జనానికి దాహం.. బాబుకు ఆర్భాటం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనానికి దాహం.. బాబుకు ఆర్భాటం!

జనానికి దాహం.. బాబుకు ఆర్భాటం!

Written By news on Wednesday, August 27, 2014 | 8/27/2014


జనానికి దాహం.. బాబుకు ఆర్భాటం!
చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయగానే కుప్పంలో ఆర్‌అండ్‌బీ  అతిథిగృహానికి ముస్తాబు
అదే అతిథిగృహానికి  మరమ్మతులకు రూ.47 లక్షలు  కేటాయిస్తూ ఉత్తర్వులు
ఆ బంగ్లాలో అదనపు గదులు, ఫర్నీచర్ కోసం తాజాగా రూ.60 లక్షలు మంజూరు
కుప్పం నియోజకవర్గంలో 280 గ్రామాల్లో  తీవ్ర తాగునీటి ఎద్దడి
సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించని వైనం

 
ప్రజాభ్యుదయం మాటేమోగానీ..విలాసాలకూ ఆడంబరాలకూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు ప్రభుత్వం తగలేస్తోంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులే అందుకు తార్కాణం. కుప్పం నియోజకవర్గంలో 280 గ్రామాల ప్రజలు తీవ్రమైన తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రజల దాహార్తి తీర్చడానికి నిధులు కేటాయించని సీఎం.. కుప్పంలో అద్దంలా మెరిసిపోతున్న ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి నగిషీలు అద్దడానికి, అదనపు గదుల నిర్మాణానికి, ఫర్నీచర్ కొనుగోలుకు రూ.1.07 కోట్లు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది.

వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లా వ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. కుప్పం నియోజకవర్గంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. తాగునీటి పథకాల బోరు బావులు ఎండిపోయాయి. కుప్పం నియోజకవర్గంలోని 280 గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఇది కుప్పం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియంది కాదు. తాగునీటి ఎద్దడి నివారణకు నిధులు కేటాయించకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పొలాల్లో వ్యవసాయ బోరు బావుల వద్ద బిందెడు నీళ్లు తెచ్చుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇదో పార్శ్వం.. మరో పార్శ్వం ఏమిటంటే 1995లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే కుప్పంలో నాలుగు సూట్ల, అధునాతన సదుపాయాలతో కూడిన ఆర్‌అండ్‌బీ అతిథిగృహాన్ని నిర్మిం చారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఎప్పుడు పర్యటించినా ఇక్కడే బస చేస్తారు. జూన్ 8న చంద్రబాబు సీఎంగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. 16, 17 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు.

చంద్రబాబు పర్యటనకు ముందుగానే ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి మరమ్మతులు చేశారు. పెయింటింగ్ చేయించి.. నగిషీలు అద్దారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా ఫర్నీచర్‌ను అప్పటికే సిద్ధం చేశారు. కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహాన్ని అద్దంలా మెరిసేలా చేయడంలో ఆశాఖ అధికారులు కృతకృత్యులయ్యారు. ఇంతవరకూ బాగానే ఉంది. అద్దంలా మెరిసిపోతున్న కుప్పం  ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి మరమ్మతులు చేయడానికి రూ.47 లక్షలు కేటాయిస్తూ ఈనెల 21న ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబు ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం:638) జారీచేశారు. ఆ ఉత్తర్వులు జారీ అయి నాలుగు రోజులు కూడా తిరక్క ముందే ఆ అతిథిగృహంలో అదనపు గదుల నిర్మాణానికి రూ.40 లక్షలు, ఫర్నీచర్ కొనుగోలుకు రూ.20 లక్షలు మంజూరు చేస్తూ ఈనెల 25న ఆదేశాలు(జీవో ఎంఎస్ నెం: 647) జారీచేశారు. అంటే.. కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి హంగులు, ఆర్భాటాలు అద్దడానికి రూ.1.07 కోట్లు మంజూరు చేశారన్న మాట. ఓ వైపు ఆర్థిక పరిస్థితులు అనుకూలించని స్థితిలో ఖర్చులు తగ్గించుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశిస్తూనే.. మరో వైపు తన సొంత నియోజకవర్గంలో అతిథిగృహానికి నగిషీలు అద్దేందుకు ఆడంబరాల కోసం రూ.1.07 కోట్లను తగలేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆడంబరాల కోసం వెచ్చిస్తోన్న రూ.1.07 కోట్లను కుప్పం నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఖర్చు చేస్తే వేలాది మంది ప్రజల దాహార్తి తీరుతుందని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తుండటం కొసమెరుపు.
Share this article :

0 comments: