ముందస్తు ప్రణాళికలో భాగంగానే...! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముందస్తు ప్రణాళికలో భాగంగానే...!

ముందస్తు ప్రణాళికలో భాగంగానే...!

Written By news on Tuesday, November 4, 2014 | 11/04/2014


ముందస్తు కుట్రే!
భూమా సహా 12 మందిపై రౌడీషీట్

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై ఏకంగా రౌడీషీట్ తెరవాలని అధికారపార్టీ ముందుగానే నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. గతంలో డీజీపీ జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా రౌడీషీట్ తెరిచేందుకు నిర్ణయించింది. ఇందుకు పురపాలక సంఘం సమావేశాన్ని వేదికగా ఎంచుకుంది.

అక్కడ జరిగిన గొడవతో భూమాకు సంబంధం లేకపోయినప్పటికీ ఆయనపై మొదట్లో రెండు హత్యాయత్నం(307) కేసులు నమోదు చేశారు. అయితే, రౌడీషీట్ తెరవాలంటే ఏడాదిలో రెండు వేర్వేరు కేసులు నమోదై ఉండాలనే నిబంధనకు అనుగుణంగా అప్పటికప్పుడు అర్ధరాత్రి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా బనాయించారు. అంటే భూమాపై రౌడీషీట్ తెరిచేందుకు అధికారపార్టీ ముందుగానే నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆ మేరకు తమ్ముళ్ల డెరైక్షన్‌తో పోలీసులు కథ నడిపినట్లు స్పష్టమవుతోంది. మొత్తం మీద భూమాతో పాటు కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు శివశంకర్, కృపాకర్, కొండారెడ్డి, కరీముల్లా, చంటి, నాగేశ్వరరావు, వడ్డెశ్రీను, బాబు, వడ్డె మనోజ్, దేవనగర్ మధు, ప్రసాద్, అజ్మీర్ బాషాలపై రౌడీషీట్ తెరచినట్టు పోలీసులు సోమవారం రాత్రి ప్రకటించారు. భూమాతో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన కౌన్సిలర్లపై రౌడీషీట్ తెరిచేందుకు ముందుగానే నిర్ణయించిన అధికార పార్టీ... జిల్లాలో సోమవారం సీఎం కార్యక్రమం ఉండటంతో కాస్త వెనకడుగు వేసినట్టు సమాచారం. సీఎం పర్యటన సాయంత్రం ముగియగానే ఆయనపై రౌడీషీట్‌ను తెరిచినట్లు నంద్యాల పోలీసులు ప్రకటించడం గమనార్హం.

 ముందస్తు ప్రణాళికలో భాగంగానే...!
 భూమా నాగిరెడ్డి లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించాలని ముందస్తుగానే అధికార పార్టీ ప్రణాళిక వేసుకుందని తెలుస్తోంది. అందుకే... గతంలో ఎన్నడూ లేని విధంగా పురపాలక సంఘం సమావేశ సమాయంలో పోలీసు బలగాలను మోహరించారు. పురపాలక సంఘం కమిషనర్ గైర్హాజరవడం కూడా ఇందులో భాగమేనని స్వయంగా కౌన్సిలర్లే ఆరోపిస్తున్నారు.

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ప్రసంగిస్తానన్న వెంటనే సమావేశం ముగిసిందని చైర్‌పర్సన్‌తో పాటు సంబంధం లేని ఆమె భర్త కూడా ప్రకటించారు. తన ప్రసంగం వినాల్సిందేనని భూమా సైగ చేసిన వెంటనే ఇదే అదనుగా భావించిన అధికార పార్టీ... ఆయన సైగ చేసినందువల్లే దాడులు జరిగాయని కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొచ్చింది. అయితే, కేవలం హత్యాయత్నం కేసు మాత్రమే పెడితే రౌడీషీటు తెరవలేమని భావించి రెండు హత్యాయత్నాలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా బనాయించింది.

 డీజీపీ సర్క్యులర్ ఏమి చెబుతుందంటే...
 వాస్తవానికి రౌడీషీట్ తెరవాలంటే ఏడాది కాలంలో రెండు బాడీలీ అఫెషెన్స్.. అంటే హత్య, హత్యాయత్నం, దాడి కేసులు నమోదై ఉండాలని సెప్టెంబర్‌లో డీజీపీ జారీచేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఒకవేళ కేసులు లేనప్పటికీ ఒక వ్యక్తి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుండటం, ఆ తరహా గత చరిత్ర ఉంటే కూడా రౌడీషీటు తెరవవచ్చని సర్క్యులర్ చెబుతోంది. అయితే, భూమాపై గతంలో నమోదైన కేసులన్నీ కోర్టులు కొట్టేశాయి. దీంతో ఆయన గత చరిత్రను చూపి రౌడీషీట్ తెరవలేమని భావించిన పోలీసులు... భూమాకు సంబంధం లేకపోయిప్పటికీ అక్రమంగా మూడు కేసులు బనాయించి రౌడీషీట్ తెరిచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Share this article :

0 comments: