
- ఇడుపులపాయలో చురుగ్గా ఏర్పాట్లు భారీ రక్తదాన శిబిరం
- కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెల్లడి
సాక్షి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం ఇడుపులపాయకు రానున్నారు. ఈమేరకు పర్యటన ఖరారైందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. ఈనెల 2న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున ఎర్రగుంట్లకు చేరుకుంటారన్నారు.
అనంతరం అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారని చెప్పారు. మంగళవారం ఉదయం తండ్రి సమాధి వద్దకు వెళ్లి వైఎస్ జగన్ నివాళులు అర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారని స్పష్టంచేశారు. తండ్రి వర్ధంతి వేడుకల కార్యక్రమాలు ముగించుకొని సమయాన్ని బట్టి మధ్యాహ్నం నుంచి పులివెందులకు వెళ్లే అవకాశముంటుందన్నారు. ఇంకా దీనిపై స్పష్టత రావాల్సి ఉందని ఆయన తెలిపారు. మంగళవారం ఒక్కరోజు పర్యటన ముగించుకొని రాత్రికి మళ్లీ హైదరాబాద్ బయలుదేరి వెళతారని ఆయన వివరించారు.
ఇడుపులపాయలో ఏర్పాట్లు :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలిరానున్నారు. జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరానున్న నేపథ్యంలో ఇడుపులపాయలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్ మంగళవారం ఇడుపులపాయలో ఉండనున్న నేపథ్యంలో ఆయనను ప్రజలు కలిసేలా కూడా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీఛెర్మైన్లు, మున్సిపల్ ఛెర్మైన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు భారీగా తరలిరానున్నారు.
ఇడుపులపాయలో భారీ రక్తదాన శిబిరం :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలో భారీ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. వైఎస్‌ఆర్ అభిమానులతోపాటు కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాలుపంచుకోవాలని పార్టీ వర్గాలు పిలుపునిచ్చాయి. అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు.
0 comments:
Post a Comment