పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రావతరణ వేడుకలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రావతరణ వేడుకలు

పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రావతరణ వేడుకలు

Written By news on Saturday, November 1, 2014 | 11/01/2014


నవంబర్ 1నే రాష్ట్రావతరణ వేడుకలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నేతల స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర సాధనకు అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నవంబర్ ఒకటవ తేదీన నిర్వహించడమే సముచితమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రావతరణ వేడుకలు జూన్ 2న నిర్వహించాలని నిర్ణయించడం దురదృష్టకరమని, దీనిని పార్టీ ఖండిస్తోందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. తమ పార్టీ రాష్ట్రావతరణ వేడుకలను నవంబర్ ఒకటవ తేదీనే జరుపుకుంటుందని చెప్పారు.

ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ వేరుపడినప్పటికీ మధ్యప్రదేశ్ అంతకు మునుపు జరుపుకునే తేదీనే రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటుందని చెప్పారు. జార్ఖండ్ నుంచి వేరు పడిన  బీహార్, ఉత్తరాఖండ్ నుంచి వేరుపడిన ఉత్తరప్రదేశ్ అంతకుముందు జరుపుకున్న తేదీలనే రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటున్నాయని తెలిపారు.

ఈ సంప్రదాయాలనే ఏపీ పాటించాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం జూన్ రెండో తేదీన రాష్ట్రావతరణ వేడుకలు జరపాలన్న నిర్ణయం చేయడమంటే వారు రాష్ట్ర విభజనకు అంగీకరించారని భావించాలన్నారు. సమైక్యంగా ఉండాలని కోరుకున్న తమ పార్టీ కేంద్ర, జిల్లా కార్యాలయాల్లో శనివారం రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటామని చెప్పారు.

నేడు వేడుకలో జగన్‌మోహన్‌రెడ్డి
హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించే రాష్ట్రావతరణ వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని పార్టీ తెలియజేసింది.
Share this article :

0 comments: