కొమ్మేపల్లి ఓసీ నిర్వాసితులకు ఖమ్మం ఎంపీ భరోసా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొమ్మేపల్లి ఓసీ నిర్వాసితులకు ఖమ్మం ఎంపీ భరోసా

కొమ్మేపల్లి ఓసీ నిర్వాసితులకు ఖమ్మం ఎంపీ భరోసా

Written By news on Monday, November 24, 2014 | 11/24/2014

అభయం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కొమ్మేపల్లి ఓసీ నిర్వాసితులకు ఖమ్మం ఎంపీ భరోసా

ఆ గ్రామంలో ఎవరికీ బతుకుమీద భరోసా లేదు. నిత్యం భయం..భయం.  ఏ వేళ సింగరేణి అధికారులు వస్తారో..తమ భూములు లాక్కుంటారోననే ఆందోళన. ‘బొగ్గు గనికి భూములిస్తాం.. మాకు డబ్బులొద్దు..పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలున్నారు. వారి పెళ్లిళ్లు ఎలా చేయాలి?. నూతన భూ సేకరణ చట్టం అమలుచేసి పంట పండే భూములివ్వాలి.

గూడు కట్టుకోవడానికి పరిహారం ఇవ్వాలి’ అనే ఆవేదనతో కూడిన డిమాండ్‌లు నిత్యం వారి నోటి వెంట వినిపిస్తున్నాయి. ఏ అయ్యవచ్చి తమకు న్యాయం చేస్తాడోననే ఎదురుచూపుల మధ్య.. ఖమ్మం ఎంపీ పొంగులే టి శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా కొమ్మేపల్లి ఓపెన్‌కాస్టు నిర్వాసితులను ఆదివారం పలుకరించారు. 465 కుటుంబాలుం టున్న ఆ గ్రామస్తులకు అండగా ఉంటానని అభయమిచ్చారు.

‘మీకు అండగా నేను ఉంటాను. ప్రభుత్వం దిగివచ్చే దాకా ఇటు శాసనసభ, అటు పార్లమెంట్‌లో గళమెత్తుతా. నాడు ఎన్నికల ముందు ఈ గ్రామానికి వచ్చి మీ తరఫున పోరాటం చేశా. ఇప్పుడు ఎంపీగా గెలిచినా మీ వెంటే ఉంటా. మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడుతా..’
 - కొమ్మేపల్లి వాసులతో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పొంగులేటి : అమ్మా నన్ను గుర్తుపట్టావా..? నేను ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని.
షేక్ మోతీ : గుర్తు పట్టా సారు.. మా తరఫున వచ్చింది మీరే. మాకు అండగా వచ్చి గ్రామం నుంచి మాతో పాటు నడుచుకుంటూ వచ్చారు. బొగ్గు గుట్ట దగ్గర మా తరఫున నిలబడ్డారు. బొగ్గుతో మా పంట పొలాలు, ఇన్నాళ్లు ఉంటున్న ఇళ్లు, అసలు మా ఊరే పోతుంది సారు. అధికారులు వచ్చి పొతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మీరే మాకు దిక్కు.

పొంగులేటి : అమ్మా మీ పరిస్థితి ఏంటీ..?
తేరేజమ్మ : కొత్త లోన్లు ఇవ్వడం లేదు. తీసుకున్నవి రద్దు చేయడం లేదు. సింగరేణితో మాకు ఇబ్బందులు వచ్చాయి సారు. భూములు అమ్ముదామన్నా కొనేవాళ్లు రావడం లేదు. పెళ్లి అయ్యే పిల్లలు ఉన్నారు. ఎన్నిఏళ్లు ఇంట్లో ఉంచుకోవాలి. మా పిల్లలను చూస్తే.. సింగరేణి అధికారులకు మా ఉసురు తప్పక తగులుతుం ది. మాకు ఇలాంటి పచ్చని గ్రామాన్నే ఇవ్వాలి.

పొంగులేటి : ఏంతాత ఎలా ఉన్నారు?
అహ్మద్ : అర్ధరాత్రి అప్పటి కలెక్టర్ తెచ్చిన జీవో మా పాలిట శాపమైంది సారు. పాత భూసేకరణ ప్రకారం డబ్బులు ఇస్తామంటున్నారు. అవి తీసుకొని పోతే ఇలాంటి భూములు మాకు ఎక్కడ రావు. కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమే ఇవ్వాలి.

పొంగులేటి : అక్కా కుటుంబం ఉలా ఏంది.?
పర్వీన్: బొగ్గు కోసం బాంబులు పేల్చుతున్నారు. ఆ మోతకు పిల్లలు భయపడుతున్నారు.. సారు.. మంచినీళ్లు బాగా లేవు. పిల్లలకు జ్వరం వస్తోంది.

పొంగులేటి : తాత గ్రామంలో పరిస్థితి ఏంటీ?
వెంకటయ్య : రజాకార్లనే తరిమికొట్టినం. మేము సంపాదించుకున్న భూములను మాకేమి ఇవ్వకుండా సింగరేణోళ్లు గుంజుకోవాలనుకుంటున్నారు. మేం గూడు కట్టుకోవడానికి నేల ఉండాలి. పంటకు పొలం ఇప్పించాలయ్యా.

పొంగులేటి : ఇళ్లు బీటలు పడుతున్నాయా..?
ఆఫ్రీన్ : అవును సారు. బొగ్గు కోసం బాంబులు పేల్చడంతో ఇళ్లు బీటలు వస్తున్నాయి. ఇదేంమని అడిగితే సింగరేణోళ్లు పట్టించుకోరు. బాంబులు పేల్చవద్దని చెప్పినా మా మాట వినడం లేదు. రాత్రి పడుకోవాలంటేనే భయమేస్తోంది. మంచినీళ్లు తాగలేకపోతున్నం.

పొంగులేటి : అక్కా దారి ఎందుకు వేయడం లేదు?
సుజాత : సారు.. ఒపెన్ కాస్టు గనిలో పోతుందని మాగ్రామం వైపే ఆధికారులు రావడం లేదు. దారులు లేవు.. లైట్లు లేవు. ఇళ్లు కట్టుకుందామంటే అధికారులు పట్టించుకోవడం లేదు. మా బతుకే కోల్పోతున్నం.. సత్తుపల్లి దగ్గరలో మంచి భూములు ఇస్తేనే మళ్లీ కోలుకుంటాం.

పొంగులేటి : ఈ పరిస్థితితో గ్రామంలో ఎలా ఉంటున్నారు?
యాకూబీ : ఏం చేయాలి సారు. బొగ్గు కోసం తొవ్వడంతో మంచినీళ్లు బాగా లేక అందిరికీ రోగాలొస్తున్నాయి. సింగరేణి గుట్ట తీసేటప్పుడే పది మంది చనిపోయారు. ఇప్పుడు ఎంతమంది పోతారో..? తరతరాలుగా ఇక్కడే ఉంటున్నం. మమ్ముల్ని ఆదుకోకపోతే మేం ఎలా బతకాలి.

పొంగులేటి : ఇదేనా అక్క మీ ఇల్లు?
నాగలక్ష్మి : అవును సారు. ఇల్ల్లు కట్టుకుందామంటే సింగరేణిలో మీ గ్రామం పోతుంది.. ఇల్లు కట్టుకోవద్దని అధికారులంటున్నరు. ఈ గుడిసెలో ఎలా ఉండాలి? మీ రైనా మాకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలి.

పొంగులేటి : ఎలా ఉన్నారు అక్కలు..?
రజియా : మీరు మాతో ఉంటూ పోరాడుతున్నరు. బొగ్గుతో మేమే అనాథలవుతున్నం. మా ఊరు పోతుంది. మేం ఏం చేసి బతకాలో తలుచుకుంటేనే భయమేస్తోంది.

పొంగులేటి : ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటున్నావా తాత..?
పాష : అవునయ్యా. నాకు ఎవ్వరూ లేరు. ఉన్న ఇల్లూ కూలిపోతోంది. ఒపెన్ కాస్టులో బొగ్గు తీస్తే ఈ గూడు ఉండదంటున్నరు. గ్రామంలో వాళ్లే నన్ను చూసుకుంటున్నరు. వాళ్లే ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నరు.

పొంగులేటి : మీకు భూములు ఎక్కడ కావాలి.?
మస్తాన్ : మా ఊళ్లో అందరూ పంటపొలాలు చేస్తారు. ఒపెన్ కాస్టులో భూమి పోతే.. ఇచ్చే డబ్బులతో ఎక్కడా పంట భూమి రాదు. సత్తుపల్లిలో ఎకరం రూ.10 లక్షలట. మాకు భూమి కింద భూమే కావాలి.

పొంగులేటి : అందరూ బాగున్నారమ్మా..
చేవూరి కుమారి : బొగ్గు గుట్ట తీయడంతో అందరికి కష్టాలు వచ్చాయి సారు. పొలాలు చేసుకుంటూ గుడిసెల్లోనే ఉంటున్నం. ఇప్పుడు బొగ్గు తీస్తారంట.. మా పొలాలు, ఇళ్లు అన్నీ పోతే ఎట్లా బతికేది.?

ఎంపీ పొంగులేటి భరోసా..
‘ఎన్నికల ముందు మీ కోసం మీ గ్రామానికి వచ్చింది నేనే. మిమ్ముల్ని సింగరేణి అధికారులు ఇబ్బంది పెడుతుంటే ఒపెన్‌కాస్టు దాకా మీతో పాటు గ్రామం నుంచి నడుచుకుంటూ వెళ్లి ఆందోళన చేశాం. ఇప్పుడు మళ్లీ మీ కోసమే వచ్చా. మీకు శాపంగా మారిన పాత భూ సేకరణ చట్టం, మీ సమస్యలపై మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడుతారు. నేను తప్పకుండా పార్లమెంట్ సమావేశాల్లో మీ ఊరు సమస్యపై గళమెత్తుతా. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మీకు న్యాయం జరిగేలా మే వెంటే ఉంటూ పోరాటం చేస్తాం.

ఓపెన్‌కాస్టులో పోతున్నాయని గ్రామంలో తాగునీటి ఇబ్బందులు, ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అసలు గ్రామాన్నే అధికారులు వెలేసినట్లుగా చూస్తున్నారు. ఈ సమస్యలన్నింటి పైనా ఇటు సింగరేణి అధికారులు, అటు జిల్లా అధికారులతో మాట్లాడుతా. మీరు కోరుకున్నట్లుగా భూమికి భూమికి ఎక్కడో అడవుల్లో కాదు.. సత్తుపల్లి సమీపంలో ఇప్పించేందుకు ఉద్యమిస్తాం. మీకు న్యాయం జరిగేలా మీ వెంటే ఉంటాను’ అని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారికి ధైర్యాన్నిచ్చారు.
Share this article :

0 comments: