టుముక్కలలో జరిగినది సాధారణ హత్యే. రాజకీయ హత్య కాదు. పరిటాల రవిని హత్య చేయించలేదని జగన్ చెప్పగలరా?

 వైఎస్ జగన్: బురద జల్లడం తప్ప, జరిగినదానికి బాధ్యత తీసుకోవాలనే స్పృహ లేదు. బాధితులను ఆదుకుంటామని ఒక్క మంత్రి కూడా చెప్పకపోవడం దురదృష్టకరం. ఇంకా రెచ్చగొట్టి రాజకీయ హత్యలు కొనసాగిస్తే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కళ్లు తెరవండి. హత్యా రాజకీయాలు చేయొద్దు. 14 హత్యలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి. నిష్పాక్షింగా వ్యవ హరించాలని పోలీసులకు ఆదేశాలివ్వండి.

 మంత్రి బొజ్జల: దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. మీరు (వైఎస్సార్ సీపీ సభ్యులు) నాయకుడిని మార్చుకోండి. బాగుపడతారు. చంద్రబాబుకే బాంబు పెట్టి పేల్చారు.

 గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ): టీడీపీ అధికారంలోకి రాకముందు జరిగిన హత్యలకు, ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రాణభయం ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రాణభయం బయటవారి నుంచి కాదు. స్వపక్షం నుంచే. విజయవాడ మీద కర్రపెత్తనం కోసం రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆధిపత్య పోరాటంలో వంగవీటి రంగా హత్య జరిగింది. పరిటాల హత్య రాజకీయ హత్య. అనంతపురం జిల్లాలో గనుల దోపిడీకి ఎదురులేకుండా చేయడానికి రవిని హత్య చేయించారు. మంగలి కృష్ణ ఎవరో జగన్‌కు తెలియదా? విచారణలో ఎవరి పేరు చెప్పారో అందరికీ తెలుసు.

 జగన్ : మీరు ప్రస్తావిస్తున్న కేసుల్లో విచారణలు జరిగాయి. చేయని తప్పునకు బఫూన్లతో ఇలా అనిపించుకోవాలా?

 టీడీపీ సభ్యులు: జగన్ వ్యాఖ్యలకు నిరసనగా అధికార సభ్యులంతా స్పీకర్ పోడియం వద్ద నిలబడి.. జగన్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ కల్పించుకొని ఈ వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని చెప్పారు. సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి 1.45 గంటలకు సభ సమావేశమైంది

 గోరంట్ల (టీడీపీ): అనుభవ రాహిత్యం, అహంకారం, శాడిజం వల్ల కావచ్చు.. మమ్మల్సి బఫూన్లు అన్నారు. మమ్మల్ని అనడం అంటే మమ్మల్ని ఎన్నుకున్న కోట్లాది మంది ప్రజలను అన్నట్లే. క్షమాపణ చెప్పాలి.

 పి. శ్రీనివాసులురెడ్డి (టీడీపీ): బఫూన్లంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి. జగన్‌ను సస్పెండ్ చేయాలి.

 ధూళిపాళ్ల నరేంద్ర (టీడీపీ): ప్రజలను అవమానించే విధంగా వ్యాఖ్యానించారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.

 శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ): రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. పోలీస్ స్టేషన్లకు వెళ్లి మొరపెట్టుకున్నా స్పందించడంలేదు. సభలో లేని వ్యక్తిని, ఫ్యాక్షన్‌ను రూపుమాపిన వ్యక్తిని, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తిని ఎన్నెన్నో మాటలన్నారు. దివంగత నేత వైఎస్సార్ ఆశయాలు కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చిన జగన్ మీద అసూయతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.

 స్పీకర్: సభా నాయకుడి తర్వాత ప్రతిపక్ష నేతకే ప్రాధాన్యత. మీరు వాడిన మాట నేను గతంలో ఎప్పుడూ సభలో వినలేదు.  హుందాగా ఉపసంహరించుకోండి.
 జగన్: ఇదే సభలో నన్ను హంతకుడన్నారు. నరరూప రాక్షసుడన్నారు. మా ఎమ్మెల్యేలను స్మగ్లర్లు అన్నారు. ఎంతవరకు న్యాయం?

 టీడీపీ సభ్యులు: (జగన్ మాట్లాడుతున్నప్పుడు..) స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు చేశారు.  వారిని దీటుగా ఎదుర్కొంటూ వైఎస్సార్ సీపీ సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభను స్పీకర్ శనివారానికి వాయిదా వేశారు.
 
Share this article :

0 comments: