వైఎస్సార్‌సీపీ కమిటీల సమావేశం నేడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ కమిటీల సమావేశం నేడు

వైఎస్సార్‌సీపీ కమిటీల సమావేశం నేడు

Written By news on Tuesday, September 9, 2014 | 9/09/2014

వైఎస్సార్‌సీపీ కమిటీల సమావేశం నేడు
పార్టీ పటిష్టత దిశగా చర్యలు
ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి విస్తృత స్థాయి సమావేశం

 
హైదరాబాద్: పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఇటీవల పునర్‌వ్యస్థీకరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం మంగళవారం జరుగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించే ఈ సమావేశం ఆయన క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. 2014 ఎన్నికల తరువాత జరుగనున్న తొలి విసృ్తత స్థాయి సమావేశం అయినందున దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీని అన్ని విధాలా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నూతన కమిటీల్లో చాలా మందికి అవకాశం కల్పించారు. గ్రామస్థాయి నుంచీ పార్టీ నిర్మాణం, మండలాలు, జిల్లాల కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. అదే విధంగా సమాజంలోని విభిన్న వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికపుడు స్పందించేందుకు వీలుగా పార్టీ అధ్యక్షుడు దిశా నిర్దేశం చేస్తారు. కొత్తగా నియమితులైన వారికి పార్టీ పరంగా నిర్మాణపరమైన బాధ్యతలు అప్పగించే అంశం కూడా చర్చకు వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

మూడు రోజుల క్రితం ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతల రుణాల మాఫీ, నిరుద్యోగులకు భృతి, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలపై వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన గట్టిగా ప్రభుత్వంపై పోరాడింది. అయితే ప్రభుత్వం ఈ అంశాలు వేటిపైనా స్పష్టతనివ్వకుండా ప్రజలను గందరగోళంలో పడేసింది. ఈ నేపథ్యంలో ప్రజలకు టీడీపీ ఇచ్చిన హామీలు, వాటిపై మాట తప్పిన విషయాన్ని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లాలని కూడా జగన్ ఈ సమావేశంలో కోరే అవకాశం ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ అధికార ప్రతినిధులు, టీవీ చర్చల ప్రతినిధులు, రాష్ట్ర పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు.
 
 
వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నియామకం

హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన అనంతర పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం 11మందితో తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాష్, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, అబ్దుల్ రెహమాన్, బి.జనక్‌ప్రసాద్ ఉన్నారు. ఈ కమిటీ తెలంగాణలో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి వరకు వైఎస్సార్‌సీపీని పటిష్టం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

వైఎస్సార్‌సీపీ కమిటీల్లో మరికొందరి నియామకం

వైఎస్సార్ సీపీ ఇటీవలి కాలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో మరి కొందరిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(ప్రకాశం, నెల్లూరు), కార్యదర్శులుగా వంశీ కృష్ణ శ్రీనివాస్, కె.మోషేన్ రాజు, సీజీసీ సభ్యులుగా కుడిపూడి చిట్టబ్బాయి, పాలపర్తి డేవిడ్‌రాజు, అధికార ప్రతినిధిగా పాలపర్తి డేవిడ్‌రాజు నియమితులైనట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
Share this article :

0 comments: