మూడు రోజుల పర్యటన విజయవంతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూడు రోజుల పర్యటన విజయవంతం

మూడు రోజుల పర్యటన విజయవంతం

Written By news on Sunday, November 16, 2014 | 11/16/2014

నీరాజనం
సాక్షి కడప/పులివెందుల/కమలాపురం/వీఎన్ పల్లె: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పులివెందుల నుంచి మైదుకూరు వరకు గ్రామగ్రామాన అఖండ స్వాగతం లభించింది. పులివెందుల నుంచి బయలు దేరిన వైఎస్ జగన్‌రెడ్డిని ప్రతి గ్రామం వద్ద అభిమానులు కాన్వాయ్‌ని ఆపి కరచాలనం చేస్తూ వచ్చారు.

ఎర్రిపల్లి, గోటూరు, ముతుకూరు, రామిరెడ్డిపల్లె, పాలగిరి, వీఎన్‌పల్లె, గంగిరెడ్డిపల్లె, అయ్యవారిపల్లె, కీర్తిపల్లె, పాయసంపల్లె, బయనపల్లె, చిన్నచెప్పలి, పెద్దచెప్పలి, కొండాయపల్లె, జంగంపల్లె, కమలాపురం వరకు ప్రతిచోటా జనాలు రోడ్డుపైకి వచ్చి జగన్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ వచ్చారు. వైఎస్ జగన్‌రెడ్డితో కరచాలనం చేసిన తరవాతనే సాగనంపుతూ వచ్చారు.

 ఏమమ్మా... పంటలు ఎలా ఉన్నాయి
 పులివెందుల-కొండ్రెడ్డిపల్లె రహదారి మధ్యలో ఒక చోట కాన్వాయ్‌ని ఆపి వైఎస్ జగన్‌రెడ్డి పంటను పరిశీలించారు. సాగులో ఉన్న పత్తి పంటను తిలకించారు. మహిళా రైతు ఈశ్వరమ్మతో మాట్లాడారు. ఏమమ్మా.. పంటలు ఎలా ఉన్నాయి. పెట్టుబడి ఎంత.. అని వైఎస్ జగన్ ప్రశ్నించగానే ఈశ్వరమ్మ దాదాపు రూ.50వేలకు పైగా పెట్టుబడి అయిందని వివరించారు.

 పాలగిరిలో వైఎస్‌ఆర్ విగ్రహావిష్కరణ
 వీఎన్ పల్లె మండలం పాలగిరిలో ప్రతిభ బయోటిక్ ఎండీ ఇసుకపల్లె రాజశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించగా, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎంఎల్‌ఏ పి.రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమీపంలో ఉన్న నూతన చర్చిని వైఎస్ జగన్ ప్రారంభించి ప్రార్థనలు చేశారు.

 కమలాపురం పెద్ద దర్గా..
 అమ్మవారిశాలలో ప్రత్యేక ప్రార్థనలు
 కమలాపురంలో వెలసిన శ్రీ హజరత్ అబ్దుల్‌గఫార్ షా ఖాద్రి, జహీరియా దర్గాలో వైఎస్ జగన్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గఫార్ స్వామి జగన్‌మోహన్‌రెడ్డికి శాలువకప్పి సన్మానించారు. అలాగే పట్టణంలోని అమ్మవారు శాలలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. పెద్దచెప్పలిలో వెలసిన హేలాంబ ఆలయంలో జగన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

 మైదుకూరు సెగ్మెంట్‌లోనూ అదే ఆదరణ  
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మైదుకూరు సెగ్మెంట్‌లోనూ అదే ఆదరణ లభించింది. కమలాపురం నుంచి మైదుకూరుకు వెళుతుండగా మార్గమధ్యలో తవ్వారిపల్లె, సుంకేసుల, ఖాజీపేట, మైదుకూరు, వనిపెంట తదితర గ్రామాల వద్ద మహిళలు వచ్చి వైఎస్ జగన్‌కు హారతి పట్టారు.

 పొలాన్ని పరిశీలించిన ప్రతిపక్ష నేత
 మైదుకూరు పరిధిలోని ఓబులాపురం పంచాయతీలోని మద్దుపల్లెకి చెందిన రామకృష్ణారెడ్డి పొలాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. పొలంలో క్రిమి సంహారక మందులు పిచికారి చేయగా, పొలాలన్నీ ఎండిపోయిన నేపథ్యంలో వైఎస్ జగన్ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు.

 నూతన జంటకు ఆశీర్వాదం
 ఇటీవలే వివాహమైన మైదుకూరు వైఎస్సార్ సీపీ నాయకుడు మదీనా దస్తగిరి కుమార్తె, అల్లుడులను వైఎస్ జగన్ శనివారం రాత్రి వారి ఇంటికి వెళ్లి ఆశీర్వదించారు. అలాగే మైదుకూరు మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ శ్రీనివాసులు మర్యాద పూర్వకంగా వెళ్లి కలిశారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనయుడు శెట్టిపల్లె నాగిరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షులు అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 పలువురి కుటుంబాలకు పరామర్శ
 వేముల మండల మాజీ ఎంపీపీ ఆర్.జనార్ధన్‌రెడ్డి గుండెకు సంబంధిత ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో శనివారం ఉదయం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నల్లచెరువుపల్లెకు వెళ్లి పరామర్శించారు. ఇంతలోనే జనార్ధన్‌రెడ్డి తండ్రి సిద్ధారెడ్డి బాధపడుతుండటాన్ని చూసి వైఎస్ జగన్‌రెడ్డి, సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఓదార్చారు. అదే గ్రామానికి చెందిన ఆర్‌కే జనార్ధన్‌రెడ్డికి ఆరోగ్యం బాగాలేని నేపథ్యంలో ఆయనను కూడా వైఎస్ జగన్‌రెడ్డి పరామర్శించారు.

గొందిపల్లెకు చెందిన రాజారెడ్డి కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్‌రెడ్డి పరామర్శించారు. కమలాపురం వైఎస్‌ఆర్‌సీపీ యువ నాయకుడు హిదాయత్ తండ్రి ఎస్‌ఆర్‌టీ ఇటీవల మృతి చెందారు. వైఎస్ జగన్‌రెడ్డి శనివారం వారి నివాసానికి వెళ్లి ఎస్‌ఆర్‌టీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే చిన్నచెప్పలి ఎంపీటీసీ సభ్యుడు బుజ్జన్న సోదరుడు దాదాగారి దాదావలి కూడా ఇటీవల మృతిచెందారు. అలాగే దాదావలి కుటుంబాన్ని కూడా వైఎస్ జగన్‌రెడ్డి పరామర్శించారు. తాను అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

 వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
 ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌రెడ్డిని పలువురు వైఎస్‌ఆర్ సీపీ నేతలు కలిసి చర్చించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు కలిసి చర్చించారు.

 మూడు రోజుల పర్యటన విజయవంతం
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈనెల 13వ తేదీన పులివెందులకు వచ్చిన ఆయన వేంపల్లె మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు పులివెందుల ప్రజలతో కలసి పోయారు. అలాగే శనివారం పులివెందుల, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లోని పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

 కాగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి   వైఎస్‌ఆర్ జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించునకుని శనివారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
Share this article :

0 comments: