రీయింబర్స్‌మెంట్‌కు ఆంక్షలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రీయింబర్స్‌మెంట్‌కు ఆంక్షలా?

రీయింబర్స్‌మెంట్‌కు ఆంక్షలా?

Written By news on Monday, October 20, 2014 | 10/20/2014


రీయింబర్స్‌మెంట్‌కు ఆంక్షలా?
బాబు ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: అనేక రకాల ఆంక్షలతో ఇప్పటికే రైతు రుణమాఫీ, ఫించను పథకాల్లో భారీగా కోతలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అదే తీరున విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కె. పార్థసారథి ఆదివారం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నిబంధన లు చూస్తే రాష్ట్ర విద్యార్ధులకు తీవ్ర అన్యాయం జరిగేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్క విద్యార్థికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు. విద్యార్థులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. స్థానికతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.  
 
బాబుదంతా.. ప్రచార ఆర్భాటమే
హుదూద్ తుపాను తరువాత ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే.. చంద్రబాబు మాత్రం పూర్తి ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని పార్థసారథి ఆరోపించారు. తమ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తరువాత పార్టీ నేతలందరం చర్చించుకొని తుపాను సాయంపై ప్రధానిని కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా త్వరలో తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పారు.
Share this article :

0 comments: