పెట్టుబడి పెట్టడమే తప్పా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెట్టుబడి పెట్టడమే తప్పా?

పెట్టుబడి పెట్టడమే తప్పా?

Written By news on Sunday, September 14, 2014 | 9/14/2014

పెట్టుబడి  పెట్టడమే తప్పా?
జగన్ కంపెనీల్లో పెట్టుబడులే లక్ష్యంగా సీబీఐ రంధ్రాన్వేషణ

 ఇందూ నుంచి నేరుగా పెట్టుబడులు రాకున్నా లింకులు వెదికిన దర్యాప్తు సంస్థ
 నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి వచ్చిన 5 కోట్లను చూపిస్తూ ‘క్విడ్ ప్రో కో’ వాదన
 ఇందూ-ఏపీహెచ్‌బీ ప్రాజెక్టుల్లో ఉల్లంఘనలున్నాయంటూ 11వ ఛార్జిషీటు
 ఆ ఉల్లంఘనల్ని అనుమతించినందుకే జగన్ సంస్థల్లో పెట్టుబడులట!
 ఆ ప్రాజెక్టులన్నీ బహిరంగ వేలంలో ఎక్కువ ధర ఆఫర్ చేసినవారికి ఇచ్చినవే
 ఆ విషయాన్ని విస్మరిస్తూ నవ్విపోయే తీరులో సీబీఐ లింకులు...
 సీబీఐ ఛార్జిషీటుకు తన సొంత కథలు జోడించి ‘ఈనాడు’ రాతలు
 గచ్చిబౌలి ప్రాజెక్టు దక్కిన ఐదేళ్లకు ‘వసంత’లో వాటాదారుగా వై.వి.సుబ్బారెడ్డి
 బాబు హయాంలోనూ హైటెక్ సిటీ వద్ద వసంత కృష్ణప్రసాద్ రియల్టీ ప్రాజెక్టులు
 అప్పట్లోనూ కొన్నింట్లో కృష్ణప్రసాద్-సుబ్బారెడ్డి భాగస్వామ్యం
 దాన్ని వదిలిపెట్టి... ఈ ప్రాజెక్టు కోసమే ఆయనకు వాటా ఇచ్చారంటూ వాదన
 ఆది నుంచీ జగన్ సంస్థల ఇన్వెస్టర్లను వేధించటమే ధ్యేయంగా దర్యాప్తు

 
ఆది నుంచీ జరుగుతున్న హైడ్రామా మరోసారి తెరపైకి వచ్చింది. తనకు కోర్టు అప్పగించిన పనిని పూర్తిగా పక్కనబెట్టి... వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని వేధించటమే లక్ష్యంగా సాగుతున్న సీబీఐ దర్యాప్తు అదే కోవలో మరో ఛార్జిషీటును ఆవిష్కరించింది. యథాతథంగా దానికి చిలవలు పలవలు జోడించి ‘ఈనాడు’ ‘అదిగో పులి.. ఇదిగో తోక’ అనే తరహాలో కథనాలు వండేస్తూనే ఉంది. నిజానికింకా సదరు ఛార్జిషీటును న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోనేలేదు. దాన్లో విషయాలు బయటకు తెలియవు కూడా!! అయినా సరే ‘ఈనాడు’ తాను ‘తెలుసుకున్న’ విషయాలకు కల్పనా శక్తిని జోడించి జగన్ లక్ష్యంగా కథనాలు రాస్తూనే ఉంది.

నిజానికి ఈ కేసులో మొదటి నుంచీ కోర్టు చెప్పిన అంశాల్ని పక్కనబెట్టి సీబీఐ తన అజెండాతో ముందుకు పోతూనే ఉంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టులు, ప్రాజెక్టులు పొందిన కంపెనీలకేమైనా అయాచితంగా లబ్ధి కలిగిందా? నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వాటికవి కట్టబెట్టిందా? ఈ క్రమంలో ‘క్విడ్ ప్రోకో’ తతంగాలు చోటు చేసుకున్నాయా? అనేది దర్యాప్తు చేయాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో వందల కంపెనీలు పలు ప్రాజెక్టులు, కాంట్రాక్టులు దక్కించుకున్నాయి కనక సీబీఐ వాటన్నిటి పైనా దర్యాప్తు చేసి ఉండాల్సింది.http://img.sakshi.net/images/cms/2014-09/41410642102_Unknown.jpg

కానీ జరిగింది... జరుగుతున్నది ఏమిటంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేధించడానికి సీబీఐ దగ్గరి దారి ఎంచుకుంది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారికి వైఎస్ ప్రభుత్వ హయాంలో ఏమైనా ప్రాజెక్టులు, కాంట్రాక్టులు దక్కాయా? అనేది చూస్తోంది. ఒకవేళ దక్కి ఉంటే... ఆ ప్రాజెక్టుల కోసమే వారు పెట్టుబడులు పెట్టారని, ఇదంతా ‘క్విడ్ ప్రో కో’ తప్ప మరొకటి కాదని లింకు పెట్టేస్తూ ఛార్జిషీట్లు వేస్తోంది. ఒకవేళ ఈ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన వారిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రాజెక్టులూ పొందని వారు కనక ఉంటే... వారిని జగన్ మోసం చేశారని, వారికి లాభాలొస్తాయని అబద్ధాలు చె ప్పి వారి చేత పెట్టుబడులు పెట్టించారని వాదిస్తోంది. ఆ వాదనతోనూ ఛార్జిషీట్లు వేసేసింది. ఏ రకంగానైనా జగన్‌ను వేధించటమే ఈ దర్యాప్తు లక్ష్యమన్న సంగతి తెలియటానికింకా ఏం కావాలి? ఇదిగో... ఈ వేధింపుల క్రమంలోనిదే తాజాగా వేసిన 11వ ఛార్జిషీటు కూడా...!

తాజా ఛార్జిషీట్లో సీబీఐ పేర్కొన్నదల్లా రియల్ ఎస్టేట్ సంస్థ ఇందూ ప్రాజెక్ట్స్ చేపట్టిన ఏపీ హౌసింగ్ బోర్డు ప్రాజెక్టుల గురించి. నిజానికిక్కడ గమనించాల్సిన ముఖ్యాంశాలు కొన్నున్నాయి. అవి..

.    ఈ ప్రాజెక్టులన్నీ బహిరంగ వేలం ద్వారా అప్పగించినవే తప్ప నామినేషన్ పద్ధతిమీదో, దరఖాస్తుల ఆధారంగానో నచ్చినవారికి కట్టబెట్టినవి కావు.
. బహిరంగ వేలంలో అప్పగించినపుడు ఎక్కువ ధర ఆఫర్ చేసినవారికే ఇస్తారు. అందులో ఎలాంటి తేడాలూ ఉండవు. ఇక్కడా అదే జరిగింది.
. ఈ ప్రాజెక్టులకు బహిరంగ వేలం నిమిత్తం దరఖాస్తులు పిలవటం... కంపెనీలకు అర్హతలు నిర్దేశించటం... ఆ అర్హతల ఆధారంగా కొన్నిటిని షార్ట్‌లిస్ట్ చేయటం... ఇవన్నీ జరిగింది వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో కాదు. ఆయన అధికారంలోకి రాకముందు... చంద్రబాబు నాయుడి పాలనలో.
. అసలు ప్రభుత్వ భూముల్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించి వాటి ద్వారా గృహ నిర్మాణ ప్రాజెక్టులు అమలు చేయించాలన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడిదే తప్ప వైఎస్ ప్రభుత్వానిది కాదు.
. చంద్రబాబు ప్రభుత్వం ఈ తరహాలోనే కూకట్‌పల్లిలో మలేసియాకు చెందిన ఐజేఎం ఇన్‌ఫ్రా సంస్థకు భారీ హౌసింగ్ ప్రాజెక్టును కట్టబెట్టింది.
. ఇదే కోవలో హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, ఖమ్మంలలో హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టడానికి ఆసక్తి ఉన్న సంస్థలు ముందుకు రావచ్చంటూ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది కూడా 2004 జనవరి 28న. నోటిఫికేషన్లు ఇచ్చింది ఫిబ్రవరి 22న.
. యూనిటీ ఇన్‌ఫ్రా, ఎంబసీ రియల్టర్స్, సోమా ఎంటర్‌ప్రైజెస్‌తో కలిసి ఇందూ ప్రాజెక్ట్స్ సంస్థ కన్సార్షియంగా ఏర్పడి ఇందులో కొన్ని ప్రాజెక్టులకు ఆసక్తి వ్యక్తీకరణ లేఖలిచ్చింది కూడా 2004 మార్చి 15న.
. కన్సార్షియంలోని కంపెనీలన్నీ తమ తరఫున ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డికి అన్నిరకాల ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే అధికారాన్నిస్తూ ఒప్పందం చేసుకున్నది మార్చి 10వ తేదీన.
. కూకట్‌పల్లిలోని 50 ఎకరాలకు సంబంధించి మొత్తం 28 బిడ్లు రాగా ఎంబసీ- యూనిటీ కన్సార్షియం సహా 8 మందిని షార్ట్‌లిస్ట్ చేయటంతో పాటు మరో ఆరు సంస్థల్ని వాటి నివేదికలు అడగాలని ఏపీ హౌసింగ్ బోర్డుకు చెందిన హై పవర్ కమిటీ నిర్ణయించడం... మిగిలిన 14 సంస్థల్నీ పక్కనబెట్టడం... ఇవన్నీ జరిగింది కూడా 2004 జూన్‌కు ముందే. అంటే వైఎస్సార్ అధికారంలోకి వచ్చి నెల కూడా గడవకముందే!!.

ఇక్కడ సీబీఐ ప్రధానంగా ఎత్తి చూపిస్తున్నదీ... ‘ఈనాడు’ దానికి మరింత మసాలా జోడించి జగన్‌మోహన్‌రెడ్డికి లింకు పెడుతూ రాస్తున్నదీ ‘యూనిటీ-ఎంబసీ’ కన్సార్షియంలో వాటా మార్పుల గురించి. నిజానికి లీడ్ భాగస్వామిగా ఎంబసీ బదులు ఇందూ ప్రాజెక్ట్స్ ఉంటుందని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) కోసం దరఖాస్తు చేసినప్పుడే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు (ఏపీహెచ్‌బీకి) శ్యాంప్రసాద్‌రెడ్డి చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్లో కూడా అంగీకరించింది. పెపైచ్చు వాటాల మార్పునకు సంబంధించి ఆర్‌ఎఫ్‌పీలో ఏమీ లేదని, అందులో ఉన్న ప్రకారమే నిబంధనలననుసరించి తాము వ్యవహరించినట్లు ఇందూ ప్రాజెక్ట్స్ ప్రతినిధి చెప్పిన సాక్ష్యాన్ని కూడా అది రికార్డు చేసింది. మరి ఇందులో అంతగా ‘ఈనాడు’ పేజీలకొద్దీ వండాల్సిందేముంది? నిజానికి ఇలా కన్సార్షియంలో సభ్యులు మారటమనేది కొత్తా కాదు... దానివల్ల ప్రభుత్వానికి కలిగే లాభనష్టాలూ లేవు. రాష్ట్రంలోగానీ, పొరుగు రాష్ట్రాల్లో గానీ పలు కంపెనీలు చేపట్టిన ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులతో సహా భారీ ప్రాజెక్టులన్నిట్లోనూ ఎప్పటికప్పుడు భాగస్వాములు మారటమన్నది జరుగుతూనే ఉంది. అంతిమంగా తాము అప్పగించిన కంపెనీ... చెప్పిన పని చెప్పినట్టు చేసిందా లేదా అన్నదే ప్రధానం. ఉదాహరణకు గృహావసరాలకిచ్చిన ప్రాజెక్టును వాణిజ్య అవసరాలకు వినియోగించినా, గడువులోపు నిర్మించకపోయినా, దానివల్ల ప్రభుత్వానికేమైనా నష్టం వచ్చినా... అప్పుడు ఇలాంటి వాదనలెన్నయినా వినిపించొచ్చు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.

ఇక గచ్చిబౌలిలోని స్థలం విషయానికొస్తే వైవీ సుబ్బారెడ్డి స్వయానా వై.ఎస్.రాజశేఖరరెడ్డికి తోడల్లుడు కావటంతో, ఆయన వసంత ప్రాజెక్ట్స్‌లో భాగస్వామి కావటంతో దాన్ని కూడా ‘క్విడ్ ప్రో కో’ గాటన కట్టేసింది సీబీఐ. దాన్ని పట్టుకుని ‘ఈనాడు’ కూడా రెచ్చిపోయింది. నిజానికి ఇందూ ప్రాజెక్ట్స్‌కు గచ్చిబౌలిలోని 4.29 ఎకరాల ప్రాజెక్టు దక్కింది బహిరంగ వేలం ద్వారా.. 2004లో. దీనికి సంబంధించి వసంత ప్రాజెక్ట్స్ పేరిట ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసి... దాని ద్వారా ప్రాజెక్టును అమలు చేయనున్నట్టు ఒప్పందం దశలోనే శ్యాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. దాని ప్రకారమే చేశారు. వసంత ప్రాజెక్ట్స్‌లో వై.వి.సుబ్బారెడ్డి వాటాదారుగా చేసింది ఆ తరవాత 5 సంవత్సరాలకు. 2009లో. సీబీఐ వాదనే గనక నిజమైతే ప్రయోజనం పొందిన కంపెనీ ఐదేళ్ల తరవాత ‘క్విడ్ ప్రోకో’ చెల్లిస్తుందా? అయినా వసంత ప్రాజెక్ట్స్‌లో వాటాలు కొని, వాటాదారుడిగా సుబ్బారెడ్డి చేరటం ఏ విధంగా తప్పవుతుంది? యజమాని అంగీకరిస్తే ఏ కంపెనీలోనైనా, ఎవరైనా వాటాదారుగా చేరే అవకాశం ఉంది కదా? అయినా వసంత ప్రాజెక్ట్స్‌కు చెందిన వసంత కృష్ణ ప్రసాద్ గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో కూడా హైటెక్ సిటీ పక్కన భూములు పొంది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టారు. అప్పట్లోనూ కొన్నింట్లో సుబ్బారెడ్డి ఆయనతో భాగస్వామిగా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి ఈ ప్రాజెక్టులో మాత్రం భాగస్వామిగా చేరితే తప్పవుతుందా? కేవలం వైఎస్ తోడల్లుడు కనక... ఏదో ఒకరకంగా ‘క్విడ్ ప్రోకో’ లింకు పెట్టాలి కనక ఈ వ్యవహారాన్ని తవ్వినట్టు కనిపించటం లేదూ?

నిమ్మగడ్డ పెట్టుబడులతో లింకు!

ఇందూ ప్రాజెక్ట్స్‌కు ప్రభుత్వం అయాచితంగా లబ్ధి కలిగించిందని, ఈ వ్యవ హారంలో ముడుపులు చేతులు మారాయని చెప్పటానికి సీబీఐకి ఎలాంటి ఆధారమూ లేదు. దీంతో ఇందూ ప్రాజెక్ట్స్‌లో డెరైక్టరుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్... రూ.5 కోట్లు జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కార్మెల్ ఏషియాలో పెట్టుబడిగా  పెట్టారని, ఆయనకు ఆ సొమ్ము ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి నుంచి వచ్చింది కనక ఇది ‘క్విడ్ ప్రోకో’ అని సీబీఐ పేర్కొంది. వాస్తవానికి ఈ 5 కోట్లే కాదు. జగన్‌మోహన్‌రెడ్డికి  చెందిన భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ అన్నిట్లోనూ నిమ్మగడ్డ ప్రసాద్ భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ 5 కోట్లకు ముందు కూడా ఆయన పెట్టుబడి పెట్టారు. ఈ 5 కోట్ల తరవాత కూడా ఆయన పెట్టుబడులు సాగాయి. ఆ మాటకొస్తే ఆయన జగన్‌మోహన్ రెడ్డి సంస్థల్లోనే కాదు. దేశంలో పలు ఆసుపత్రులు, మీడియా సంస్థలు, స్టార్టప్ కంపెనీల్లో పెట్టబడులు పెట్టారు. ఆయనకు దేశంలోని సీరియస్ ఇన్వెస్టర్లలో ఒకడిగా పేరుంది కూడా. మరో ముఖ్యాంశమేంటంటే జగన్‌కు చెందిన భారతీ సిమెంట్‌లో నిమ్మగడ్డ ప్రసాద్ తన వాటాను విక్రయించటం, దానికి లాభాలు రావటం కూడా జరిగింది. అలాంటి పెట్టుబడిని పట్టుకుని... ఇందూతో లింకు పెట్టి క్విడ్ ప్రోకోగా పేర్కొనటాన్ని ఏమనాలి?

ఇందూ ఒక్కటే దక్కించుకుందా?

వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకముందు చేపట్టిన ఈ వేలం ప్రక్రియలో... హైదరాబాద్‌లోను, ఇతర నగరాల్లోను ఉన్న స్థలాలకు పలు సంస్థలు దరఖాస్తులు చేశాయి. ఇందూతో పాటు ఎక్కువ ధరను ఆఫర్ చేసిన పలు కంపెనీలు ప్రాజెక్టులు దక్కించుకున్నాయి. వీటిలో కొన్ని కంపెనీలు తెలుగుదేశం నేతలకు చెందినవీ ఉన్నాయి. మరి వాటన్నిటినీ వదిలిపెట్టి ఒక్క ఇందూ ప్రాజెక్ట్స్‌ను మాత్రమే ఛార్జిషీట్లో పేర్కొనటం వెనక అర్థమేంటి? దాని అధిపతి శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన సంస్థ నుంచి నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన సంస్థలోకి రూ.5 కోట్లు రావటం, ఆ 5 కోట్లను జగన్‌కు చెందిన సంస్థల్లో ప్రసాద్ ఇన్వెస్ట్ చేయటం అనే ఒక్క కారణం వల్లనేనా? ఈ లింకు దొరికింది కాబట్టి జగన్‌ను ఇరుకున పెట్టాలన్న దురుద్దేశం ఇక్కడ స్పష్టంగా కనిపించటం లేదా? అయినా పెట్టుబడిని క్విడ్‌ప్రోకోగా పేర్కొనటం ఎక్కడైనా ఉందా? పెట్టుబడి అంటే దానిక్కూడా విలువ ఉంటుందికదా? నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడి పెట్టిన ‘సాక్షి’ గానీ, భారతి సిమెంట్ గానీ విలువ లేని కంపెనీలో, పేపర్ కంపెనీలో కావు. భారతి సిమెంట్స్ వాటా విక్రయించినపుడు ఆ విషయం ఇన్వెస్టర్లందరికీ అర్థమైంది కూడా. అలాగే ‘సాక్షి’కి కూడా ఆరంభం నుంచే 12 లక్షల పైచిలుకు సర్క్యులేషన్ ఉంది. అది అంతకంతకూ పెరిగింది కూడా. దీన్లోని ఇన్వెస్టర్ల వాటాలకూ ఆ మేరకు విలువ ఉంది. దీన్ని క్విడ్ ప్రోకో అనటం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇరుకున పెట్టడానికన్నది అర్థం కావటానికి ఇంకా ఏం కావాలి?
Share this article :

0 comments: