ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అఖిలప్రియ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అఖిలప్రియ

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అఖిలప్రియ

Written By news on Friday, November 14, 2014 | 11/14/2014


* ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అఖిలప్రియ  
ఆళ్లగడ్డతోపాటు నంద్యాల ప్రజలనూ కలుసుకుంటానని వెల్లడి

సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిలప్రియ గురువారం ఎమ్మెల్యేగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఉదయం 9.40 గంటలకు ఆమెతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన చాంబర్‌లో ప్రమాణం చేయించారు. తెలుగులో దేవునిసాక్షిగా ప్రమాణం చేసిన అఖిలప్రియ పీఏసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డి, దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి దంపతుల కుమార్తె. తన తల్లి శోభ మృతి వల్ల ఏర్పడిన ఖాళీ నుంచి ఆమె ఏకగ్రీవంగా ఇటీవలే ఎన్నికైన విషయం విదితమే.

నవంబర్ 3వ తేదీనే ప్రమాణస్వీకారం చేయాలని భావించినప్పటికీ తన తండ్రి నాగిరెడ్డి అక్రమ కేసులో అరెస్టయి ఉన్నందున ఈ కార్యక్రమాన్ని గురువారం నాటికి వాయిదా వేసుకున్నారు. బెయిల్ లభించక పోవడంతో తన కుమార్తె ప్రమాణస్వీకారోత్సవానికి నాగిరెడ్డి హాజరు కాలేక పోయారు. ఇదే విషయాన్ని అఖిలప్రియ తన ప్రమాణస్వీకారం పూర్తయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఆవేదనగా వెల్లడించారు.

‘‘అమ్మ లేని లోటు ఓ వైపు, నాన్న ఉండి కూడా రాలేని పరిస్థితి చూస్తే నాకు చాలా బాధగా ఉంది. నాన్న పక్కన లేనిదే ప్రమాణం చేయనని తాను చెప్పానని, అయితే తాను వచ్చేవరకూ నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండటం ఏ మాత్రం సరికాదని, వారి అవసరాలు చూడాల్సిన బాధ్యత మనపై ఉందని నాన్న నచ్చ జెప్పడంతో ప్రమాణస్వీకారానికి వచ్చాను’’ అని ఆమె తెలిపారు. తానికపై ప్రజ ల్లోకి వెళతానని, ఆళ్లగడ్డతో పాటుగా నంద్యాల ప్రజలను కూడా కలుసుకుంటానని తెలిపారు.

తప్పుడు కేసులు అన్యాయం
తన తండ్రి నాగిరెడ్డితో పాటుగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై సర్కారు తప్పుడు కేసులు పెట్టి వేధించడం అన్యాయమని, సమయం వచ్చినపుడు ప్రజలే తగిన రీతిలో సమాధానం చెబుతారని అఖిలప్రియ హెచ్చరించారు. అక్రమ కేసులకు గురై వేధింపుల పాలవుతున్న నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్లను, వారి కుటుంబీకులను తాను తొలుత కలుసుకోబోతున్నట్లు తెలిపారు. ఆ తరువాత ఆళ్లగడ్డలోని ప్రతి మండలంలోనూ పర్యటిస్తానన్నారు. తన తండ్రికి త్వరలో బెయిల్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయన బయటకు వచ్చాక ఇద్దరమూ కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకానికి సార్థకత చేకూరుస్తూ ఆయన గర్వపడేలా ఎమ్మెల్యేగా పనిచేస్తానని అఖిలప్రియ చెప్పారు.

కక్షసాధింపు తగదు
తమ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యంలో ఇదెంత మాత్రం మంచిది కాదని వైఎస్సార్‌సీ శాసనసభాపక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అందరికీ తలలో నాలుక మాదిరిగా మెలిగే మంచి నాయకురాలు శోభ మృతి చెందడం, భూమా నాగిరెడ్డి రిమాండ్‌లో ఉండటం చూస్తే ఆ కుటుంబాన్ని దురదృష్టం వెన్నాడుతోందన్న బాధ కలుగుతోందన్నారు. తల్లి, తండ్రులిద్దరూ లేని స్థితిలో అఖిలప్రియ ప్రమాణస్వీకారం చేయాల్సి రావడం నిజంగా బాధాకరమన్నారు.

జగన్ టీంలోకి ఒక యువశాసనసభ్యురాలిని అందించిన కర్నూలు ప్రజలకు తాను అభినందనలు తెలుపుతున్నానని, వైఎస్సార్‌సీపీకి ఆ జిల్లాలో ఇక తిరుగు లేదని చెప్పారు. భవిష్యత్‌లో అఖిల ప్రియ ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు  మైసూరారెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్.వి.మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, భూమా కుటుంబీకులు హాజరయ్యారు. ఏపీ శాసనసభ కార్యదర్శి (ఇన్‌చార్జి) కె.సత్యనారాయణరావు ప్రమాణస్వీకారాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.
Share this article :

0 comments: