Home »
» తహశీల్దారుపై టీడీపీ కార్యకర్త దాడి
తహశీల్దారుపై టీడీపీ కార్యకర్త దాడి

పుల్లంపేట: అధికారం ఉందని అధికార టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే ఎదుటే టీడీపీ కార్యకర్త తహశీల్దారును దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో తహశీల్దారు స్థానిక ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం రైల్వేకోడూరు శాసనసభ్యుడు కొరముట్ల శ్రీనివాసులు ఎదుటే టీడీపీకి చెందిన కార్యకర్త తహశీల్దారు చంద్రశేఖర్‌ను దుర్భాషలాడుతూ ఆయనపైకి దూసుకెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించిన సంఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై తహశీల్దారు చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలపరిధిలోని ఎగువరామక్కపల్లెకు చెందిన పోతినేని సుబ్రమణ్యం(మణి) తనపై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. గతంలో సుబ్రమణ్యం ఓ భూమికి సంబంధించి తప్పుడు వివరాలతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని.. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో సరైన ఆధారాలు లేని కారణంగా సదరు భూమిని రీవోక్ చేశామని తెలిపారు. ఈ విషయంపై మణి పలుమార్లు ఫోన్‌లో కూడా బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నాగరాజు తన సిబ్బందితో కార్యాలయానికి వచ్చి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వీఆర్వోలు శనివారం మూకుమ్మడిగా ఆర్‌డిఓకు ఫిర్యాదు చేయనున్నారు. తహశీల్దారు దళితుడు కావడం వల్లనే అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి దూషించి దాడికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.
0 comments:
Post a Comment