రూ.10 పులిహోరతో సరిపెడతారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూ.10 పులిహోరతో సరిపెడతారా?

రూ.10 పులిహోరతో సరిపెడతారా?

Written By news on Friday, October 17, 2014 | 10/17/2014


* ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జగన్
* సాయం చేశామని చెప్పుకొనే ధైర్యం ప్రభుత్వానికి లేదు
* నేడు సాకేతపురం, గాజువాక ప్రాంతాల్లో జగన్ పర్యటన

సాక్షి, విశాఖపట్నం: ‘‘పెద్ద పెద్ద గాలులొచ్చా యి, ఇళ్లు కూలిపోయాయి, సర్వస్వం కోల్పోయి జనం వీధిన పడ్డారు... అయినా వారెలా ఉన్నారని పట్టించుకోవడానికి, ఎంత నష్టంజరిగిందని నష్టం రాసుకోవడానికి కూడా ప్రభుత్వ అధికారులెవరూ రాలేదు. సీఎం చంద్రబాబు మాత్రం పొద్దున్నే టీవీల్లో కనిపించి అదిచేస్తాం.. ఇది చేస్తాం.. అని మాయమాటలు చెబుతున్నారు. నిజానికి ఎక్కడో ఒక లారీలో రూ.10 పులిహోర పాకెట్లు కొన్ని తెచ్చి, దూరం నుంచి విసిరేసి అంతా చేసేశామన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదేనా చిత్తశుద్ధి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై, పాలకులపై ధ్వజమెత్తారు.

మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ప్రతీ ఇంటి దగ్గరకు వచ్చి ఏమేమి ఇస్తారో ఇచ్చి అప్పుడు సగర్వంగా ఎందుకు చెప్పుకోరని ప్రశ్నించారు. ప్రభుత్వం నిజాయితీగా సాయం చేయాలనుకుంటే రూ.లక్షల కోట్లు ఉన్నాయని, కానీ మంచి చేయాలనే ఉద్దేశం ఎవరిలోనూ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏదో చేసేస్తున్నామని ఊరికే కలర్ పూసేసి చెప్పుకుంటున్నారని, ఇలాగే వదిలేస్తే ఎప్పటికీ సాయం అందదని ఆందోళన వ్యక్తంచేశారు. హుదూద్ తుపాను ధాటికి కకావికలమైన విశాఖలోని పలు ప్రాంతాల్లో ఆయన గురువారం పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి కొండంత ధైర్యమిచ్చారు.

ప్రతిపక్షంలో ఉన్నా సహాయం చేయడానికి ముందుంటామని, ప్రతీ కాలనీలోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అండగా నిలబడతారని చెప్పారు. కొన్ని రోజులు సమయం ఇచ్చి అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే బాధితులందరితో కలిసి రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తామని, ప్రభుత్వం మెడలు వంచయినా మంచి జరిగేలా ప్రయత్నిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. ఉదయం గవర్నర్ బంగ్లా ప్రాంతం నుంచి ప్రారంభమైన జగన్‌పర్యటన వైఎస్సార్ కాలనీ, ధర్మానగర్, బీఎన్‌ఐటీఎన్ కాలనీ, సీతమ్మధార, బాలయ్యశాస్త్రి లేఔట్, రాజీవ్ కాలనీ, ఏకేపీ కాలనీ, మల్కాపురం జయేంద్రకాలనీ, కాకర్లలోవ, చింతల్లోవ, కొత్త గాజువాక ప్రాంతాల మీదుగా సాగింది. ఆయన శుక్రవారం సాకేతపురం, స్టీల్‌ప్లాంట్, బర్మా కాలనీ, అశోక్‌నగర్, దయాళ్ నగర్, హైస్కూల్ రోడ్డు, గాజువాక ల్లో  పర్యటిస్తారు.

అడుగడుగునా కష్టాలు తెలుసుకుంటూ...
వైఎస్సార్ కాలనీలో ప్రజల అవస్థలను జగన్ ప్రత్యక్షంగా చూశారు. గండి రాములమ్మ, మీసాల రాజేశ్వరి, నారాయణమ్మ అనే మహిళలు తమ పాకలు ఎగిరిపోయాయని, ఇంతవరకూ ఎవరూ తమని చూడడానికి కూడా రాలేదని విలపించారు. ఏమైనా ఇచ్చారా తల్లీ? అని జగన్ ప్రశ్నించగా... పనికిరాని పులిహోర ప్యాకెట్లు ఇచ్చారని వారు బదులిచ్చారు.

ఇళ్లు కూలిపోయి నడిరోడ్డున పడ్డ నాస రామయ్య, నడిపూడి చంద్రరావు, నాగేశ్వరరావులను జగన్ పరామర్శించారు. అన్నయ్యా... ఇల్లు పోయింది, పిల్లలతో దిక్కులేని వాళ్లమయ్యామని సియాద్రి మాధురి తన గోడు చెప్పుకుంది. ఇల్లు మొత్తం పడిపోయిందని, పింఛను కూడా రావడం లేద ని, పోలియో వచ్చిన కొడుకుతో అవస్థలు పడుతున్నానని గొడ్డు అప్పారావు తన దుస్థితిని వివరించారు. నిరాశ్రయులైన వారందరినీ జగన్ పేరు పేరునా పలకరించి ఓదార్పునిచ్చారు. అక్కడనుంచి రైల్వే కాలనీలో క్వార్టర్స్ దుస్థితిని పరిశీలించి... ‘సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్ల పరిస్థితే ఇట్లుంది’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ప్రతీ చోట ఓపిగ్గా గంటల తరబడి జనం కష్టాలు తెలుసుకుంటూ, వారికి భరోసానిస్తూ జగన్ ముందుకు కదిలారు. వెళ్లిన ప్రతీచోట ఎవరైనా వచ్చారా?  సాయమేదైనా చేశారా? అని ఆరా తీశారు. ఇంతవరకూ తామున్నామో పోయామో పట్టించుకోవడానికి కూడా ఎవరూ రాకపోయినా మీరు మాత్రమే వచ్చారని ప్రజలు బదులిచ్చారు. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు బాధితులకు సాయమందించడానికి వైఎస్సార్ పార్టీ శ్రేణులు ఆహార సరుకులు టన్నుల కొద్దీ తీసుకువచ్చి జగన్ సమక్షంలోనే పంచిపెట్టారు. కొత్త గాజువాక చేరుకొనే సరికి రాత్రి ఎనిమిది గంటలు కావస్తున్నా జగన్ అక్కడ కూలిపోయిన మసీదును సైతం పరిశీలించి ముస్లిం సోదరులకు అండగాఉంటానని ధైర్యమిచ్చారు.
Share this article :

0 comments: