బాబుకు జగన్ భయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుకు జగన్ భయం

బాబుకు జగన్ భయం

Written By news on Saturday, December 6, 2014 | 12/06/2014


బాబుకు జగన్ భయం
 ప్రతి మాటకూ ఉలిక్కిపడుతున్నాడు
 పది లక్షల పింఛన్లు తొలగించడం సమర్థపాలనా?
 హామీలు అమలయ్యేవరకు నిరంతర ఉద్యమాలు
 వైఎస్సార్ సీపీ నేత ధర్మాన ప్రసాదరావు

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబునాయుడుకు మాట తప్పని, మడమ తిప్పని జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భయం పట్టుకుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయగోదావరి జిల్లాల ఇన్‌చార్జి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడే ప్రతి మాటకు బాబు ఉలిక్కిపడి స్పందిస్తున్నాడని ఎద్దేవా చేశారు. అయితే ఆ స్పందనతో ప్రజలకు మేలు జరిగితే అందరూ సంతోషిస్తారని, కానీ బాబు కేవలం తప్పులు కప్పిపుచ్చుకోవడానికే పడరాని పాట్లు పడుతున్నారని ధర్మాన విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శుక్రవారం ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి జిల్లాలోని ప్రజలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున సహకరించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు వారిని విస్మరించారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం 10 లక్షల పింఛన్లు తొలగించిందని ఇది సమర్థపాలనా అని ధర్మాన నిప్పులు చెరిగారు. వ్యవసాయం పండుగ, మట్టిని బంగారం చేస్తానంటే ప్రజలు ఏమో అనుకున్నారని, కానీ నేడు ఇసుకను కేజీ రూ.2 చొప్పున కొనాల్సి రావడంతో బాబు మాటల్లోని ఆంతర్యం ప్రజలకు తెలిసివచ్చిందన్నారు. సీఎం అనుసరిస్తున్న ఇసుక విధానం కారణంగానే గృహ నిర్మాణ కూలీలు, పెయింటర్లు, తాపీ మేస్త్రిలు, కార్పెంటర్లు ఉపాధి కోల్పోయారని ధర్మాన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన సాగుతోందనీ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఏ అధికారికీ అవగాహన లేకపోవడం విచారకరమన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల మీద తెలుగుదేశం చెంచాలు పెత్తనం చేస్తూ వందల కోట్లు దోచుకుతింటున్నారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని నమ్మించి మహిళల ఓట్లు పొందిన చంద్రబాబును అదే మహిళలు వచ్చే ఎన్నికల్లో ఓటు పోటుతో ఇంటికి  పంపించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం చంద్రబాబు కళ్లకు పొరలు కప్పాయని, ఆయనకు విదేశాలు తప్ప రాష్ట్ర ప్రజలు కనపడటం లేదని ధర్మాన విమర్శించారు. ప్రస్తుతం ఎన్నికలేవీ జరగడం లేదని, తాము ఓట్లు అడగడం కోసం రాలేదని, ప్రజల తరఫున పోరాటం చేయడానికే వచ్చామన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నోరువిప్పి అడగలేని పేద ప్రజలకు సైతం పింఛన్లు అందించారని, చంద్రబాబు ఉన్న పింఛన్లు తొలగించి పుణ్యం కట్టుకున్నారన్నారని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: