తుపాను బాధితులందరికీ న్యాయం జరిగేవరకు పోరాడతాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తుపాను బాధితులందరికీ న్యాయం జరిగేవరకు పోరాడతాం

తుపాను బాధితులందరికీ న్యాయం జరిగేవరకు పోరాడతాం

Written By news on Thursday, October 16, 2014 | 10/16/2014

ప్రజలతో కలసి రోడ్లపైకొస్తాంబుధవారం విశాఖపట్నం పెదజాలరి పేటలో జగన్ కు గోడు చెప్పుకుంటున్న మహిళలు
తుపాను బాధితులందరికీ న్యాయం జరిగేవరకు పోరాడతాం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి
 
తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి
తుపాను వచ్చి నాలుగు రోజులైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో
ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు
సమీక్షలతో కాలయాపన తప్ప సహాయ చర్యలు చేపట్టనే లేదు
చిత్రాన్నం పెట్టి పేదలను గాలికి వదిలేశారు..
ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా?
విశాఖపట్నంలో తుపాను బాధితులకు జగన్ పరామర్శ
మత్య్యకారులతో మమేకం.. కొండలు ఎక్కిమరీ బాధితులకు భరోసా

 
విశాఖపట్నం : తుపాను బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని, లేదంటే ప్రజలతో కలిసి రోడ్ల పైకొచ్చి పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హెచ్చరించారు. ‘‘తుపానుతో ఛిన్నాభిన్నమైన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. లక్షలాదిమంది మత్స్యకారులకు బతుకుదెరువైన ఈ వృత్తిని కాపాడాలి. తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి. సోనా బోటుకు రూ.25 లక్షలు, ఫైబర్ బోట్‌కు రూ. 2.50 లక్షలు పరిహారం ఇవ్వాలి.  దెబ్బతిన్న బోట్ల మరమ్మతులకు రూ.50 వేలు, వలలకు రూ.25 వేలు ఇవ్వాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హుదూద్ తుపానుతో అల్లకల్లోలమైన విశాఖపట్నంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పర్యటించారు. తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఫిషింగ్ హార్బర్, జాలరిపేట, చినగదిలి, పెదగదిలిలో పర్యటించి, బాధితులను పరామర్శించారు. సర్వం కోల్పోయిన మత్స్యకారులు, పేదల బాధలను చూసి చలించిపోయారు. ప్రభుత్వ సహాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయ, పునరావాస చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని బాధితులు వివరించారు. జగన్‌ను పట్టుకొని కన్నీటిపర్యంతమయ్యారు. దాంతో జగన్ తీవ్ర ఆవేదన చెందారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ధ్వజమెత్తారు. ‘తుపాను వచ్చి నాలుగు రోజులైంది.

కానీ  క్షేత్రస్థాయిలో ఏం జరిగిందన్నది ప్రభుత్వం ఇంతవరకు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. సమీక్షలతో కాలయాపన తప్ప సహాయ చర్యలు చేపట్టనే లేదు. అసలు ఎంత నష్టం వచ్చింది? ఎన్ని బోట్లు మునిగిపోయాయి? ఎన్ని దెబ్బతిన్నాయి? ఎన్ని ఇళ్లు కూలిపోయాయి? ఎంతమంది రోడ్డున పడ్డారు అని తెలుసుకోవడానికి ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా రాలేదు. ఏదో చిత్రాన్నం పెట్టి పేదలను గాలికి వదిలేశారు. ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా’’ అని జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు. ‘‘కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఆ బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చడంలేదు. బాధ్యతల నుంచి తప్పించుకుంటోంది. ప్రభుత్వం పనిచేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. ప్రజలతోపాటు ప్రభుత్వాన్ని మేమూ నిలదీస్తాం. అవసరమైతే ప్రజలతో కలసి రోడ్లపైకి వస్తాం. ధర్నాలు చేస్తాం. ప్రతి బాధితుడికీ న్యాయం జరిగేవరకు గట్టిగా  పోరాడతాం’’ అని చెప్పారు.

కాలి నడకన.. కొండలు ఎక్కి..

జగన్ బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మత్స్యకార గ్రామాల్లో కాలినడకన బాధితుల వద్దకు వెళ్లారు. పెద జాలరిపేటలో ఇసుకలో నడిచి వెళ్లారు. చిన గదిలి, పెద గదిలిలో కొండలెక్కి మరీ బాధితుల చెంతకు వెళ్లారు. హుదూద్ తుపానుకు దెబ్బతిన్న బోట్లు, పడవలు, వలలు, ఇళ్లు, చెల్లాచెదురైన సామాన్యుల జీవితాన్ని దగ్గరకు వెళ్లి మరీ చూశారు. దాదాపు 40 వేల మంది మత్స్యకారులకు జీవనాధారమైన విశాఖ ఫిషింగ్ హార్బర్ మొత్తం కలియదిరిగారు. అక్కడ ఎండుచేపలు విక్రయించే అప్పాయమ్మ, సత్యవతి, కుశలమ్మలను పలకరించి వారి బాధను తెలుసుకున్నారు.

ఫిషింగ్ హార్బర్ జంక్షన్ వద్ద భారీగా చేరిన మత్స్యకారులతో మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా పెద్ద జాలరిపేటకు చేరుకున్నారు. జాలరిపేట ముఖద్వారం వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన మహిళల వద్దకు వెళ్లి  ఆప్యాయంగా పలకరించారు. కూలిన ప్రతి ఇంటిని చూశారు. ప్రతి బాధిత కుటుంబాన్ని పలకరించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. జగన్ అక్కడి నుంచి సముద్రతీరం వరకు దాదాపు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. అక్కడ కుప్పకూలిన ఇళ్లు, పాడైపోయిన బోట్లు, వలలు, మోటారు ఇంజన్లు వరుసగా పడి ఉండటం ఆయన మనసును కలచివేసింది.

ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి దాదాపు 3 వేల మంది బాధితులతో మాట్లాడారు. వారి బాధలను తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు జగన్ జాలరిపేటలోనే గడిపి బాధితులకు సాంత్వన చేకూర్చారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సాయంత్రం ఆయన పెదగదిలి, చినగదిలిలోని కొండ ప్రాంతాల్లో పర్యటించారు. కాలినడకన కొండలను ఎక్కి మరీ బాధితుల చెంతకు వెళ్లారు. ఏటవాలు ప్రాంతాల్లో, కొండ చరియల్లో ఉన్న ఇళ్లకు కూడా వెళ్లి తుపాను మిగిల్చిన నష్టాన్ని కళ్లారా చూశారు. తుపాను వచ్చి నాలుగు రోజులైనా తమ వద్దకు ఏ ఒక్క ప్రజాప్రతినిధిగానీ అధికారిగానీ రాలేదని అక్కడివారు చెప్పారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని తెలుసుకుని జగన్ ఆవేదనకు గురయ్యారు. వారి తరపున పోరాడతానని చెప్పారు. బధిరులైన కర్రి భవాని, కందెల లక్ష్మిలను పార్టీ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెంట పార్టీ ప్రధాన కార్యదర్శులు ధర్మాన ప్రసాదరావు, గొల్ల బాబూరావు, తలశిల రఘురాం, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ నేతలు కోలా గురువులు, వంశీకృష్ణ, చొక్కాకుల వెంకటరావు, కర్రి సీతారాం, ఉమాశంకర్ గణేష్, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజ య్‌ప్రసాద్, పిరియా సాయిరాజ్,  సత్తి రామకృష్ణారెడ్డి, కొయ్య ప్రసాదరెడ్డి ఉన్నారు.
 
ఇప్పుడు మాకేం మిగల్లేదు
‘ఈ సోనా బోట్లే మా బోటోల్లకి బతుకుదెరువు. ఇలాంటివి 58 బోట్లు మునిగిపోనాయి. మరో 400 బోట్లు దెబ్బతిన్నాయి. మొత్తం నష్టపోనాం. ఒక్కో బోటు పాతిక లక్షలు చేస్తాది. ఒక్కో బోటు మీద పది కుటుంబాలు ఆధారపడ్డాయి. ఇప్పుడు మాకేం మిగల్లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు’ అని మత్స్యకారుడు, సోనా బోట్ యజమానుల అసోషియేషన్ అధ్యక్షుడు పీసు అప్పారావు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘మీ కు అండగా నేనుంటాను. మీ తరపున పోరాడతాను. న్యాయం జరిగే వరకు తోడుంటా ను’ అని జగన్ వారికి భరోసా ఇచ్చారు.

మమ్మల్ని గాలికొదిలేశారు

‘ చూడు బాబు నా ఇల్లు ఎలా కూలిపోనాదో. మాయదారి గాలివానతో నాలుగు రోజులుగా బయటే పడున్నా. ఎవ్వరూ రాలేదు. ఓట్లు అడకగానికి ఆరోజు అంతా వచ్చారు. ఈరోజు అధికారం వచ్చాక మమ్మల్ని గాలికొదిలేశారు’ అని జాలరిపేటలోని తెడ్డమ్మ అనే మత్స్యకార మహిళ జగన్‌తో తన బాధను చెప్పుకుని గొల్లుమం ది. ఆమె ఆవేదన విన్న జగన్.. ‘అమ్మా! అధికారంలో ఉన్నవాళ్లు వారి బాధ్యత నెరవేర్చడంలేదు. వాళ్లను అడిగే హక్కు మీకుంది. మీతో కలిసి నేనూ ప్రభుత్వాన్ని నిలదీస్తాను. మీకు కొత్త ఇళ్లు వచ్చేవరకు పోరాడతాను’ అంటూ ధైర్యం చెప్పారు.
Share this article :

0 comments: