రాజన్న బిడ్డ వచ్చిందయ్యా.. మాట్లాడు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్న బిడ్డ వచ్చిందయ్యా.. మాట్లాడు...

రాజన్న బిడ్డ వచ్చిందయ్యా.. మాట్లాడు...

Written By news on Tuesday, December 9, 2014 | 12/09/2014


* వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన ఓ అభిమాని భార్య ఆవేదన
కల్వకుర్తి నియోజకవర్గంలో 3 కుటుంబాలకు షర్మిల పరామర్శ
జగనన్న ఉన్నాడని భరోసా ఇచ్చిన షర్మిల
నేడు అచ్చంపేట, కొల్లాపూర్‌లో యాత్ర

పరామర్శ యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అయ్యా! రాజన్న చనిపోయిండని మూడు రోజులు నిద్రాహారాలు మాని టీవీ చూస్తూనే ఉంటివి. ఆయన్ని సమాధి చేస్తుంటే చూసి ఏడుస్తూ అట్లనే పడిపోతివి. పేదోళ్లకు న్యాయమెవ్వరు చేస్తరని ఏడ్చి మాకు అన్యాయం చేసి పోతివి. నువ్వెళ్లిపోయినా జగనన్న మమ్ముల మరిచిపోలె. ఐదేండ్లయినా మర్వకుండ వాళ్ల చెల్లెను పంపిండు. రాజన్న బిడ్డ మనింటికి వచ్చిందయ్యా! మాట్లాడు...’’ కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం రెడ్డిపురం గ్రామంలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన రాయపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల వద్ద.. రాయపురెడ్డి భార్య స్లీవమ్మ విలపిస్తూ అన్న మాటలివి. స్లీవమ్మ ఆవేదన విన్న షర్మిలతో సహా గ్రామస్తుల గుండె బరువెక్కింది.

‘పరామర్శ యాత్ర’లో భాగంగా సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని రెడ్డిపురం, దేవుని పడకల్, వెలిజాల గ్రామాల్లోని మూడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. దేవుని పడకల్‌కు చెందిన తుమ్మల నర్సింహ, వెలిజాలలో మరణించిన సంతోజు అంజనమ్మ కుటుంబాలను ఆమె పరామర్శించి జగనన్న అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి..
రాయపురెడ్డి ఇంట్లో వారి కుటుంబంలో ఒకరిగా మారి ఓదార్చిన షర్మిల... జగనన్న ఉన్నాడని, త్వరలోనే మంచిరోజులు వస్తాయని వారికి భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికే చెందిన ఓ వికలాంగ యువకుడి చదువుకోవాలన్న ఆశను, కళాశాలకు వెళ్లలేని నిస్సహాయతను చూసిన షర్మిల.. ఆ యువకుడికి తగిన సహాయం అందించాల్సిందిగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వైఎస్సార్ సీపీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డికి సూచించారు. ఎంపీ విజిటింగ్ కార్డును అందించి, తన వ్యక్తిగత సహాయకుడి ఫోన్ నంబర్ కూడా వారికి ఇచ్చి ఏ సాయం కావాలన్నా ఫోన్ చేయి పెద్దమ్మా! అంటూ ఆమె ఆప్యాయతను పంచారు.

వెలిజాలలో వైఎస్ మరణించారన్న బెంగతో టీవీ చూస్తూనే మరణించిన సంతోజు అంజనమ్మ భర్త మోహనాచారిని, వారి కుమారుడు, ఇద్దరు కుమార్తెలకు షర్మిల పరామర్శించారు. భార్య చనిపోయిన తరువాత కంసాలి వృత్తి చేసుకోవడం చేతకాక ఇంట్లోనే ఉంటున్న మోహనాచారికి ధైర్యం చెప్పారు. ‘‘ఆరోగ్యం జాగ్రత్త పెద్దయ్యా! ఆస్పత్రికి వెళ్లు. మానాన్నను తలుచుకొని నేను, నా కుటుంబం ఎంత బాధ పడుతున్నామో తెలుసు. మీరు మీ ఇంటి పెద్దతో పాటు మానాన్నను కూడా తలుచుకుంటున్నారు పెద్దయ్యా!’ అంటూ మోహనాచారి కళ్ల నీళ్లు తుడిచి ఓదార్చారు.

దేవుని పడుకల్ గ్రామంలో చనిపోయిన తుమ్మల నర్సింహ భార్య నర్సమ్మ, కుమారులను చూసి చలించిపోయిన షర్మిల.. వారికి అండగా ఉంటామన్న భరోసా ఇచ్చారు. పింఛన్లు రావడం లేదని, బతుకు కష్టంగా మారిందని నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేస్తే ‘‘మంచి కాలం వస్తుంది పెద్దమ్మా! ధైర్యంగా ఉండు..’’ అని ఓదార్చారు. మూడు కుటుంబాలను పరామర్శించేందుకు రోజంతా సమయం తీసుకున్న షర్మిల ఒక్కో ఇంట్లో గంటకు పైగా ఉన్నారు. పింఛన్లు రావడం లేదని వృద్ధులు, వితంతువులు చెబుతోంటే చలించిపోయారు. తగిన సహకారం అందించాలని పార్టీ నేతలకు సూచించారు.

రాజకీయం కోసం రాలేదు..: షర్మిల
కుర్మేడు, బ్రాహ్మణపల్లిలో పల్లె జనం విజ్ఞప్తి మేరకు షర్మిల మాట్లాడారు. వైఎస్ ఉంటే పేదలకు కష్టాలు ఉండేవి కావని ఆమె చెప్పారు. ఐదేళ్లలో ఏ ఒక్క చార్జీ కూడా పెంచకుండా జనరంజక పాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి రాజన్న అని, అందుకే ఆయన మరణిస్తే తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలొదిలారన్నారు. రాజకీయాల కోసం తాను రాలేదని, దివంగత నేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన ప్రతి కుటుంబాన్ని కలిసి వారికి ధైర్యం చెప్పాలన్న జగనన్నమాట మీద వచ్చానని షర్మిల తెలిపారు. పేదలకు అండగా నిలవడమే తమ కుటుంబం లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

బ్రహ్మరథం పట్టిన పల్లె జనం
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఉద్దేశించిన ఈ యాత్రను షర్మిల హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో తమ నివాసం నుంచి ప్రారంభించారు. తల్లి విజయమ్మ, సోదరుడు, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వదిన భారతి, వైవీ సుబ్బారెడ్డి దంపతుల ఆశీస్సులు తీసుకుని ఆమె బయలుదేరారు.

షర్మిల పర్యటన సాగిన ప్రతి పల్లెలో పాలమూరు జనం నీరాజనాలు పట్టారు. ఈ తొలిరోజు పరామర్శ యాత్రలో పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, ఇతర నాయకులు శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్ రావు, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బీస్వ రవీందర్ ఉన్నారు.
Share this article :

0 comments: