పార్టీ పటిష్టతకు జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ పటిష్టతకు జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలు

పార్టీ పటిష్టతకు జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలు

Written By news on Wednesday, September 10, 2014 | 9/10/2014

రుణమాఫీ కోసం ఆందోళనలు
జగన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశం
   
 రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని ధ్వజం
► రుణాల మాఫీ కోరుతూ ముందుగా మండల కార్యాలయాల వద్ద ఆందోళన.. తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద...
 {పభుత్వం దిగిరాకపోతే ప్రత్యక్ష కార్యాచరణలోకి జగన్..
► త్వరలోనే ఆందోళన తేదీల ఖరారు
 పార్టీ పటిష్టతకు జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలు
 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో గొప్పగా ప్రచారం చేసుకున్న టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చిందని ఆ పార్టీ ధ్వజమెత్తింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా షరతులేమీ లేకుండా మొత్తం రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెలలో భారీ ఎత్తున ప్రజాందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు వచ్చే నెలలో మొదట మండల కార్యాలయాల ముందు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాతి దశలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట భారీ ఎత్తున ఆందోళనకు దిగుతారు. ప్రభుత్వం అప్పటికీ దిగిరాకపోతే పార్టీ అధ్యక్షుడు జగనే స్వయంగా ఏదో ఒక జిల్లాలో ఆందోళనకు నాయకత్వం వహిస్తూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతారు.

ఈమేరకు త్వరలోనే ఆందోళన తేదీలను ఖరారు చేస్తారు. మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆయన క్యాంపు కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ముఖ్య నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజకీయ కార్యదర్శులు వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో సహా పలువురు ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుకు వచ్చేసరికి మాట తప్పడంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రుణాల మాఫీపై ఇచ్చిన హామీని నెరవేర్చడంలో టీడీపీ ఘోరంగా విఫలమైందని పార్టీ విమర్శించింది. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేయాలని నిర్ణయించింది. జిల్లా స్థాయి నుంచి బూత్‌స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను జగన్ ఈ సమావేశంలో వివరించారు. సమావేశం ముగిసిన అనంతరం అందులో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ వలంటీర్ల విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాకు వె ల్లడించారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల తరఫున తమ పార్టీ ప్రజాపక్షంగా నిలబడి పోరాడుతుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. రుణాల మఫీ హామీని అమలు చేయాలని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినా ప్రయోజనం కనిపించలేదన్నారు.

దున్నపోతుపై వర్షం కురిసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో కేవలం 5,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం రుణాల మాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించినా సమాధానం రాలేదని అన్నారు. మండల, జిల్లాస్థాయిలో తాము చేపట్టే ఆందోళన లను చూసైనా టీడీపీ ప్రభుత్వం దిగి వచ్చి రుణాలన్నింటినీ మాఫీ చేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంలో చలనం లేకపోతే జగన్  ఆందోళనకు స్వీకారం చుడతారని తెలిపారు.

ఇక జిల్లా, మండల సమావేశాలు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

 సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్తగా ఏర్పడిన క మిటీల్లో అనుభవజ్ఞులైన సీనియర్ నేతలను అధ్యక్షుడు జగన్ నియమించారని, పోలింగ్ బూత్, గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను వారికి అప్పగించారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. రాష్ట్రస్థాయి సమావేశం పూర్తయింది కనుక ఇక జిల్లా స్థాయి విసృ్తత సమావేశాలు, ఆ తరువాత మండలస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూలును 3, 4 రోజుల్లో పార్టీ విడుదల చేస్తుందన్నారు. జిల్లా స్థాయి విసృ్తత సమావేశాలకు ఒక ప్రధాన కార్యదర్శి, ఆ జిల్లా పరిధిలోని లోక్‌సభ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులు హాజరవుతారని తెలిపారు. జిల్లా కమిటీలో ఎన్ని పదవులుండాలనేది ఇప్పటికే తెలియజేశామని, ఆ ప్రకారం సమావేశాల్లో జిల్లా కమిటీల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. మండలస్థాయి సమావేశాల్లో కూడా మండల కమిటీల ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆయా మండలాలకు పక్కనే ఉన్న మండలానికి చెందిన ముగ్గురు నేతలను ఎన్నికల కమిటీ మాదిరిగా పంపి వారి సమక్షంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మండల సమావేశాలకు అక్కడి ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన నాయకులు, లోక్‌సభ సభ్యుడు లేదా లోక్‌సభకు పోటీ చేసిన వారు పాల్గొంటారన్నారు. ఆ తరువాత గ్రామాల్లో కూడా గ్రామ కమిటీల ఎన్నిక జరుగుతుందన్నారు. ఇక్కడ కూడా పొరుగు గ్రామాల నుంచి ముగ్గురేసి సభ్యులను ఎన్నికల నిర్వహణకు పంపుతామన్నారు. వీటితోపాటు పార్టీ అనుబంధ సంఘాల జిల్లా, మండల, గ్రామ, పోలింగ్ బూత్ కమిటీల ఎన్నికలూ జరుగుతాయని తెలిపారు. పట్టణ, నగర కమిటీల ఎన్నికలు కూడా ఇదే పద్ధతిలో జరుగుతాయని వివరించారు. ఇవి కాక వలంటీర్ల కమిటీలు కూడా ఉంటాయన్నారు.
 
Share this article :

0 comments: