కొండంత అండ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొండంత అండ

కొండంత అండ

Written By news on Friday, October 17, 2014 | 10/17/2014


కొండంత అండ
  • కూలిన ఇళ్లల్లో చితికిన బతుకులకు జగన్ భరోసా
  •  పేరు పేరునా పలకరింపు
  •  కష్టాలు చెప్పుకున్న బాధితులు
  •  తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మూడోరోజు పర్యటన
  •  ప్రభుత్వ అసమర్థతపై ధ్వజం
సాక్షి, విశాఖపట్నం: భవంతులను కూల్చేసే పెను గాలులు.. మునుపెన్నడూ చూడని ప్రకృతి ప్రకోపాన్ని చూసిన ప్రజలు ఆ భీకర భయానక సంఘటన నుంచి తేరుకోలేకపోతున్నారు. ఇళ్లు కూలిపోయి, సర్వస్వం కోల్పోయి, తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతున్నారు. విశాఖ జిల్లాను హుదూద్ చిగురుటాకులా వణికించి ఐదు రోజులు కావస్తున్నా ఇంత వరకూ కనీసం మంచినీటికి కూడా నోచుకోక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.

ఇంతటి కష్టంలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించి కాస్త ఓదార్పు నివ్వడానికే ప్రభుత్వానికి, పాలకులకు సమయం సరిపోవడం లేదు. ఇలాంటి సమయంలో తమ బాధలు వినడానికి జగన్ వచ్చాడని తెలిసి జనం తండోపతండాలుగా వీధుల్లోకి వస్తున్నారు. ‘బాబూ మా ఇంటికి రా బాబూ..మా కష్టం ఒక్కసారి చూడు బాబూ’అని అడుగుతున్నారు. కూలిన ప్రతి ఇంటినీ, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, వారి కష్టాలు తెలుసుకుంటూ, భాధలు తీరుస్తానని భరోసా ఇస్తూ జగన్ పర్యటన సాగిస్తున్నారు.

హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పర్యటించారు. ఉదయం 9.30 గంటలకు గవర్నర్ బంగ్లా ప్రాంతం నుంచి  బయల్దేరిన జగన్ సమీప ప్రాంత ప్రజలతో మాట్లాడారు. తాగడానికి నీరు లేదనివారు చెప్పుకున్నారు. అక్కడి నుంచి వైఎస్సార్ కాలనీకి చేరుకుని కూలిన దోకి అనంతరావు ఇంటిని పరిశీలించారు. మీకు సాయమేదైనా అందిందా అని అక్కడి బాధితులను అడిగారు. ఎవరూ రాలేదని, ఏమీ ఇవ్వలేదని, పనికిరాని పులిహోర ప్యాకెట్లు విసిరేసిపోయారని అక్కడి వారు తమ బాధలు చెప్పుకున్నారు.

ఇల్లుకూలిపోయి కష్టాలు పడుతున్న దేవిపాటి ఉమావతి ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించారు. అక్కడి నుంచి  ధర్మాన నగర్ వెళ్లారు. ప్రమాదంలో కాలు పూర్తిగా కోల్పోయిన సుండి భాస్కరరావును పలకరించారు. ఇల్లు కూలి గూడు కోల్పోయిన ధేబుయేన్ దుర్గను చూసిన జగన్ ఆమె వద్దకు వెళ్లి ఓదార్చారు. బీఎన్‌ఐటీఎన్ కాలనీ(రైల్వే కాలనీ)కి వెళ్లి కేంద్ర ప్రభుత్వం కూడా బాధితులను పట్టించుకోకపోవడంపై జగన్ విచారం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి సీతమ్మధార వచ్చారు. తిరిగి కాసేపు విరామం అనంతరం తిరిగి పర్యటన ప్రారంభించి బాలయ్యశాస్త్రి లేఅవుట్ వద్ద ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు.
 
అనంతరం రాజీవ్‌కాలనీ, ఏకేసీ కాలనీల్లో బాధితులను పరామర్శించారు. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటూ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టీవీల్లో ప్రసంగాలు ఇవ్వడంతో సరిపెట్టకుండా ప్రజలకు మంచి చేయాలనుకుంటే ప్రతి ఇంటికి వచ్చి అవసరమైన సరకులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘మేం ప్రతిపక్షంలోనే ఉన్నాం తల్లీ..మన ప్రభుత్వం రాగానే మీ సమస్యలన్నీ ఒక్క నెలలోనే తీర్చుకుందాం. మీకు పక్కా భవనాలు నిర్మించుకుందాం.

ఈలోగా మీకు మంచి జరిగేలా ప్రభుత్వం మెడలు వంచేలా గట్టి ప్రయత్నం చేద్దాం.’అని జగన్ భరోసా ఇచ్చారు. కనీసం నష్టం ఎంతో రాసుకోవడానికి కూడా ప్రభుత్వాధికారులెవరూ రాకపోవడం దారుణమన్నారు. పది రూపాయల పులిహోర ప్యాకెట్లు విసిరేస్తే అవి కూడా తినడానికి పనికిరాకుండా పోతే జనం ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధితుల కష్టాలను  వారినే వేదికపై చెప్పమని తెలసుకున్నారు. డి. వెంకటలక్ష్మి అనే డిగ్రీ విద్యార్థిని తమ ఇల్లు నరకానికి నకళ్లుగా ఉన్నాయని జగన్ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో జగన్ వెళ్లి ఆ ఇళ్లను పరిశీలించారు.

అక్కడి నుంచి మల్కాపురం వెళ్లి కాకల్లోవ, జయేంద్రకాలనీ, చింతల్లోవ, కొత్త గాజువాక ప్రాంతాల్లో పర్యటించారు. అప్పటికే చీకటి పడినప్పటికీ చింతల్లోవలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధిత ప్రజలకు అండగా ఉంటారని, తమ తరపున చేయాల్సినవన్నీ చేస్తామని అన్నారు. కొత్తగాజువాకలో తుపానుకు దెబ్బతిన్న మసీదును పరిశీలించారు. ముస్లిం సోదరులకు తామెల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.

అక్కడి నుంచి రాత్రి బసకు నగరానికి చేరుకున్నారు. జగన్ పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు,  మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, పిరియా సాయిరాజ్, పార్టీ నేతలు  చొక్కాకుల వెంకటరావు, కోలాగురువులు, తిప్పల నాగిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, ఐ.హెచ్.ఫరూఖీ, కొయ్య ప్రసాదరెడ్డి, కోరాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
 
నేటి పర్యటన ఇలా
హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన శుక్రవారం నగరంలోని సాకేత పురం, స్టీల్‌ప్లాంట్, బర్మా కాలనీ, అశోక్‌నగర్, దయాళ్‌నగర్, హై స్కూల్ రోడ్, గాజువాక ఏరియాల్లో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించడంతో పాటు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(కార్యక్రమాలు) తలశిల రఘురాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Share this article :

0 comments: