ఆ టీడీపీ నేతలను అరెస్టు చేయాలి: వాసిరెడ్డి పద్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ టీడీపీ నేతలను అరెస్టు చేయాలి: వాసిరెడ్డి పద్మ

ఆ టీడీపీ నేతలను అరెస్టు చేయాలి: వాసిరెడ్డి పద్మ

Written By news on Thursday, November 27, 2014 | 11/27/2014


ఆ టీడీపీ నేతలను అరెస్టు చేయాలి: వాసిరెడ్డి పద్మ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ 
 సాక్షి, హైదరాబాద్ : అక్రమ మద్యం కేసులో నిందితుడైన కర్నూలు జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్, మాచర్లలో ఒక హత్య కేసులో నిందితునిగా ఉన్న టీడీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్‌ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఇలాంటి అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు.
 
 అధికారంలో ఉన్న టీడీపీ వారు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎలాంటి చర్యలూ ఉండటంలేదని తెలిపారు.ఇదేమి అరాచకమని, ఇదేమి న్యాయమని అన్నారు. టీడీపీ వారికైతే ఒక న్యాయం, వైఎస్సార్ సీపీ నేతలకైతే మరో న్యాయమా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు చవాకులు పేలుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక మనిషిలాగా మాట్లాడ్డంలేదని చెప్పారు. ఆయన మాట్లాడే తీరు చూస్తే ఎవరో తరుముకొస్తున్నారనే భయం ఆయనలో కనిపిస్తోందని, ఆయన మానసిక వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిదని సూచించారు. అసలు ఒక మహా పాతకం నుంచి పుట్టిన నాయకుడు ఉమామహేశ్వరరావు అని, ఆ పాతక భయం ఆయన్ని వెంటాడుతున్నందునే అలా అసహజంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీని మూసేస్తారని మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఒక పార్టీని స్థాపించిన వ్యక్తిని నిలువునా చంపి ఆ పార్టీని లాక్కున్న చరిత్ర టీడీపీ నేతలదని పద్మ చెప్పారు.
 
 అందుకే టీడీపీని పదేళ్లపాటు రాష్ట్ర ప్రజలు అడ్రస్ లేకుండా చేశారని అన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన వారు జగన్‌పై విమర్శలు చేయడం తగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదిరించి సీబీఐ కత్తిని గుండెలపై పెట్టినా బెదరకుండా వైఎస్ ఆశయాల సాధన కోసం పార్టీ పెట్టిన జగన్‌కు దానిని ఎలా కాపాడుకోవాలో తెలుసునని చెప్పారు. అసలు వైఎస్సార్ సీపీ అంటే అధికారంలో ఉన్న వారు ఎందుకంత భయంతో గంగవైలెత్తి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బాబు విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి చింతాకంత ప్రయోజనం కూడా లేదని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Share this article :

0 comments: