రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై జగన్ నిప్పులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై జగన్ నిప్పులు

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై జగన్ నిప్పులు

Written By news on Thursday, August 28, 2014 | 8/28/2014

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై జగన్ నిప్పులు
ఉచిత విద్యుత్‌కు రూ. 4,580 కోట్లు అవసరం.. కేటాయింపు రూ. 3,185 కోట్లు
వడ్డీ లేని రుణాలకు రూ. 2,560 కోట్లు కావాలి.. కేటాయించింది రూ. 599 కోట్లు
సామాజిక పెన్షన్లకు రూ. 3,730 కోట్లు అవసరం.. ఇచ్చింది రూ. 1,338 కోట్లు
రైతుల రుణాలే రూ. 87,612 కోట్లున్నాయి.. మాఫీకి ఇచ్చింది రూ. 5 వేల కోట్లు
ఈ రుణాలపై వడ్డీ, అపరాధ వడ్డీ లక్షకు రూ. 24 వేలవుతోంది.. ఆ ఊసే లేదు
రూ. 14,204 కోట్ల డ్వాక్రా మహిళల రుణాల మాఫీ గురించి మాట్లాడడమే లేదు
నిరుద్యోగ భృతికి ఏడాదికి రూ. 36,000 కోటు ్లఅవసరం... కానీ ఇచ్చింది సున్నా
బీసీలకు రూ. 10 వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్ అన్నారు.. కేటాయింపు రూ. 993 కోట్లు
రూ. 1,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. బడ్జెట్‌లో ఆ హామీ ఊసే లేదు
రూ. 5,000 కోట్లతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి అన్న హామీ ప్రస్తావనా లేదు
చేనేత కార్మికులకు రూ. 1,000 కోట్ల ప్రత్యేక నిధీ లేదు.. చేనేత రుణాల మాఫీ లేదీ
కాపుల సంక్షేమం కోసం ఏటా రూ. 1,000 కోట్లు ఇస్తామని.. 50 కోట్లకే సరిపెట్టారు
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 500 కోట్లు అన్నారు.. రూ. 25 కోట్లే విదిలించారు
అర్హులందరికీ ఇళ్ల కోసం రూ. 15,000 కోట్లు కావాలి.. కేటాయింపు రూ. 808 కోట్లు
ఆహార సబ్సిడీకి రూ. 4,671 కోట్లు అవసరం.. బడ్జెట్లో ఇచ్చింది రూ. 2,318 కోట్లు
ఫీజులు, స్కాలర్‌షిప్‌లకు రూ. 3,700 కోట్లు కావాలి.. కేటాయింపు రూ. 2,100 కోట్లే
ఎన్‌టీఆర్ సుజల స్రవంతి’ కోసం రూ. 250 కోట్లు కావాలి.. ఇచ్చింది రూ. 5 కోట్లు
ప్రణాళిక బడ్జెట్‌ను తగ్గించివేయడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ భారీగా తగ్గిపోయింది
ఉద్యోగాల నియామకాల ఊసు లేదు.. పీఆర్‌సీ అమలుకు కేటాయింపులూ లేవు

 
 రాష్ట్ర బడ్జెట్‌పై శాసనసభలో సాధారణ చర్చలో మాట్లాడటానికి, ఏకైక ప్రతిపక్షంగా తమ పార్టీ అభిప్రాయాన్ని చెప్పి ముగించడానికి మరికొంత సమయం ఇవ్వాలని గత రెండు రోజులుగా కోరినప్పటికీ సమయం ఇవ్వలేదని.. దీంతో ప్రజల పక్షాన బడ్జెట్‌కు సంబంధించి ప్రజా సమస్యలను మీడియా ముందు వినిపించాల్సి వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఆర్థికమంత్రి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నలు సంధించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు.. ఆ పార్టీ ప్రభుత్వం బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు ఏమాత్రం పొంతన లేదని.. హామీలు, వాటికి చేసిన కేటాయింపుల గణాంకాలతో విడమరిచి చెప్పారు. హామీలు నెరవేర్చాలంటే ఎంతమేరకు నిధులు అవసరమవుతాయో చెప్తూ.. వాస్తవంగా బడ్జెట్‌లో ఎంత కేటాయించిందీ పేర్కొంటూ.. అవసరమైన మేరకు కేటాయించకపోవడాన్ని ఎత్తిచూపారు. నిధులు కేటాయించకుండా, హామీలను నెరవేర్చకుండా కాకి లెక్కలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వైనంపై జగన్ నిప్పులు చెరిగారు. సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా తమ గొంతు నొక్కుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి ఏమన్నారంటే...
 
 ‘‘బడ్జెట్‌పై చర్చలో సరైన చర్చ లేకుండానే ఆర్థికమంత్రి సమాధానం ఇచ్చారు. చర్చలో ప్రతిపక్షానికి గంటన్నర మాత్రమే సమయం కేటాయించారు.  బహుశా అసెంబ్లీ చరిత్రలోనే ఇలా జరగడం మొదటిసారి. మామూలుగా బడ్జెట్‌పై చర్చ ఆరు రోజులు జరగాలి. కానీ నాలుగు రోజులకే కుదించారు. గత పదిహేనేళ్ల నుంచీ చూస్తే బడ్జెట్‌పై ఏ ప్రతిపక్ష నాయకుడైనా కనీసం రెండు, రెండున్నర గంటలు ప్రతి కేటాయింపుపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ రోజు అసెంబ్లీలో రెండే పార్టీలున్నాయి. ఒకటి అధికార పక్షం.. రెండోది ప్రతిపక్షం. వేరే సభ్యులు లేరు. అధికార పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, కేటాయింపులపై నిజంగా మాట్లాడేది ప్రతిపక్షమైన మేము తప్ప వేరే పార్టీ లేదు. అయినా బడ్జెట్ చర్చలో ‘ప్రతిపక్షానికి గంటన్నర మాత్రమే ఇస్తాం.. అంతకన్నా ఎక్కువ సమయం ఇచ్చేది లేదు’ అనే నియంత పోకడ మొట్టమొదటిసారిగా ఈరోజే చూస్తున్నాం. మొన్న బడ్జెట్‌పై మాట్లాడుతుంటే మధ్యలోనే మైక్ కట్‌చేశారు. ఆ రోజు 11.08 నిమిషాలకు ప్రారంభిస్తే అంతరాయాల మధ్య చివరికి 1.40కి మైక్ కట్ చేశారు. రెండున్నరగంటల సమయంలో గంట ఆరు నిమిషాలు అంతరాయాలు కల్పించారు.
 
 ఈ రోజు (బుధవారం) కూడా చర్చలో మైక్ కట్‌చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని ముగిస్తాను.. అరగంట సమయం ఇవ్వాలని, అధికారపక్షానికి ఎలా అంటే అలా సహకరిస్తామని చెప్పాము. కానీ ఫలితం లేదు. సమయం ఇవ్వలేదు. సభలో ఇప్పటివరకు జరిగిన చర్చను చూస్తే ఏ ఒక్కరూ కూడా.. బడ్జెట్ కేటాయింపులు ఎంత చేశారు.. అసలు ప్రజలకు ఎంత అవసరం అనేది చెప్పలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని తిట్టడమే అధికారపక్ష సభ్యులు పనిగా పెట్టుకున్నారు. ఆయన చనిపోయి ఐదేళ్లు అవుతోంది.. కానీ ఇంకా ఆయనే సీఎం అన్నట్లు తిట్టడమే తప్ప.. ప్రజలకు ఏమి కావాలి? ఏ స్కీముకు ఎంత కేటాయించాలి? అన్నది చెప్పలేదు. ప్రజలకు తెలియాల్సిన అంశాలను తెలియనీయకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారు. అక్కడ ప్రసంగాన్ని ముగించడానికి అవకాశం చిక్కనందున ఆ అంశాలను మీడియా ద్వారా ప్రజలకు వివరించదల్చుకున్నాను. ఏది సబబో, ఏది సరైనదో ప్రజలే నిర్ణయిస్తారు.
 
 రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఎలా ?
 రైతులకు వడ్డీ లేని పంట రుణాల కింద రూ. 56,000 కోట్లు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్లు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ పుస్తకంలో పొందుపర్చారు. కానీ.. రైతులకు ప్రస్తుత రుణ బకాయిలున్నాయి. డ్వాక్రా మహిళల రుణాలు రూ. 14 వేల కోట్లు ఉంది. వీరికి నాలుగు శాతం వరకు వడ్డీ రాయితీ కల్పించాలంటే ఆ నాలుగు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు కట్టాలి. అప్పుడే రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అవుతుంది. ఈ లెక్కన రైతులు, డ్వాక్రా మహిళల రుణాలపై నాలుగు శాతం చొప్పున మొత్తం రూ. 2,560 కోట్లు వడ్డీ కింద బడ్జెట్లో కేటాయించాలి. అపుడే రైతులు, మహిళలకు మంచి జరుగుతుంది. కానీ బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూ. 599 కోట్లు మాత్రమే. ఇది ఎంతవరకు సరైనది?
 
 దీనర్థం.. సామాజిక పెన్షన్లను ఊడబెరుకుతారనే కదా?
 గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్‌సైట్ ప్రకారం రాష్ట్రంలో 43,11,688 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ. 130 కోట్లు చెల్లిస్తున్నారు. అక్టోబర్ నుంచి వృద్ధులు, వికలాంగులకు పెన్షన్‌ను రూ. 1,000 కి పెంచుతున్నట్లు చెప్పారు. ఈ ఐదు నెలలకు రూ. 650 కోట్లు అవసరం. ఇదంతా ఇపుడున్న పెన్షన్‌దారుల విషయం మాత్రమే. కొత్తగా పెన్షన్ల కోసం 15 లక్షల దరఖాస్తులున్నాయి. వాటి  గురించి నేను చెప్పడం లేదు. అక్టోబర్ నుంచి రూ. వేయి చొప్పున పెంచాల్సి ఉన్నందున.. ఆ ప్రకారం లెక్కవేస్తే అదనంగా రూ. 431 కోట్లు కావాలి. ఇవి కాకుండా 5,36,837 వికలాంగుల పెన్షన్లు రూ. 1,500 చొప్పున వేస్తే మరో రూ. 10 కోట్లు ఉండాలి. మొత్తం కలిపితే దాదాపు రూ. 441 కోట్లు ప్రతి నెల అవసరం. రానున్న ఏడు నెలలకు 3,080 కోట్లు అవసరం. ఇప్పటివరకు ఉన్న ఐదు నెలలకు కావలసిన రూ. 650 కలిపితే మొత్తం రూ. 3,730 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో రూ. 1,338 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఇంకా రూ. 2,392 కోట్లు అంతరం ఉంది. దానర్థం ఉన్న పెన్షన్లు ఊడబెరుకుతారనే కదా?
 
 వ్యవసాయానికి 7 గంటల కరెంటూ ఇవ్వరు...
 రాష్ట్రంలో 14.54 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. వీటిలో 3 హార్స్ పవర్ నుంచి 10 హార్స్ పవర్ వరకు వినియోగించేవి ఉన్నాయి. సరాసరి ఒక్కో పంపు సెట్టు ఐదు హార్స్ పవర్ ఉంటుంది. ఉచిత విద్యుత్తు 9 గంటలు కాకున్నా కనీసం 7 గంటలు చొప్పున ఇస్తే గంటకు ఒక హార్స్‌పవర్‌కు 0.75  యూనిట్లు అవుతుంది. ఏడు గంటల పాటు పంపు నడిస్తే గంటకు ఒక హెచ్‌పీకి 5.25 యూనిట్లు ఖర్చవుతుంది. 5 హెచ్‌పీకీ రోజుకు 26.25 యూనిట్లు అవసరం. ఏడాదికి 7,875 యూనిట్లు ఒక్కో పంపు సెట్‌కు కావాలి. రాష్ట్రంలోని 14.54 లక్షల పంపు సెట్లకు ఏడాదికి 1,145 కోట్ల యూనిట్లు విద్యుత్తు అవసరం. దీన్ని యూనిట్‌కు రూ. 4 చొప్పున కొనుగోలు ధర వేస్తే రూ. 4,580 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో రూ. 3,188 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే వ్యవసాయానికి 7గంటలు కూడా కరెంటు ఇవ్వరని అర్థమవుతోంది.
 
 రూ. 5 వేల కోట్లతో రైతుల రుణ మాఫీనా?
 అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. అందుకు రూ. 87,612 కోట్లు అవసరం. ఎస్‌ఎల్‌బీసీలో బ్యాంకర్లే ఈ విషయం ప్రభుత్వానికి చెప్పారు. బడ్జెట్లో కేవలం రూ. 5,000 కోట్లు మాత్రమే పెట్టారు. మీ మాటలు నమ్మి డబ్బులు కట్టని కారణంగా ప్రతి లక్షకు రూ. 12 వేలు చొప్పున రైతులు వడ్డీ కట్టాలి. ఈ ఏడాది కూడా మీరు కట్టకపోవడంతో మరో రూ. 12 వేలు వడ్డీ పడుతోంది. ఈ రూ. 24 వేల వడ్డీ ఎవరు కడతారో బడ్జెట్లో ప్రస్తావనే లేదు. రూ.14,204 కోట్ల డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇపుడు మాఫీ గురించి మాట్లాడడడం లేదు.
 
 రూ. 808 కోట్లతో ఇంటి స్థలం, ఇల్లు ఎలా ఇస్తారు?
 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి లక్షన్నర రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. గుడిసెలనేవి లేకుండా చేస్తామన్నారు. అలా చేయాలంటే 10 లక్షల ఇళ్లు కట్టాలి. ఇందుకు రూ. 15,000 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో కేటాయింపులు చేసింది రూ. 808 కోట్లు మాత్రమే. ఇళ్ల లబ్ధిదారులపై పిడుగుపాటుగా ఇటీవల యూఓ నోట్ విడుదల చేశారు. గృహనిర్మాణంపై విధాన నిర్ణయం తీసుకునే వరకు బిల్లుల చెల్లింపులు ఆపాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 5.5 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 450 కోట్లు బకాయిలున్నాయి. తాజా ఆదేశాలతో బిల్లులు రాక ఈ 5.5 లక్షల మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోపక్క ఇప్పటికే మంజూరై పనులు మధ్యలో ఉన్న  7.95 లక్షల ఇళ్లు రద్దుచేస్తున్నట్లు ఆ నోట్‌లో పేర్కొన్నారు.
 
 ఆహార సబ్సిడీకి రూ. 1,853 కోట్ల లోటు
 రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డులు, అన్నపూర్ణ, అంత్యోదయ, రచ్చబండలో ఇచ్చినవి ఇలా అన్నీ కలిపి.. కోటి నలభై లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఇవి కాకుండా పింక్ కార్డులు 14.86 లక్షలున్నాయి. తెల్లకార్డులకు ప్రతి నెలా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాలి. ఇందుకు రూ. 1,223 కోట్లు అవసరం. ఇది కాకుండా అమ్మహస్తం కింద తొమ్మిది సరుకులు రూ. 185 ధరకి ఇస్తున్నారు. రూ. 292 అయ్యే ఈ మొత్తంలో సబ్సిడీ 107 రూపాయలు ప్రభుత్వం భరిస్తోంది. కోటి నలభై లక్షల తెల్లకార్డులకు ఈ అమ్మహస్తానికి ప్రతి నెలా రూ. 1,788 కోట్లు అవసరం. ఇక అక్టోబర్ నుంచి కేంద్రం ప్రవేశపెట్టే కొత్త ఆహార విధానం వస్తుంది. ఇందుకు సంబంధించి మరో రూ. 1,000 కోట్లకు పైగా రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ఈ అన్నిటికీ కలిపి రూ. 4,671 కోట్లు అవసరం. బడ్జెట్లో రూ. 2,318 కోట్లు మాత్రమే చూపెట్టారు. అంటే 1,853 కోట్లు లోటు. దీనర్థం ఏమిటి? పైగా ఆరు నెలలుగా గోధుమలు, పామాయిల్ కూడా రేషన్ కార్డులపై ఇవ్వడం లేదు.
 
 ఫీజు రీయింబర్స్‌మెంటుకు సగమే ఇచ్చారు...
 సాంఘిక సంక్షేమ వెబ్‌సైట్లో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు చూపుతున్నారు. అందులో 9.54 లక్షలు మంజూరు కాగా మిగతావి చేయాల్సి ఉంది. 2013-14 సంవత్సరానికి ఉమ్మడి రాష్ట్రంలో స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంటు కోసం ఖర్చు చేసినది రూ. 4,286 కోట్లు. దానిలో 60 శాతం సీమాంధ్ర అనుకుంటే రూ. 2,487 కోట్లు అవుతుంది. గత ఏడాదికి సంబంధించి బకాయిలు రూ. 990 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ రెండూ కలిపితే రూ. 3,500 కోట్ల వరకు అవుతుంది. ఇది కాక సీమాంధ్ర పిల్లలు తెలంగాణలో చదువుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఫీజులు కట్టకుంటే ఈ ప్రభుత్వమైనా కట్టాలి. లేకపోతే పిల్లల జీవితాలు నాశనమవుతాయి. దాదాపు 40 వేల మంది తెలంగాణలో చదువుతున్న సీమాంధ్ర విద్యార్థులు ఉన్నారు. వీరికి రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్లు అవసరం. ఈ లెక్కన ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్పుల కింద మొత్తం రూ. 3,700 కోట్లు కావాలి. కానీ బడ్జెట్లో రూ. 2,100 మాత్రమే కేటాయింపు చూపారు. రూ. 1,600 కోట్ల మేర కోతపెట్టారు. దీంతో పిల్లల భవిష్యత్తేమి కానుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఇవన్నీ చూస్తే రూ. 15,000 కోట్ల పైచిలుకే లోటు పెడుతున్నట్లు అర్థమవుతుంది.
 
 బీసీలకు, మైనారిటీలకూ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి...
 మైనారిటీలకు సంబంధించి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చనిపోక ముందు బడ్జెట్లో రూ. వేయి కోట్లు పెట్టారు. తరువాతి ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని తగ్గించే ధైర్యం చేయలేదు. అందులో 60 శాతం అంటే దాదాపు రూ. 600 కోట్లు కేటాయించాలి. కానీ బడ్జెట్లో రూ. 371 కోట్లు కేటాయించారు. దీనినిబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైనారిటీలపై ఎంత ప్రేముందో అర్థమవుతుంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే బీసీలకు, మైనారిటీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటుచేయాలి. అప్పుడే వారికి మంచి జరుగుతుంది.
 
 రూ. 5 కోట్లతో ఐదు వేల గ్రామాలకు మినరల్ వాటర్ ఇస్తారా?
 ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ (మంచినీరు) ఇస్తామని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దీన్ని ఐదు వేల గ్రామాలకు విస్తరిస్తామన్నారు. ఐదు వేల గ్రామాల్లో ఒక్కో గ్రామంలో బోరు, మోటారు. షెడ్డు, మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 5 లక్షలు అవసరం. ఇలా ఐదు వేల గ్రామాలకు రూ. 250 కోట్లు కావలసి ఉండగా బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ. 5 కోట్లు మాత్రమే.
 
 బాబు వస్తే జాబన్నారు.. నియామకాలు నిలిపేశారు..
 ‘బాబు వస్తాడు -  జాబు వస్తుంద’ని ఎన్నికల ముందు రకరకాలుగా హామీలు ఇచ్చారు. కానీ జూన్ 24వ తేదీన చంద్రబాబునాయుడు కింద ఉండే జీఏడీ విభాగం.. కొత్తగా నియామకాలు నిలిపేయాలని ఏపీపీఎస్‌సీకి ప్రత్యేకంగా లేఖ రాసింది. నియామకాలపై సమగ్ర విధానం  రూపొందించే వరకు నియామకాలు ఆపేయాలని అందులో ఆదేశించారు. రాష్ట్రంలో 1.60 లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా అధికారంలోకి వచ్చి భర్తీ చేయాల్సింది పోయి ఆపేయాలంటుండడం విచారకరం.
 
 ఉద్యోగుల పీఆర్‌సీ అమలు ఏమైనట్లు?
 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పదో పీఆర్‌సీ అమలు విషయాన్ని బడ్జెట్‌లో కేవలం ప్రస్తావన చేసి వదిలేశారు. పదో పీఆర్సీ గత ఏడాది 2013 జూలై నుంచి అమలు కావలసి ఉంది. అధికారంలోకి రాగానే పీఆర్సీ అమలు చేస్తామన్నారు. ఇప్పటికి సీఎంకు ఆ నివేదిక ఇచ్చి రెండు నెలలవుతున్నా 4 లక్షల మంది ఉద్యోగులు, 3.58 లక్షల మంది పెన్షనర్ల గురించి చర్యలు లేవు, బడ్జెట్‌లో కేటాయింపులు లేవు.
 
 నాడు ఉద్యమాలు చేసి.. నేడు బాక్సైట్ తవ్వకాలేమిటి?
 వైఎస్సార్, ఆ తరువాత ముఖ్యమంత్రులు ఎవరూ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బాక్సైట్ మైనింగ్ చేపట్టలేదు. వీరెవ్వరూ ప్రజాభిప్రాయాన్ని బుల్డోజ్ చేయలేదు. ప్రజల దగ్గరకు వెళ్లి మీకు కావాలా? వద్దా? అని అడిగి.. కావాలంటేనే చేయాలి. లేదంటే మానుకోవాలి. అంతే తప్ప వద్దంటున్నా మైనింగ్‌కు ముందుకు వెళ్లడమేమిటి? గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకపోయినా ఉద్యమాలు చేయించారు. ఇపుడు అధికారం వచ్చాక ప్రజాభిప్రాయానికి భిన్నంగా మైనింగ్‌కు ముందుకు వెళ్లడమెందుకు? దీనివల్ల అక్కడ నక్సలైట్ల సమస్య వస్తోంది. శాంతిభద్రతల సమస్య ఏర్పడుతోంది. ప్రజలకు ఇష్టం లేనపుడు వదిలేయాలి తప్ప ముందుకు వెళ్లడమెందుకు?
 
 ‘ప్రణాళిక’ తగ్గింపుతో ఎస్సీ, ఎస్టీ  సబ్‌ప్లాన్‌లో భారీగా తగ్గుదల
 ఇక ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి చెప్పాలి. ఎవరు మైకు పట్టుకున్నా సగం తెలిసీ, తెలియని విధంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ను దుమ్మెత్తిపోయడం తప్ప మరే పనీలేదు. అయినా ఓపిగ్గా విన్నాం. 2012 డిసెంబర్ 12న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం వచ్చింది. దాని ప్రకారం ప్రతి ఏటా ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ప్లాన్ బడ్జెట్లో కేటాయింపులు చేయా ల్సి ఉంది. ఈ సబ్‌ప్లాన్ రాకముం దు 2012 దాకా చాలా మంది సీఎంలు నిధులు మళ్లిం చారు. ఇది అందరూ చేశారు. చట్టం వచ్చాక మళ్లింపు కాకుం డా కేటాయింపులు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు ఎవ రి హయాం లో ఎంతమేర కేటాయింపులు జరిగాయో చూ స్తే ఒక్క వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎక్కువ కేటాయింపులతో వారికి మేలు చేకూరినట్లు గర్వంగా చెప్పగలం.
 
 ఈ రకంగా 2013-14 సంవత్సరానికి రివైజ్డ్ బడ్జెట్‌ను ఇవ్వాల్సి ఉన్నా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. రివైజ్డ్ బడ్జెట్ లేని దుస్థితిలో బడ్జెట్‌పై చర్చించుకోవలసి వస్తోంది. సబ్‌ప్లాన్‌కు ప్రధాన భాగం ప్రణాళిక కేటాయింపులు మాత్రమే. ప్రణాళిక కేటాయింపుల్లో ఎక్కువ ఉంటే సబ్‌ప్లాన్ ఎక్కువ వస్తుంది. ప్రణాళిక బడ్జెట్ రూ. 35,000 కోట్లుంటే అందులో 23 శాతం కేటాయింపు ఎస్సీ, ఎస్టీలకు నిధులు అందుతాయి. అదింకా పెరిగితే ఆ మేరకు సబ్‌ప్లాన్ నిధులు పెరుగుతాయి. గత పదిహేనేళ్ల బడ్జెట్లు చూస్తే ప్రణాళిక బడ్జెట్ 35 శాతానికి తగ్గకుండా కనిపిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మొదటిసారి ఈ ప్రణాళిక బడ్జెట్‌ను 35 శాతం నుంచి 23 శాతానికి పడేసింది. ప్రణాళిక బడ్జెట్ 23 శాతానికి తగ్గినందున ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులూ తగ్గిపోతాయి. ప్రణాళిక బడ్జెట్‌కు, కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌కు సంబంధముంటుంది. ప్రణాళిక బడ్జెట్ ప్రకారమే గ్రాంట్సు వస్తాయి. కానీ ప్రణాళిక తగ్గించి గ్రాంట్లు పెంచారు. ఇది అర్థం కాని విషయం.

 చంద్రబాబు ఇవన్నీ చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై మాట్లాడించారు. గృహ నిర్మాణాల్లోనూ మంజూరు మధ్యలో ఉన్న 7.94 లక్షల ఇళ్లను రద్దుచేశారు. దానిలో అత్యధిక ఇళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలవి కావా? రెండోది బిల్లుల చెల్లింపులు ఆపేయాలని చెప్పారు. దాదాపు 5.5 లక్షల మంది ఇళ్ల లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉన్నారు. వీరికి రూ. 450 కోట్లు బకాయి ఉంది. ఈ బకాయిలు ఇవ్వకుండా నిలిపేశారు. ఇంకా దారుణమేమంటే.. రైతులకు బ్యాంకుల నుంచి కొత్త రుణాలు అందడం లేదు. నూటికి మూడు, నాలుగు రూపాయల చొప్పున వడ్డీ చెల్లించి బయట అప్పు తెచ్చుకుంటున్నారు. వీరిలో అధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే. వర్షాలు లేనందున పనుల కోసం వెళ్తున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువ మంది ఉన్నారు. కానీ వారికి పనులు కూడా దొరక్కుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు నిలిపేయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాదా? వీరి పరిస్థితి ఏమిటి?
 
నిరుద్యోగ భృతికి కేటాయింపులేవీ?
 ఇంటికో ఉద్యోగమిస్తామన్నారు. లేనిపక్షంలో రూ. 2,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కోటిన్నర ఇళ్లున్నాయి. ఇంటికి 2,000 చొప్పున నెలకు రూ. 3,000 కోట్లు, ఏడాదికి రూ. 36,000 కోటు ్లఅవసరం. కానీ బడ్జెట్లో కేటాయింపులు సున్నా.
 -    బీసీలకు రూ. 10,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ పెడతామని చెప్పారు. బడ్జెట్లో కేటాయించింది రూ. 993 కోట్లే.
 -    రూ. 1,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతామని చెప్పారు. మార్కెట్లో ధరలు మండిపోతున్నా బడ్జెట్‌లో ఆ నిధి ఊసే లేదు.
 -    రూ. 5,000 కోట్లతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి ప్రవేశపెడతామన్నారు. వ్యవసాయ బడ్జెట్ అంటూ ఆడంబరంగా ప్రత్యేక బడ్జెట్ పెట్టారు.. కానీ ఈ నిధి గురించి మాట్లాడలేదు.
 -    చేనేత కార్మికులకు రూ. 1,000 కోట్లతో ప్రత్యేక నిధి ఇస్తామన్నారు. బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదు. చేనేత రుణాల మాఫీ అన్నారు. అదీ కనిపించలేదు. చేనేత రుణాలు రూ. 300 కోట్లు ఉన్నాయి. ధర్మవరం, ఉరవకొండలో చేనేత కార్మికులకు నోటీసులు వస్తున్నాయి. ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నా వారికి సహాయానికి నిధి ఊసే లేదు.
 -    కాపుల సంక్షేమం కోసం ఏటా రూ. 1,000 కోట్లు, ఐదేళ్లకు రూ. 5,000 కోట్లు కేటాయిస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. బడ్జెట్లో రూ. 50 కోట్లకే సరిపెట్టారు.
 -    బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఇస్తామని చెప్పి.. రూ. 25 కోట్లు మాత్రమే విదిలించారు.
Share this article :

0 comments: