రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన ఉన్నాయా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన ఉన్నాయా?

రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన ఉన్నాయా?

Written By news on Tuesday, November 18, 2014 | 11/18/2014

రాజధానిపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
* నిర్మాణానికి 30 వేల ఎకరాలు ఎందుకు
* రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన ఉన్నాయా?
* వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర రాజధాని నిర్మాణం, భూముల సేకరణపై అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి ప్రధాన రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని భూ సేకరణపై కృష్ణా తీరంలోని గుంటూరు జిల్లా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టాలను ప్రయోగించైనా సరే భూములు సేకరిస్తామని  బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ప్రజా ప్రయోజనాలకే చట్టాలను వినియోగించాలి కానీ ప్రజా హక్కులను ఉల్లఘించేందుకు కాదని బాబు గుర్తించాలని ధర్మాన సూచించారు. రాజధాని నిర్మాణానికి ఏకంగా 30 వేల ఎకరాలు అవసరమవుతాయని టీడీపీ నేతలు వాదిస్తుండటం అనుమానాలకు తావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వేలాది ఎకరాల భూములు సేకరించి రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెబుతోందని, ఆ భూములను నమ్ముకున్న కౌలు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా అక్కడ ఎన్నో ఏళ్లుగా నివసిస్తూ కుల వృత్తులను నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటన్నారు. రాజ ధాని నిర్మాణం కోసం భూ సేకరణ చట్టబద్ధంగా జరగాలని, ఇందుకోసమే తాము అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
 
రాష్ర్టంలో పాలన ఉందా
రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే  ప్రభుత్వం ఉన్నట్టు గానీ.. పరిపాలన సాగుతున్నట్టు గానీ కనిపించడం లేదని ధర్మాన వ్యాఖ్యానించారు. పరిపాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు రాష్ట్రాన్ని భూతల స్వర్గం చేస్తానంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు యత్నిస్తున్నారన్నారు.
 
పచ్చ చొక్కాలకే పింఛన్లు
రేషన్‌లో కిలో బియ్యం రూపాయికే అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను మాత్రం టన్ను రూ.2 వేలకు పెంచిందని, అంటే కిలో రూ.2 పడుతోందని ధర్మాన అన్నారు. ఆ ఘనత బాబు ప్రభుత్వానిదేనని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పసుపు చొక్కా వేసుకున్న వారికే పింఛను, తెలుగుదేశం జెండా కట్టినవాడికే ఇల్లు అన్నట్లుగా పథకాలన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే చెందేలా చర్యలు తీసుకోవడంతో అసలు లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: