33 శాతం అసెంబ్లీ సీట్లు మనమే ఇద్దాం.. సిద్ధమేనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 33 శాతం అసెంబ్లీ సీట్లు మనమే ఇద్దాం.. సిద్ధమేనా?

33 శాతం అసెంబ్లీ సీట్లు మనమే ఇద్దాం.. సిద్ధమేనా?

Written By news on Sunday, September 7, 2014 | 9/07/2014

33 శాతం అసెంబ్లీ సీట్లు  మనమే ఇద్దాం.. సిద్ధమేనా?వీడియోకి క్లిక్ చేయండి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్ సవాల్
 
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నిజంగా దమ్మూ ధైర్యం ఉంటే వెనుకబడిన తరగతుల వారికి (బీసీలకు) రాష్ట్ర శాసనసభలో 33 శాతం సీట్లు ఇవ్వడానికి సిద్ధం కావాలని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేయడం కొత్తేమీ కాదు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇపుడు కూడా అసెంబ్లీలో అదే తీర్మానం చేశారు. ఇలా చేస్తే వచ్చే లాభమేంటి? నిజంగా బీసీలకు మేలు జరగాలంటే నేనొక సలహా ఇస్తా.. తెలుగుదేశం పార్టీ వారికి దమ్మూ ధైర్యం ఉంటే చెప్పమనండి. తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు (టీడీపీ), మేము (వైఎస్సార్ సీపీ) రెండే పార్టీలు ఉన్నాయి. బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ వారే పోటీ చేసే విధంగా 33 శాతం సీట్లు ఇచ్చేద్దాం. పార్టీ పరంగా నేను అలా చేయడానికి రెడీగా ఉన్నా.. వాళ్లు కూడా సిద్ధమేనేమో చెప్పమనండి. పోటీ బీసీ వర్సెస్ బీసీ (బీసీ అభ్యర్థిపై బీసీ అభ్యర్థే) గానే ఉండాలి. బీసీ అభ్యర్థుల మీద బాగా డబ్బున్న షావుకార్లను తెచ్చి పోటీకి పెట్టకూడదు. అంతేగానీ.. ఇలా ఊరికే రాసి కేంద్రానికి పంపితే వచ్చే ప్రయోజనమేంటి?’’ అని జగన్ ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో బీసీ తీర్మానంపై ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, వెంటనే సభ వాయిదా పడటంతో.. ఆ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుకు నిజంగా బీసీలపై ప్రేమ లేదని.. ఎన్నికలు వచ్చినపుడల్లా బీసీలకు వంద సీట్లు ఇస్తానని ఆయన మాటలు చెప్పడం తప్ప ఆచరణలో అమలు చేయలేదని జగన్ తూర్పారబట్టారు.

జగన్ ఎమన్నారో ఆయన మాటల్లోనే...

‘‘ప్రతిసారీ ఎన్నికలకు ముందు బీసీలకు వంద సీట్లు అని చంద్రబాబు చెప్తున్నారు. 2004, 2009 చివరకు 2014 ఎన్నికల ముందు కూడా ఈ మాటలు నేను విన్నాను. అయితే ఆయన ఎపుడూ వారికి అన్ని స్థానాలివ్వలేదు. 2008లో వరంగల్‌లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ గర్జన సభలో బీసీలకు వంద సీట్లు ఇస్తామని తీర్మానం చేశారు. ఈ సభలో ఏకంగా 93 బీసీ కులాల పేర్లు చదివి తమకు (టీడీపీ) తప్ప మరెవ్వరికీ బీసీల మీద పేటెంట్ లేదన్నట్లుగా ఆ రోజు చంద్రబాబు మాట్లాడారు. 2009 ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌లో జరిగిన చేతి వృత్తుల వారి సదస్సులో కూడా సీపీఎం నేత బి.వి.రాఘవులు, సీపీఐ నేత కె.నారాయణ, టీఆర్‌ఎస్ నాయకుడు నాయిని నరసింహారెడ్డిల సమక్షంలో బీసీలకు వంద సీట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ తీరా ఎన్నికల్లో టీడీపీ బీసీలకు ఇచ్చిన సీట్లు కేవలం 44 మాత్రమే. టీడీపీ మిత్రపక్షాలను కూడా కలుపుకొని 66 మంది బీసీలకే టికెట్లు ఇచ్చారు. అదే ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒక్కరే బీసీలకు 73 సీట్లు ఇచ్చారు. 2004లో కూడా చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 59 సీట్లే. 2004 నుంచి 2014 వరకు చంద్రబాబు ఏ రోజూ బీసీలకు 50, 60 కంటే ఎక్కువ సీట్లు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఎన్నికలొచ్చిన ప్రతిసారీ వంద సీట్లని అంటారు. బీసీలకు తానే పేటెంట్ అని కూడా అంటారు’’ అని జగన్ ఎండగట్టారు. తన తల్లి విజయమ్మ గత అసెంబ్లీలో వంద సీట్లు బీసీలకు కేటాయిద్దామని ప్రతిపాదించినా చంద్రబాబు అప్పట్లో స్పందించలేదని గుర్తుచేశారు. మొన్నటి (2014) ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున 54 మంది బీసీలకు టికెట్లు ఇస్తే టీడీపీ మాత్రం 58 సీట్లు ఇచ్చిందని జగన్ వివరించారు. ‘‘చంద్రబాబు మా కన్నా నాలుగు సీట్లు ఎందుకు ఎక్కువ ఇచ్చారు అంటే దానికి కారణం మా అభ్యర్థుల జాబితా ముందుగా విడుదలైంది కాబట్టి. మా జాబితాను ఆయన (చంద్రబాబు) చూసుకుని, మేమెంత మందికి ఇచ్చామో చూసుకుని, మా కన్నా నాలుగు సీట్లు ఎక్కువగా ఉండాలని అలా చేశారు. ఒకవేళ మేం కనుక అభ్యర్థుల జాబితాను తరువాత ఇచ్చి ఉంటే ఆయన ఇంకా నాలుగు తగ్గించి ఉండేవారు. ఇలా బీసీలను రాజకీయావసరాలకు వాడుకోవడం నెనెక్కడా చూడలేదు’’

స్పీకర్‌గారు వాళ్ల మనిషి అన్నట్లుగా...

శాసనసభ నిబంధన పుస్తకాన్ని జగన్ చూపుతూ.. ‘‘సాధారణంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి అంటే.. ఒక శాసనసభ్యుడు గాని, మంత్రి గాని ఒక అంశంపై తీర్మానం సభలో పెట్టాలి అంటే.. పది రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలి. అయితే స్పీకర్ గారు వాళ్ల (టీడీపీ) మనిషి అన్నట్లుగానే ఆయన ద్వారానే ‘బుల్‌డోజ్’ చేయించారు. స్పీకర్ తల్చుకుంటే తన విచక్షణతో తీర్మానాన్ని పది రోజుల వ్యవధి కన్నా తక్కువ నోటీసుతోనే అనుమతించవచ్చన్న అంశాన్ని అడ్డం పెట్టుకుని హడావుడిగా పొద్దున పెట్టి గంటలోపు తీర్మానం తీసుకొచ్చారు. తీర్మానం అంటే చర్చ తరువాత ఓటింగ్ జరగాలి. అలాంటిది.. ఈ రోజు (శనివారం) బీసీల అంశంపై చర్చ జరుగుతుందని పొద్దున పదకొండు గంటల వరకూ తెలియదు అనంటే.. అసెంబ్లీ ఏ తీరులో నడుస్తోంది? నిజంగా బీసీల సంక్షేమం మీద మాట్లాడాలనా? మాట్లాడకూడదనా? కేవలం వాళ్లు మాత్రమే బీసీ సంక్షేమం గురించి నాలుగు మాటలు మాట్లాడుకుని, వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారిని తిట్టి.. అంతే ఇక, బీసీ సంక్షేమం అయిపోయిందని చెప్పడమేనా!’’

ప్రతిపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వరా?

‘‘తీర్మానంపై చర్చ జరుగుతున్నపుడు గంటన్నర సేపు నేనక్కడే కూర్చుని ఉన్నా... చంద్రబాబు ఒక్కరే సుదీర్ఘంగా 45 నిమిషాలు మాట్లాడారు. ఆయన టీడీపీ మొత్తం మేనిఫెస్టోను అక్కడ చదివారు. ఆ తరువాత తన పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో తిట్టించారు. మా పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులను మాత్రమే వాళ్లు మాట్లాడమన్నారు. వాళ్లు కాస్తో కూస్తో మాట్లాడారు. ఆ తరువాత నేను చేతిని పెకైత్తి.. నేను మాట్లాడతానని అడుగుతున్నా.. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వేలెత్తి చూపినా అవకాశం ఇవ్వరు. బటన్ నొక్కితే గ్రీన్ బల్బ్ వెలుగుతుంది. ఎన్నిసార్లు నేను బటన్ నొక్కినా కూడా ఆ వైపు చూడరు. కావాలనే నిర్లక్ష్యం, అసలు పట్టించుకోరు. వాళ్లే మాట్లాడేసుకుని తీర్మానం ఆమోదం పొందింది అని ప్రకటించుకోవడం చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ప్రతిపక్ష నాయకుడు బీసీ సంక్షేమం మీద మాట్లాడాలనుకుంటే కూడా వీళ్లు వినే పరిస్థితిలో లేరు. బీసీ సంక్షేమం కోసం గతంలో ఏం జరిగింది.. మీరేం చేశారు.. ఏం చేస్తే బీసీలకు మేలు జరుగుతుంది.. అనేది ప్రతిపక్షం చెప్పాలనుకున్నా అనుమతించరు. ఆవేదనతో ఇవాళ నిజంగా తొలిసారిగా నేనీ మాట చెప్తున్నా.. కౌరవసభ ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ ఈ అసెంబ్లీ మాత్రం కౌరవ సభను మరిపించింది. వారి (అధికారపక్షం) సంఖ్య కూడా సరిగ్గా 101 మందే.. కౌరవులతో సమానంగానే ఉంది. నిజంగా వీళ్లు మనుషులా..? వీళ్లలో మానవత్వం ఉందా..? లేదా..? అనేది కూడా ఒకసారి నాకనిపిస్తుంది’’

వైఎస్ బీసీలకు చేసినవేవీ సభలో చెప్పరు...

‘‘దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి 2008లో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపారు. ఆ విషయాలు మాత్రం ఎపుడూ చెప్పను కూడా చెప్పరు. వైఎస్ హయాంలో బీసీలకు ఎలాంటి మేళ్లు జరిగాయో రెండు మూడు విషయాలు చెప్తాను. ఎవరూ ఊహించని విధంగా ప్రవేశ పెట్టిన ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల సంవత్సరానికి దాదాపుగా 27 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ చదవాలి అనంటే 35 వేల రూపాయలు ఫీజు కట్టాల్సిన పరిస్థితి. డాక్టర్ చదవాలి అనంటే వైఎస్ హయాంలోనే అప్పట్లోనే 50 వేల రూపాయల ఫీజు ఉండేది. అంత సొమ్ము కట్టి చదివించలేని పరిస్థితుల్లో చాలా మంది చదువుకోలేక పనులు చూసుకునే పరిస్థితి ఉండేది. ఆ చదువుల కోసం అయ్యే ఫీజును ప్రభుత్వమే చెల్లించి.. బీసీలకు అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖరరెడ్డే అని గర్వంగా చెప్పొచ్చు. 27 లక్షల మందిలో దాదాపు 14 లక్షల మంది ప్రతి సంవత్సరం బీసీ విద్యార్థులే ఫీజు రీఇంబర్స్‌మెంట్ వల్ల ప్రయోజనం పొందింది. చంద్రబాబుకు ఏ రోజూ ఇలాంటి ఆలోచన తట్టలేదు’’  

ఇళ్ల నిర్మాణంలోనూ

‘‘బీసీ సంక్షేమానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలంటే వైఎస్ హయాం నుంచి ఇళ్ల విషయాలు కూడా చెప్పాలి. 1984 నుంచి 2004 వరకూ అంటే 20 ఏళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వాలు పేదల కోసం మొత్తం నిర్మించి ఇచ్చిన ఇళ్లు 27.5 లక్షలైతే.. అందులో బీసీలకు కేవలం 6.32 లక్షల ఇళ్లు.. అంటే 32 శాతం మాత్రమే లభించాయి. వైఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే ఆ దివంగత నేత మన ఒక్క రాష్ట్రంలో 47 లక్షల ఇళ్లు నిర్మించారు. అందులో 19.88 లక్షల ఇళ్లు అంటే 42 శాతం బీసీలకే వెళ్లాయి. ఇలాంటివేవీ చెప్పాలన్న ఆలోచన చంద్రబాబుకు రాదు.

గొర్రెల కాపరులకు బీమా పథకం తెచ్చింది కూడా రాజశేఖరరెడ్డే. ఏ రోజూ ఇలాంటిది చంద్రబాబునాయుడు చేయలేదు.  అంతెందుకు? అట్టడుగు స్థాయిలో ఉన్న ఎస్సీలు, బీసీల కోసం ఎన్.టి.రామారావు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం తెచ్చారు. ఎన్‌టీఆర్ ఆ పథకం తెచ్చినపుడు ఆ రోజు (1983) ఇచ్చిన సబ్సిడీ కేజీకి 63 పైసలు మాత్రమే. అప్పట్లో బహిరంగ మార్కెట్‌లో కేజీ ధర 2.63 రూపాయలుంటే ఎన్‌టీఆర్ 2 రూపాయలకు ఇచ్చారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు రూపాయలకే బియ్యం ఇచ్చేటపుడు మార్కెట్‌లో ధర 25 రూపాయలుండేది. అంటే 23 రూపాయల సబ్సిడీని ఇచ్చారు.

ఇక ఆరోగ్యశ్రీ పథకం అయితే ఎవరూ ఊహించనిది. ఆలోచించనిది. ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో శ్రీమంతులతో సమానంగా గర్వంగా వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి ఒక్క వైఎస్ వల్లనే సాధ్యమైందని గర్వంగా చెప్తున్నా. ఇవేవీ ఆయన (బాబు) చెప్పడు.
  చంద్రబాబు జమానాలో నెలకు 70 రూపాయలు ముష్టి వేసినట్లు పెన్షన్ వేసేవారు. అప్పట్లో కేవలం 17 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చి అందరికీ ఇచ్చామని చెప్పేవారు. వైఎస్ పెన్షన్లను ఏకంగా 78 లక్షలకు పెంచి ప్రతి ఒక్కరికీ 200 రూపాయలు ఇచ్చారు. ఈ ఘనత కూడా చంద్రబాబు ఎన్నడూ చెప్పే పరిస్థితి లేదు.

సమాజంలో యాభై శాతంగా ఉన్న బీసీలను ఏ రాజకీయ పార్టీ అయినా దగ్గరికి తీసుకోవాల్సిందే. వారికి కచ్చితంగా టికెట్లు ఇవ్వాల్సిందే. అది చాలా అవసరం. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడాలేదు. కానీ మనం బీసీలకు నిజంగా ఏం చేస్తున్నామనేది మన మనస్సాక్షిని మనమే ప్రశ్నించుకోవాలి. బీసీలు, ఎస్సీలు, అట్టడుగు వర్గాలకు చెందిన వారికి ఏం చేస్తున్నామనేది ఆలోచించాలి’’

మేం నిక్కర్లు వేసుకున్నా.. నిజాలే చెప్తాం

‘‘అసెంబ్లీ సమావేశాల్లో మాకెవ్వరికీ ఏమీ తెలియదని వీళ్లంతా (టీడీపీ) అంటూ ఉన్నారు. అంతా కొత్త వాళ్లు, మీరంతా నిక్కర్లేసుకున్నోళ్లు అంటున్నారు. వాస్తవమే.. మేం నిక్కర్లు వేసుకున్న వాళ్లమే.. కానీ ఈ జెనరేషన్‌లో (ఈ తరానికి చెందిన) ఉన్న వాళ్లం అనేది గుర్తుంచుకోవాలి. బాగా చదువుకునే అసెంబ్లీకి వస్తాం. ఏం జరుగుతుందన్నది తెలుసుకుని వస్తాం. వాళ్ల (టీడీపీ) మాదిరిగా అబద్ధాలు చెప్పం. వాళ్ల మాదిరిగా మోసాలు చేయం. జరుగుతూ ఉన్నదే చెప్తాం.. చూపిస్తాం. ఇవాళ కూడా అదే చెప్పాలనుకున్నాం. కానీ ఇవాళ సభ జరిగిన తీరే భయానకంగా ఉంది.

బాబు అబద్ధాలతో తప్పుదోవపట్టిస్తున్నారు?

‘‘శాసనసభ మీద చంద్రబాబుకు ఎక్కువ అవగాహన ఉందా? లేకుంటే మాలాంటి ఏమీ తెలియని వాళ్లకు ఎక్కువ అవగాహన ఉందా? అనేది ఎవరినో అడగాల్సిన పనిలేదు. నిన్న, ఈ రోజు చంద్రబాబు తీరును ఒక్కసారి గమనించండి. 1953లో ఆంధ్ర రాష్ట్ర రాజధానిపై ఎలాంటి చర్చ, ఓటింగ్ జరుగలేదని చంద్రబాబు చెప్పారు. ఒక రూంలో కూర్చుని, ఒక ఇంట్లో కూర్చుని రాసేసుకున్నారని చెప్పి సభను పూర్తిగా తప్పుదోవ పట్టించారు. (7.6.1953 తేదీన అప్పటి ఆంధ్రప్రభలో ప్రచురితమైన వార్తలను చూపిస్తూ) ఇవన్నీ ఆనాటి న్యూస్ పేపర్ కటింగ్స్. మీరే చూడండి. ఒకటి కాదు, రెండు కాదు.. ఐదు రోజుల పాటు చర్చ జరిగింది. ఓటింగ్ కూడా జరిగింది. చంద్రబాబు ఎందుకీ అబద్ధాలు చెప్పాలి? తెలిసి చెబుతున్నారా? లేక కావాలనే తప్పుదోవ పట్టించాలని చెబుతున్నారా? హిట్లర్ మాదిరిగా చర్చే లేకుండా తాను మొట్టమొదటిగా ప్రకటన చేసేసి తరువాత చర్చించేసి తాను హిట్లర్‌గా చేసిన తీరును సమర్థించుకునేందుకు సభను దగ్గరుండి తప్పుదోవ పట్టించడం ఎంత వరకు న్యాయం?’’ అని విపక్ష నేత నిలదీశారు. ‘‘ఇవాళ కూడా అంతే.. బీసీలపై తీర్మానం కూడా అలాగే ఆమోదింపజేసుకున్నారు. అదేమంటే స్టేట్‌మెంట్ ఇచ్చామనిచంద్రబాబు చెప్పారు. అది ప్రకటనో, తీర్మామో ఆయనకే తెలియదు. ప్రతి తీర్మానం చివరిలో ప్రతిపక్ష నేత మాట్లాడతాడు. ఆ తరువాతనే ప్రతిపక్షం కూడా ఓటు వేయాలి. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతకు అవకాశమే ఇవ్వలేదు. ప్రతిపక్ష నేత బీసీల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే బండారం బయటపడుతుందనుకున్నారు. ద్రవ్య వినిమయ బిల్లులో రుణాల మాఫీ మీద పక్కదోవ పట్టిస్తున్నారు. అలాంటివన్నీ బయటకు వస్తాయి. బీసీలపై ఆయనకున్న దొంగ ప్రేమ బయటకు వస్తుంది. అందుకే అడ్డుపడ్డారు. ఇదా చదువుకోవడం అంటే..? ఇదా అనుభవం అంటే..?’’

వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే తీర్మానం
http://img.sakshi.net/images/cms/2014-09/41410031852_Unknown.jpg
 
‘చంద్రబాబు రైతుల రుణాల మాఫీకి ఎగనామం పెట్టారు.. డాక్రా, చేనేత రుణాల రద్దును పూర్తిగా పక్కనపెట్టేశారు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని.. అలా ఇవ్వలేక పోతే ఇంటింటికీ 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. ఆయన హామీని నమ్మిన ఆంధ్రప్రదేశ్‌లోని కోటి యాభై లక్షల కుటుంబాలు నిరుద్యోగ భృతి వస్తుందని ఎదురు చూస్తున్నాయి. ఈ కుటుంబాల వారందరికీ చంద్రబాబు ఎగనామం పెట్టాడు. తన వైఫల్యాలన్నీ మరోసారి బయటకు వస్తాయని ఇవన్నీ ‘హైలెట్’ (బహుళ ప్రాచుర్యం) కాకుండా ఉండేందుకే హఠాత్తుగా ఇవాళ, తనకేదో బీసీలపై ప్రేమ ఉన్నట్లుగా బీసీ తీర్మానం అని తెరమీదకు తీసుకొచ్చారు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబును, టీడీపీని నేను అడగదల్చుకున్నది ఒక్కటే.. నిజంగా మీకు బీసీల మీద ఇంత ప్రేమే ఉంటే ముందే ఎందుకు బీసీలకు సంబంధించిన తీర్మానం తీసుకురాలేదు? అసెంబ్లీలో కనీసం రెండు రోజుల పాటు బీసీ సంక్షేమంపై చర్చ జరిగేలా ఎందుకు కార్యక్రమం రూపొందించలేదు? కారణం మీకు అసలు బీసీల మీద ప్రేమ లేదు. అది నామ్‌కే వాస్తే.. నామ్‌కే వాస్తేగా తీర్మానం తేవాలి.. రుణాల మాఫీ, డ్వాక్రా, చేనేత రుణాలకు ఎగనామం పెట్టారనేది బయటకు రాకూడదని, ఆ వైఫల్యానికి తక్కువ పబ్లిసిటీ రావాలనే ఈ తీర్మానం తెచ్చారు’’
 
‘‘ఈ మధ్య కాలంలో చంద్రబాబునాయుడు గారు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. తీర్మానానికి, స్టేట్‌మెంట్ (ప్రకటన)కు తేడా కూడా ఆయనకు తెలియదు. అవతలి వాళ్లను మాత్రం చిన్నచూపు చూసే విధంగా.. ‘మీకేమీ తెలియదు, మీకు అనుభవం లేదు..’ అని బురద జల్లే కార్యక్రమమే చేస్తున్నారు తప్ప.. తన వీపు తనకు కనిపించడం లేదు. చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు ఇద్దరినీ నేనొకటే అడగదల్చుకున్నా.. అయ్యా మీ నాయకుడు ఎన్.టి.రామారావు 1983లో రాజకీయాల్లోకి వచ్చినపుడు, ఆయన సినిమాల నుంచి వచ్చాడు. మరి ఆయనకు ఏం తెలుసని చెప్పి ఆయన ఇవాళ గొప్ప నాయకుడు అని పొగుడుతూ ఉన్నారు? ఇవాళ మీరు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమని చెప్పి అవతలి వాళ్లకు ఏమీ తెలియదని చెప్పి రోజూ ఒక బండేయడం తప్ప మీరు చేస్తున్నదేమిటి? తీర్మానానికి, స్టేట్‌మెంట్‌కు కూడా తేడా ఏమిటో తెలియని పరిస్థితుల్లో చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు’’  
 
 
బడ్జెట్ పత్రాలూ తప్పుదోవ పట్టించేవే...
 
‘‘బడ్జెట్ పత్రాలు చూస్తే అన్నీ తప్పుదోవ పట్టించేవే. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఉండవు, సవరించిన అంచాలన్నీ తప్పులే. వాటితోనే బడ్జెట్‌ను పెట్టడం అంటే పునాదులు లేకుండానే భవనాలు కడతామని చెప్పడమే. గతంలో ఏముందో ప్రజలకు చెప్పకుండా నీ ఇష్టమొచ్చిన కేటాయింపులు చేసేయడం. ఇది మోసం కాక మరేమిటి? మేము గట్టిగా విమర్శిస్తే, గడ్డి పెడితేనే ఇవాళ  సవరించి బడ్జెట్ అంచనాల పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టారు. అందులోనూ తప్పులే. బడ్జెట్ ఇస్తున్నారు గానీ.. గత ఏడాదికి సంబంధించిన సవరించిన అంచనాలు లేకుండానే ఈ సంవత్సరంలో నాలుగు నెలలు గడిచి పోయాయి. అవి లేకుండానే ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై మనం మాట్లాడుతున్నాం. అయ్యా పునాదులేమీ తెలియకుండా భవనం ఎలా కడతారయ్యా? అని అడగడం జరిగింది. అపుడు అడిగినందుకు ఈ రోజే కొన్ని పుస్తకాలు ఇచ్చారు. దీంట్లో సవరించిన అంచనాలు అని చెప్పి ఒక చిన్న కాలమ్ పెట్టారు. ఇంతకన్నా అన్యాయం ఇక ఉండదనుకుంటా. ఇవే సవరించిన అంచనాలు చూస్తే మొన్న ఏ విధంగా ఉన్నాయో ఇపుడు అదే విధంగా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలు అని వేరుగా శీర్షికలు పెట్టారంతే.. అక్కడున్నవే ఇక్కడ రాశారు. మరి ఎందుకిలా ఎవరికీ తెలియకుండా చేస్తున్నారో అర్థం కావడం లేదు గానీ బడ్జెట్‌లో ఇదే చేశారు. ప్రొవిజనల్ స్టేట్‌మెంట్స్ అంటే బడ్జెటెడ్ స్టేట్‌మెంట్స్.. ఇక ఆడిటర్ సంతకం పెట్టడానికి ముందు ప్రొవిజనల్ స్టేట్‌మెంట్స్ అంటారు. అవి కూడా వచ్చి ఉండాలి. అవి వచ్చి ఉన్నా కూడా ఏమీ చూపించలేదు. ఈ సవరించిన అంచనాలు చూపించారు. అవి కూడా అన్నీ తప్పుల తడకలే. ఇక్కడి నుంచి కాపీ కొట్టి (రెండు పుస్తకాలుచూపుతూ) మళ్లీ అక్కడికి వేశారు. ఎంట్రీలు చూస్తే ఇందులో ఉన్న అంకెలే మళ్లీ అక్కడా ఉన్నాయి. ఓ చిన్న ఉదాహరణ చెప్పాలంటే రెవెన్యూ రాబడులు బడ్జెట్‌లో 1,27,772 కోట్లయితే సవరించిన అంచనాల్లో కూడా కరెక్ట్‌గా అదే 1,27,772 కోట్ల సంఖ్యే చూపించారు. బడ్జెట్ అదే సవరించిన అంచనాలు అవే. ఎందుకిలా మోసం చేస్తూ పోతున్నారో అర్థం కాని విషయంగా ఉంది. రెవెన్యూ మిగులు అంశం కూడా బడ్జెట్‌లో 1,022 కోట్లు పెడితే సవరించిన అంచనాల్లో కూడా 1022 కోట్లే ఉన్నాయి.  

ఇక రాష్ట్ర తొలి బడ్జెట్ రెవెన్యూ లోటు ఎంతో తెలియకుండా, ద్రవ్య లోటు ఎంతో తెలియకుండా బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. తొలి బడ్జెట్‌లో దేశంలో ఇలా ఎక్కడా జరిగి ఉండదు. బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రూ. 6 వేల కోట్లా లేక 25 వేల కోట్లా కూడా తెలియదు. ద్రవ్యలోటు రూ. 12 వేల కోట్లా లేక రూ. 37,910 కోట్లా తెలియదు.  

ప్రణాళికా వ్యయం కాస్తో కూస్తో తగ్గిందనంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. అది తగ్గించుకోవచ్చు. పెంచొచ్చు. కానీ ప్రణాళికేతర వ్యయం అనేది జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు ఇలాంటి వాటికి సంబంధించిన వ్యయం. అలాంటిది, ఒక్క వృద్ధాప్య పెన్షన్లు తప్పనిచ్చి మిగతావన్నీ కేటాయింపులు తక్కువగానే చూపిస్తూ వచ్చారు. ఇంతకు ముందు బడ్జెట్‌తో పోలిస్తే ఏకంగా 23 వేల కోట్ల ప్రణాళికేతర వ్యయం ఎక్కువ చేసి చూపించారు. ఇది నిజంగా తప్పుల తడక, తప్పుదోవ పట్టించే పత్రాలు. ప్రజలకు ఏది వాస్తవం? ఎందుకీ మోసం జరుగుతా ఉంది? ఎవరు మోసం చేస్తున్నారు? ఎందుకు మోసం చేస్తున్నారు? అనేది తెలియాలి’’    

కాగ్‌కు, కేంద్రానికి లేఖలు రాస్తాం...


‘‘ఈ వివరాలన్నింటితో మేం కాగ్‌కు,  కేంద్ర ప్రభుత్వానికి, ప్రణాళికాసంఘానికి కూడా లేఖలు రాస్తాం. ‘ఈ లెక్కలు సరైనవా? లేక మేం చెప్తున్నవి సరైనవా? ఎవరు చెప్పేది సరైనవి? ఏది నిజం మీరు చెప్పండి? మొత్తం రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. వాళ్లందరికీ నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది’ అని విజ్ఞప్తి చేస్తాం. వీళ్లకు అపుడైనా బుద్ధొస్తుందేమో చూస్తాం. రైతు రుణాల మాఫీ మొత్తం రూ.87,612 కోట్లుంటే బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ. 5 వేల కోట్లే. రెండేళ్లకు కలిపి లక్షకు రూ.24 వేల అపరాధ వడ్డీ అయితే దాని గురించిన ఊసే లేదు. డ్వాక్రా రుణాలు రూ.14,204 కోట్లుంటే కేటాయింపులు సున్నాగా ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏడాదికి రూ.36,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే దానికి అసలు కేటాయింపులే లేవు. ఇక అక్టోబర్ 1 నుంచి వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని లెక్కలైతే వేశారు గానీ సరిపడ కేటాయింపులులేవు. ఇవేవీ ప్రజల దృష్టికి రాకూడదని.. కుటిల రాజకీయాలు చేస్తున్నారు. నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అసెంబ్లీలో మాట్లాడటానికి మాకు న్యాయం జరుగలేదు. అందుకే మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఈ అన్యాయాన్ని ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లండి. మీరంతా విజ్ఞత కలిగిన వాళ్లు.. ఈ లెక్కలన్నీ నేను సృష్టించినవి కావు, ఇవన్నీ నగ్న సత్యాలు. మీరు కూడా ఒకసారి అధ్యయనం చేయండి. ఈ ప్రభుత్వానికి మీద్వారా కూడా బుద్ధి వచ్చేట్లు చేయండి. అందరమూ కూడా ఈ కార్యక్రమం చేయాలి. అప్పటికన్నా ఈ దుర్యోధన సభ, ఈ కౌరవ సభలో కాస్తో కూస్తో మార్పు వస్తుందని మనవి చేస్తున్నాను. అసెంబ్లీలో మాట్లాడలేక పోయిన అంశాలను మీ ద్వారా ప్రజల వద్దకు తీసుకె వెళుతున్నాను. గతంలో కూడా నా వాణిని ప్రజలకు వినిపించినందుకు నేను మీడియా సోదరులకు పత్రికా సోదరులకూ ధన్యవాదాలు తెలుపుతున్నాను’’
 
Share this article :

0 comments: