8 నుంచి షర్మిల పరామర్శ యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 8 నుంచి షర్మిల పరామర్శ యాత్ర

8 నుంచి షర్మిల పరామర్శ యాత్ర

Written By news on Tuesday, December 2, 2014 | 12/02/2014


8 నుంచి షర్మిల పరామర్శ యాత్ర
⇒ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభం
⇒ మహానేత మరణవార్త విని మృతిచెందిన కుటుంబాల పరామర్శ
⇒ వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి వెల్లడి
⇒ యాత్ర పోస్టర్ విడుదల


మహబూబ్‌నగర్ అర్బన్:  తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లాలో ఆయన సోదరి షర్మిల పరామర్శ యాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్, సీజీసీ మెంబర్ ఎడ్మ కిష్టారెడ్డి వెల్లడించారు. సోమవారం స్థానిక న్యూటౌన్‌లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం, మాల్‌నుంచి కురిమేడు గ్రామంలో షర్మిలమ్మ యాత్ర ప్రవేశిస్తుందన్నారు.

మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణవార్త విని తట్టుకోలేక వేలాదిమంది చనిపోయారని అన్నారు. ఆ సందర్భంగా నల్లకాలువలో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి మరణాన్ని విని ప్రాణాలుకోల్పోయిన అందరి కుటుంబాలను సందర్శించి ఓదారుస్తానని మాటిచ్చారని గుర్తుచేశారు. అప్పట్లో రాయలసీమ, ఆంధ్రాతోపాటు ఖమ్మం జిల్లాలో జగనన్న ఓదార్పుయాత్రను దిగ్విజయంగా చేపట్టారని అన్నారు.

అప్పుడు జిల్లాలో జరగాల్సిన యాత్ర వాయిదా పడిందని.. ఆ యాత్రను ఇప్పు డు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పూర్తి చేసేందుకు వస్తున్నారని చెప్పారు. ఈ యాత్ర జిల్లాలో ఐదు రోజులపాటు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 19 కుటుంబాలను కలుసుకొని వారిని పలుకరించనున్నట్లు తెలిపారు. ఇది ఎన్నికల సమయం కాదని, మరో ఐదేళ్ల వరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలూ లేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారని చెప్పారు.

యాత్రకు సహకరించండి...

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాల తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ, సహాయ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. అందుకే మహానేత ప్రజలందరి గుండెల్లో స్థానాన్ని సంపాదించారని, రాజకీయాలకతీతంగా జరిగే ఈ యాత్రకు సహకరించాలని కోరారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పథకాలు అమలు చేసినందుకే వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చారని అన్నారు.

ఈ యాత్ర సందర్భంగా పలుచోట్ల వైఎస్ విగ్రహాలతోపాటు ఆయా గ్రామాల్లోగల జాతీయ నాయకులందరికీ నివాళులు అర్పిస్తారని, మరికొన్ని చోట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు నిర్మిస్తున్న నూతన విగ్రహాలను ఆవిష్కరిస్తారని తెలిపారు. జిల్లాలో 200మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా తమ పార్టీ పరంగా 157 మందికి సొంతంగా, 421 జీఓ, ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకాల కింద ఆర్థికసహాయం అందించామని అన్నారు.

అందుకే వీలైతే ఈ పరామర్శయాత్రలో సందర్శించే గ్రామాల్లోగల రైతు ఆత్మహత్యల కుటుంబాలను కూడా పరామర్శించే అవకాశం ఉందన్నారు.  వైఎస్ అభిమానులు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు మాదిరెడ్డి భగవంతురెడ్డి, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బీష్వ రవీందర్, హైదర్ అలీ, జెట్టిరాజశేఖర్, పుల్లయ్యశెట్టి, భీమయ్యగౌడ్, బంగి లక్ష్మణ్, హన్మంతు, నసీర్, శేఖర్ పంతులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: