కొల్లేరుపై కొంగ జపం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొల్లేరుపై కొంగ జపం

కొల్లేరుపై కొంగ జపం

Written By news on Tuesday, December 23, 2014 | 12/23/2014


కొల్లేరుపై కొంగ జపం
 ఏలూరు :కొల్లేరుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మళ్లీ కొంగ జపం చేస్తున్నారు. వివాదాస్పద 120 జీవో తీసుకువచ్చి 3.50 లక్షలమంది కొల్లేరు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన చంద్రబాబు ఇప్పుడు సరస్సు పరిధిని ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదించేందుకు శాసనసభలో తీర్మానం చేస్తామని నమ్మబలుకుతున్నారు. వాస్తవానికి 2008లోనే కొల్లేటి రైతుల దీనస్థితిపై స్పందించిన అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభయారణ్యం పరిధిని ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తూ తీర్మానం ఆమోదింపజేశారు. ఇప్పుడు మళ్లీ ఆ తీర్మానాన్నే శాసనసభలో ప్రవేశపెడతానంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు.

 వారికి కొల్లేరే ఆధారం
 కొల్లేరు ప్రపంచంలోని అతి పెద్ద మంచినీటి సరస్సులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని 9 మండలాల్లో 77వేల ఎకరాల్లో ఈ సరస్సు విస్తరించి ఉంది. కైకలూరు, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల పరిధిలో కొల్లేరును ఆనుకుని ఉన్న 125 గ్రామాల్లో మూడు లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. మున్నేరు, బుడమేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ వాగుల నుంచి వచ్చేనీరు, 18డ్రెయిన్ల ద్వారా వర్షాకాలంలో వచ్చే ముంపు నీరు కొల్లేరులోనే కలుస్తాయి.  ఇక్కడి ప్రజలంతా శతాబ్దాల తరబడి కొల్లేరులో చేపల వేటను ఆధారంగా చేసుకుని బతుకుసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వెనుకబడిన తరగతులకు చెందిన వడ్డీలు కాగా, దళితులూ గణనీయంగా ఉన్నారు. 1974లో అప్పటి ప్రభుత్వం 118 జీవో జారీచేసి కొల్లేరులో చెరువుల తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో కొల్లేరును ఆనుకుని ఉన్న గ్రామాల్లోని జిరాయితీ భూములను రైతులు చేపల చెరువులుగా మార్చుకున్నారు. గ్రామకంఠం, డీ ఫారం భూములను గ్రామస్తులు సొసైటీలుగా ఏర్పడి ఉమ్మడి చెరువులు తవ్వుకున్నారు. సొసైటీల పరిధిలో ఏర్పడిన చెరువుల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామంలోని అన్ని కుటుంబాల వారికి పంచేవారు.

 బాబు శాపం ఫలితం
 చేపల వేటతో జీవనం ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో 1999లో రామ్‌సార్(ఇరాన్) అంతర్జాతీయ ఒప్పందం, కొల్లేరు ప్రక్షాళన పేరుతో చంద్రబాబునాయుడు సర్కా రు జారీ చేసిన వివాదాస్పద జీవో 120 కొల్లేరు వాసుల జీవనాన్ని పాతాళంలోకి నెట్టేసింది.  308.5 చదరపు కిలోమీటర్ల కొల్లేరు ప్రాంతాన్ని అభయారణ్యంగా పరిగణిస్తూ ఈ ప్రాంతంలో చేపల సాగును నిషేధించారు. సరస్సు సముద్ర మట్టానికి ఎత్తును బట్టి కాంటూర్లను నిర్ణయిం చారు. కళ్లెదుటే కొల్లేరు ఉన్నా చేపలు పెంచుకునే అవకాశం లేదు. అభివృద్ధి పనులు చేపట్టడం నిషేధం. కొత్త వంతెనలు, రోడ్లు, భవనాలు నిర్మించరాదు. ఇలా ఆ జీవోలో పేర్కొన్న కఠిన నిబంధనలు కొల్లేరు ప్రజల జీవితానికి సంకెళ్లు వేశాయి. కూలి పనులు లేక వేలాది మహిళలు, పురుషులు వలసబాట పట్టారు. ఆర్థికంగా చితికిపోయిన వందలాది కుటుంబాలు ఆడపిల్లలకు పెళ్లిళ్లు సైతం చేయలేని దుస్థితికి చేరుకున్నాయి. వేలాదిమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు.

 తీర్మానంతో సరిపెట్టకుండా..
 నాడు వైఎస్ చేసిన తీర్మానాన్నే కొత్తగా కొలువుదీరిన ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టి చర్చ పెడతానని సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వస్తున్నారు. నాడు అభయారణ్యం పరిధి తగ్గించాలని కొల్లేరు ప్రజలు గగ్గోలు పెట్టినా పట్టించుకోని చంద్రబాబు నేడు కాంటూరు కుదింపుపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామనడంపై ఇప్పటికీ కొల్లేటి వాసుల్లో సందేహాలున్నాయి. ఇప్పటికైనా సీఎం కొల్లేరు వాసుల కష్టాలపై నిజాయితీగా స్పందించి తీర్మానంతో సరిపెట్టకుండా కార్యచరణపై దృష్టి పెట్టాలని కొల్లేటి వాసులు కోరుతున్నారు. నిపుణులైన న్యాయవాదులను నియమించి సుప్రీం కోర్టులో కాంటూరు కుదిం పుపై గట్టిగా వాదనలు వినిపించేలా కృషి చేయాలనేది అక్కడి ప్రజల డిమాండ్. కొల్లేరు ప్రజల స్థితిగతులు, కాంటూరు కుదింపు వల్ల కలిగే లాభాలను సుప్రీం కోర్టుకు తెలియచేసేలా ఒత్తిడి తీసుకురావాలన్నదే కొల్లేటి వాసుల ఆకాంక్ష. రాష్ట్ర సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తే కొల్లేరులోని లక్షలాది మందికి మేలు కలుగుతుంది.

 మహానేత పోరాటం మరపురానిది
 సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఆదేశాల మేరకు 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లేరు ఆపరేషన్ చేపట్టారు. నష్టపోయిన రైతులు, సొసైటీ సభ్యులకు ఊహించని రీతిలో నష్టపరిహారం అందించారు. 600 సొసైటీల్లో ఉన్న వేలాది మందికి స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికీ రూ.30 వేల రుణం అందించారు. ఆ మొత్తాలను తిరిగి చెల్లించలేకపోతున్నారని తెలిసి ఆ రుణాలన్నింటినీ రద్దు చేశారు. కొల్లేరు అభయారణ్యం పరిధిని ఐదో  కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తూ 2008లో శాసనసభలో తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానాన్ని  కేంద్రానికి పంపగా, కేంద్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలపై జైరాం రమేష్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఆ తర్వాత మహానేత మరణంతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకకపోవడంతో తీర్మానం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.
Share this article :

0 comments: