కృష్ణా అయినా.... గుంటూరు అయినా ఓకే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కృష్ణా అయినా.... గుంటూరు అయినా ఓకే

కృష్ణా అయినా.... గుంటూరు అయినా ఓకే

Written By news on Wednesday, September 3, 2014 | 9/03/2014

ఆంధ్రప్రదేశ్ కు కావాల్సింది శ్రీమంతుల రాజధాని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజధాని ఎక్కడైనా పెట్టండి...తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన బుధవారమిక్కడ స్పష్టం చేశారు.  కనీస సౌకర్యాలున్న ప్రాంతంలో రాజధాని ఉండాలని  వైఎస్ జగన్ అన్నారు. తాము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు. తమకు అన్ని ప్రాంతాలు ఒకటేనని.. కృష్ణా అయినా గుంటూరు అయినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే రాజధానిపై ఏకపక్ష నిర్ణయం ఒప్పుకునేది లేదని, శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చర్చ జరగాలని, చర్చ తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు.

రాజధాని ఎక్కడపెట్టినా లక్ష ఎకరాల వరకూ డీనోటిఫై చేస్తామని విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. రాజధానిలో సామాన్య ఉద్యోగికి కూడా భూములు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆలోచనలు చూస్తే శ్రీమంతులకే పరిమితమయ్యే రాజధానిలా ఉందన్నారు. చదువుకునే పిల్లలు భవిష్యత్ లో  ఉద్యోగానికి వెళ్తే రాజధానిలో భూమి కొనుగోలు చేసుకునే అవకాశం ఉండాలన్నారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే ఏం చేయాలి? అని ఆలోచించాలన్నారు. నియంత మాదిరిగా నా ఇష్టం నేను ఇక్కడే పెడతానంటే ఎలా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం బతికే ఉందా అని అడిగారు.  ప్రకటన తర్వాత చర్చ ఉంటే అంతకంటే దారుణం ఉందా అన్నారు.

మేం చేయాల్సింది చేస్తాం, మీ చావు మీరు చావడమంటే ప్రజాస్వామ్యం ఇదేనా అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. రాజకీయాలు పక్కనపెట్టి ఆలోచించాలని, భావితరాలకు ఏం సమాధానం చెప్పాలని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుపై సభలో చర్చతో పాటు ఓటింగ్ ఉండాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సభ్యుల అభిప్రాయాలు వద్దనడం సమంజసమేనా అన్నారు. ఎవరికో మేలు చేయడం కోసం ఆలోచించవద్దని, విశాల దృక్పధం ఉండాలన్నారు. ఇదే పరిస్థితి 1953లో ఉత్పన్నమైనప్పుడు సభలో అయిదు రోజులపాటు చర్చ జరిగిందన్నారు. చర్చ, ఓటింగ్ జరగాలని... అటువంటి పరిస్థితి లేనప్పుడు అసెంబ్లీ సమావేశాలెందుకని వైఎస్ జగన్ సూటిగా ప్రశించారు.
Share this article :

0 comments: