మరి అందరెలా చనిపోయారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరి అందరెలా చనిపోయారు?

మరి అందరెలా చనిపోయారు?

Written By news on Sunday, December 21, 2014 | 12/21/2014


మరి అందరెలా చనిపోయారు?
టీడీపీ సభ్యులపై ధ్వజమెత్తిన విపక్ష నేత జగన్
చంద్రబాబు సభకు వచ్చినందున నిన్న చెప్పిందే మళ్లీ చెప్పారు
హుద్‌హుద్ మీద మాట్లాడకుండా, వైఎస్ పాలన మీద మాట్లాడుతున్నారు
ఒడిశాలో 5-6 మందే మరణించారు... వారిని చూసి నేర్చుకోండి
 

సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను నష్టం మీద శాసనసభలో రెండు రోజులపాటు జరిగిన చర్చలో పాల్గొన్న అధికారపక్ష సభ్యుల ప్రసంగాల్లో  ఆత్మస్తుతి, పరనింద తప్ప మరేమీ లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. తుపాను బాధితులకు మెరుగైన సహాయం అందించడానికి ఉపకరించాల్సిన చర్చ.. దివంగత నేత వైఎస్ మీద విమర్శలు చేయడానికి టీడీపీ సభ్యులు ఉపయోగించుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు.

హుద్‌హుద్ తుపాను నష్టం మీద శనివారం చర్చలో పాల్గొన్న టీడీపీ సభ్యుడు కె.రవికుమార్.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సాయం తక్కువేనంటూ విమర్శలు గుప్పించినప్పుడు ప్రతిపక్ష నేత జగన్ జోక్యం చేసుకున్నారు. ‘‘మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే వారిని చూస్తే బాధనిపిస్తోంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అప్పటివరకు తొమ్మిదేళ్ల పాలనలోని కరువు కాటకాలతో అల్లాడిన ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం నుంచి రూ. 2 వేల కోట్ల బుందేల్‌ఖండ్ ప్యాకేజీ తీసుకొచ్చి రైతుల వడ్డీ మాఫీ చేశారు. రూ.1100 కోట్ల విద్యుత్ బకాయిలు రద్దు చేస్తూ తొలి సంతకం చేశారు’’ అని వివరించారు.

రైతుల వడ్డీ మాఫీ చేసిన చరిత్ర చంద్రబాబుకూ ఉందని, వైఎస్ రూ. 1200 కోట్ల విద్యుత్ బకాయిలు రద్దు చేసి రైతులకు ఇచ్చే విద్యుత్‌ను 9 గంటల నుంచి 7 గంటలకు తగ్గించారంటూ టీడీపీ సభ్యుడు రవికుమార్ విమర్శలను కొనసాగించారు. దీన్ని విపక్ష నేత తప్పుబట్టారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేయగా తిరస్కరించారు. దీనికి ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేయగా.. స్పీకర్ అంగీకరించారు. ‘‘నిన్న(శుక్రవారం) హుద్‌హుద్ మీద చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో లేరు. ఈ రోజు(శనివారం) వచ్చారు కాబట్టి టీడీపీ సభ్యులు నిన్న చేసిన ఆత్మస్తుతి, పరనిందను మళ్లీ ప్రారంభించారు.

టీడీపీ సభ్యులు హుద్‌హుద్ తుపాను నష్టం మీద మాట్లాడుతున్నారో, వైఎస్ హయాం మీద మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు. టెక్నాలజీ వాడుకున్నామంటూ టీడీపీ సభ్యులు ఊదరగొడుతున్నారు. టెక్నాలజీ వాడుకుంటే 61 మంది ఎందుకు మరణించారు? ఒడిశాలో ఇంత తీవ్రమైన తుపాన్లు వచ్చినప్పుడు మరణాల సంఖ్య 5-6కు దాటలేదు. అక్కడికిపోయి నేర్చుకోండి. హుద్‌హుద్‌వల్ల రూ. 60-70 వేల కోట్ల నష్టం జరిగిందని మీ గెజిట్ ‘ఈనాడు’లో అచ్చేయించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు, మరమ్మతులకు, పరిహారం చెల్లింపునకు మీరు(ప్రభుత్వం) ఖర్చు చేసింది రూ. 844 కోట్లు. అంటే ఒ క్క శాతం కూడా ఖర్చు చేయలేదు. ఇదీ ప్రభుత్వ ఘనకార్యం. ఆత్మస్తుతి.. పరనింద తప్ప మరేమైనా ప్రజలకు చేశారా?’’ అని నిలదీశారు.

గిరిజనులను పట్టించుకోరా?
అందరికీ అన్నీ చేశామని చెబుతున్న ప్రభుత్వం.. గిరిజనులను ఎందుకు పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ సభ్యుడు సర్వేశ్వరరావు సర్కారును నిలదీశారు. గిరిజనులు మనుషులు కాదా? వారి కష్టాలు ప్రభుత్వానికి పట్టవా? అంటూ ప్రశ్నించారు. పంట నష్టం అంచనాలను లెక్కించడానికి వీలుగా అధికారులు భూముల వివరాలను అప్‌లోడ్ చశారని, కానీ గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్ చట్టం కింద పట్టాలు ఇచ్చిన భూముల వివరాలను అప్‌లోడ్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన ఫార్మాట్‌లో అవకాశం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర సభ దృష్టికి తెచ్చారు.
Share this article :

0 comments: