
వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి,
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు: ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట ఎంచుకుందని, శుక్రవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నాలో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఎన్నికల సమయం లో ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పించి ఇప్పుడు మాయమాటలతో కాలయాపన చేస్తుండడమే ఇందుకు కారణమని తెలిపారు. ఇలాంటి మోసపూరిత సీఎం మన రాష్ట్రంలో మరొకరు లేరని విమర్శించారు.
దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి పేదల కష్టాలను గుర్తించి పెన్షన్ మంజూరు చేస్తే చంద్రబాబు కమిటీల పేరుతో రద్దు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. వ్యవసాయ రుణాలు రూ.87 వేల కోట్లు ఉండగా కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించడం చూస్తుంటే రైతులపై ఆయనకున్న ప్రేమ ఏ పాటిదో అర్థమవుతోందన్నారు. రుణం మాఫీగాక, కొత్త రుణాలు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బ్యాం కులు నోటీసులు ఇస్తుండడంతో చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మోసపూరిత ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యం పోరాడుతుందని, దీనికి ప్రజలు కలిసి రావాలని కోరారు.
0 comments:
Post a Comment