ఏపీ అలాగే ఉంది.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏపీ అలాగే ఉంది..

ఏపీ అలాగే ఉంది..

Written By news on Sunday, November 2, 2014 | 11/02/2014


‘నవంబర్ 1’ ప్రాధాన్యతను  మర్చిపోతున్నారు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శ
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన నవంబర్ 1వ తేదీ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మరించారని, చరిత్రను స్మరించకపోవడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థారుులో విమర్శించారు. ఎందరో మహనీయుల త్యాగాలు, బలిదానాల ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న జరపకూడదని చంద్రబాబు ఏ ఉద్దేశంతో భావించారో అర్థం కాలేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకుని నవంబర్ 1 నాడే రాష్ట్రావతరణ వేడుకకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాకాకుంటే రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు నవంబర్ 1 నాడే రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుతుందన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి త్రివర్ణ పతాకం ఎగురవే సిన అనంతరం ప్రసంగించారు.
 
 ఏపీ అలాగే ఉంది..
 
 తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అందరూ ఒక్కటిగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన రోజు గుర్తుకొస్తుందని జగన్ అన్నారు. నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే ఉందని, అందులో నుంచి 29వ రాష్ర్టంగా తెలంగాణ ఏర్పడిందన్నారు. ‘జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అని చెప్పుకుంటే అర్థం ఉంటుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1ని వదిలేసి.. ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జూన్ 2కే మార్చడం అనేది నిజం గా ఎవరికీ అర్థం కాని విషయం’ అని అన్నారు. బీహార్ నుంచి జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయినప్పుడు ఆ మూడు ప్రధాన రాష్ట్రాల (బీహార్, మధ్యప్రదేశ్, యూపీ) అవతరణ దినోత్సవాల తేదీలను మార్చిన సందర్భం లేదన్నారు. ఆయూ విషయూలు బాబుకు తెలిసి కూడా ఏ ఉద్దేశంతో అవతరణ తేదీని మార్చారో తెలియడం లేదన్నారు. ‘చరిత్ర అనేది అనవసరమైన సబ్జెక్ట్ అని చంద్రబాబు ఎప్పుడూ చెబుతూంటారు. అసలు చరిత్రను పాఠ్యాంశంగా పెట్టకూడదనీ అంటా రు. చరిత్ర ఎంత అవసరమో ఆయన ఇప్పటికైనా గ్రహించాలి’ అని ఆయన హితవు పలి కారు. అమరుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం అవతరించిన నవంబర్ 1వ తేదీ ఎప్పుడు వచ్చినా ఆ త్యాగమూర్తులు, వారి త్యాగాలు గుర్తుకొస్తాయని, ఇప్పటికైనా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. తెలుగువారు ఎక్కడున్నా వారందరికీ నవంబర్ 1ని పురస్కరించుకుని హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.  
 
 ప్రజలు ఆవేదనతో ఉన్నారు: ధర్మాన
 
 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న జరపకపోవడంపై ప్రజలు ఆవేదనతో ఉన్నారని, దీనికి చంద్రబాబు ప్రభుత్వం కొత్త భాష్యం చెప్పడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తప్పుబట్టారు. 1956లో దేశంలో 14 భాషాప్రయుక్త రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటయ్యాయని అప్పటి నుంచి ఆయూ రాష్ట్రాలన్నీ నవంబర్ 1 నాడే అవతరణ దినోత్సవాలను నిర్వహించుకుంటున్నాయని తెలిపారు. కేంద్ర చట్టంలో కూడా ఏపీ అవతరణ నవంబర్ 1నే జరిగినట్టు స్పష్టంగా ఉందన్నారు. కేంద్ర చట్టంలో ఉన్న అవతరణ అంశాన్ని రాష్ట్ర మంత్రి వర్గ తీర్మానం ద్వారా మార్చడం దారుణమన్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నవంబర్ 1నాడే అవతరణ దినోత్సవం నిర్వహించాలని జగన్‌మోహన్‌రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర ప్రజలంతా ఇందుకు గర్విస్తున్నారని చెప్పారు.  
 
 ఘనంగా ఏపీ అవతరణ వేడుకలు
 
 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. దీనికిముందు తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గీతాలాపనతో వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ‘జై తెలుగుతల్లి’ నినాదంతో హోరెత్తించారు. కార్యక్రమంలో పార్టీ తెలంగాణ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు జ్యోతుల నెహ్రూ, డీఏ సోమయాజులు, సజ్జల రామకృష్ణారెడ్డి, హెచ్‌ఏ రెహ్మాన్, పీఎన్వీ ప్రసాద్, గొల్ల బాబూరావు, వాసిరెడ్డి పద్మ, కొత్తపల్లి సుబ్బారాయుడు, లక్ష్మీపార్వతి, పుత్తా ప్రతాపరెడ్డి, వై. నాగిరెడ్డి, నల్లా సూర్యప్రకాష్, గట్టు, అమృతా సాగర్ తదితరులు పాల్గొన్నారు.     
Share this article :

0 comments: