పేదోళ్ల పింఛన్ రద్దు చేస్తే ఉద్యమిస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేదోళ్ల పింఛన్ రద్దు చేస్తే ఉద్యమిస్తాం

పేదోళ్ల పింఛన్ రద్దు చేస్తే ఉద్యమిస్తాం

Written By news on Wednesday, September 24, 2014 | 9/24/2014

పేదోళ్ల పింఛన్ రద్దు చేస్తే ఉద్యమిస్తాం
నిడదవోలు : జిల్లాలో ఏ ఒక్క పేదకైనా పింఛన్ తొలగిస్తే పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు  ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్  రాజశేఖరరెడ్డి జిల్లాలో 3.30 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశారని, ఇప్పుడు పింఛన్ల తనిఖీ పేరుతో టీడీపీ ప్రభుత్వం పింఛన్‌దారులను తగ్గించేందుకు కుట్ర పన్నుతోందని నాని ఆరోపించారు. పింఛన్‌దారులకు అన్యాయం జరిగిదే సహించేది లేదని, వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని నాని చెప్పారు.

  పట్టణంలోని రోటరీక్లబ్ ఆడిటోరియంలో మంగళవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పార్టీ కన్వీనర్ ఎస్.రాజీవ్‌కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నాయకుల దౌర్జన్యాలను అడ్డుకుంటామన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతి కార్యకర్త ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. తొలి సంతకంతో రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న బాబు నేడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను,

 డ్వాక్రా మహిళలను మోసం చేశాడన్నారు. పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మాట్లాడుతూ నమ్మి ఓటేసిన ప్రజలను చంద్రబాబు మోసం చేశాడన్నారు. మొదటి సంతకానికి విలువ లేకుండా చేసిన ఘనత బాబుదేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసపూరిత వైఖరిని నిరసిస్తూ వచ్చే నెల 16న ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడదామని జీఎస్ రావు పిలుపునిచ్చారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డు అనంత వెంకట రమణ చౌదరి మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందనే ప్రచారాన్ని నమ్మి యువత టీడీపీకి ఓట్లేశారని, నేడు బాబు ఉన్న జాబులను తొలగిస్తున్నారని విమర్శించారు.

 రానున్న రోజుల్లో పార్టీ మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై పక్షపాత దోరణితో వ్యవహరిస్తే కార్యకర్తలు వారికి అండగా నిలిచి వెలుగులోకి తీసుకురావాలని కోరారు.  రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ పింఛన్ల తనిఖీలో ఎవరికైనా అన్యాయం జరిగితే పోరాటం చేస్తామన్నారు. టీడీపీ పాలన ప్రజావ్యతిరేకంగా సాగుతుందని మరో నేత జీఎస్ నాయుడు అన్నారు. సమావేశంలో   మహిళా నాయకురాలు పి.శ్రీలక్ష్మి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు వజీరుద్దీన్, జెడ్పీటీసీ ముళ్లపూడి సత్యకృష్ణ, ఎంపీపీ మన్యం సూరిబాబు,  ఆత్కూరి దొరయ్య, ఉదయభాస్కర్, ముళ్లపూడి శ్రీనివాసచౌదరి, పువ్వల రతీదేవి, యాళ్ల రామారావు, నందిగం భాస్కరరావు, కంచర్ల ప్రసాద్, బూరుగుపల్లి సుబ్బారావు, మేడపాటి లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: