రాష్ట్ర ఆదాయ వ్యయాలను వెల్లడించాలి: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ఆదాయ వ్యయాలను వెల్లడించాలి: వైఎస్ జగన్

రాష్ట్ర ఆదాయ వ్యయాలను వెల్లడించాలి: వైఎస్ జగన్

Written By news on Wednesday, December 10, 2014 | 12/10/2014


రాష్ట్ర ఆదాయ వ్యయాలను వెల్లడించాలి: వైఎస్ జగన్
* చంద్రబాబుకు ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ లేఖ
హుద్‌హుద్ నష్టం, బాధితులకు ఇచ్చిన పరిహారం, చేసిన వ్యయంపై నివేదికను అందించాలి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరకోస్తాలకు ప్యాకేజీలపై తాజా పరిస్థితి తెలపాలి
ఈ వివరాలను వెబ్‌సైట్లతో పాటు, అసెంబ్లీలోనూ వెల్లడించాలని కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఒక లేఖ రాశారు. హుద్‌హుద్ తుపాను నష్టాలు, ప్రభుత్వం చేసిన వ్యయం, తొలగించిన పింఛనుదారుల సంఖ్య, వివిధ సంక్షేమ పథకాల తాలూకు వివరాలు అందుబాటులో ఉంచాలని కూడా జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో ప్రజల సంక్షేమానికి సంబంధించిన పథకాలపై అర్థవంతంగా చర్చించడానికి వీలుగా సమగ్ర సమాచారం అవసరముంటుందని ఆయన పేర్కొన్నారు.
 
 కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆయా మంత్రిత్వ శాఖల వెబ్‌సైట్లలో ఉంచుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర ఆర్థికశాఖ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సిజిఎ.ఎన్‌ఐసి.ఇన్, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.ఎఫ్‌ఐఎన్‌ఎమ్‌ఐఎన్.ఇన్ వెబ్‌సైట్లలో ప్రతి నెలా పన్నులు, పన్నేతర రాబడులు, కేంద్రం తీసుకున్న రుణాలు, రుణ రూపంలో కాని రాబడులు, రాబడిలో లోటు, ద్రవ్య లోటు వంటి వివరాలతో పాటుగా ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలపై చేసిన వాస్తవిక వ్యయం వంటి వివరాలను ఎప్పటికపుడు పొందుపరుస్తున్నారని తెలియజేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి వివరాలను బహిర్గతపరచాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి తన లేఖలో ఇంకా ఏమేం వివరాలు కోరారంటే...
 
 -    2014-15 ఆర్థిక సంవత్సరంలో తొలి ఎనిమిది నెలలు - ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు - ప్రభుత్వానికి వచ్చిన రాబడులు, వ్యయానికి సంబంధించిన వివరాలను త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉంచాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ జమా ఖర్చుల అకౌంటింగ్ వ్యవస్థను కంప్యూటరీకరించినందున అంశాల వారీగా ఈ వివరాలను పొందుపరచడానికి సమస్యలేమీ ఉండవని భావిస్తున్నాను.
 -    2014 నవంబర్ నెల వరకూ వచ్చిన పన్నులు, పన్నేతర రాబడులు, రుణాలు, రుణాలు కాని రాబడులు, రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, అలాగే ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలపై చేసిన వాస్తవిక వ్యయం పూర్తి వివరాలు కావాలి. ఏప్రిల్, మే నెల వివరాలను, జూన్ నుంచి నవంబర్ వరకూ వివరాలను వేర్వేరుగా విడగొట్టి (రాష్ట్ర విభజన అనంతర కాలానికి సంబంధించి) పొందుపరచాలి. ఈ మొత్తం సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే ఉంచాలి.
 -    ఇటీవలే ముగిసిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ముగింపు ప్రసంగంలో 2014 జూన్ నుంచి నవంబర్ వరకూ ఆరు నెలల కాలంలో వచ్చిన పన్నులు, పన్నేతర రాబడులు, తీసుకున్న రుణాలు, రుణాలు కాని రాబడులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ వివరాలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరించారు.
 -    అలాగే, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద నమోదైన విద్యార్థుల వివరాలు, బలహీనవర్గాల గృహనిర్మాణం కింద చేపట్టిన ఇళ్లు, వాటి నిర్మాణం వివరాలు, జూన్ నెల నుంచి తొలగించిన పింఛనుదారుల వివరాలు, జాతీయ ఉపాధి పథకం అమలు జరుగుతున్న తీరు వంటి అంశాల సమాచారాన్ని కూడా అందజేయాలని కోరుతున్నాను.
 -    హుద్‌హుద్ తుపాను వల్ల జరిగిన నష్టం, ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సబ్సిడీలు, బాధితులకు ఇచ్చిన పరిహారం, ముఖ్యంగా రైతులకు, చేతి వృత్తుల వారికి చెల్లించిన పరిహారంపై ఈ రోజు వరకూ చేసిన వ్యయంపై యథాతథ నివేదికను మాకు అంద జేయగలరని మనవి చేస్తున్నాను.
 -    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం, రాష్ట్ర విభజనకు సంబంధించిన అపాయింటెడ్ డే నుంచి పద్నాలుగో ఆర్థిక సంఘం నివేదిక ఆమోదం పొందే వరకు ఏర్పడే ఆర్థిక లోటును కేంద్ర ప్రభుత్వం భరించడం, రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ఆర్థిక ప్రోత్సాహకాలు, ప్యాకేజీ ఇచ్చే విషయాలపై ఇప్పటి వరకూ నెలకొన్న పరిస్థితిపై వివరాలను అందజేయాలని కోరుతున్నాను.
 -    నేనడిగిన పై సమాచారం లేకుండా వచ్చే శాసనసభా సమావేశాల్లో అర్థవంతమైన చర్చలేవీ జరుగడానికి ఆస్కారం లేదనుకుంటున్నాను. ఈ వివరాలు లేకుండా జరిగే చర్చ కేవలం మొక్కుబడిగా ఉంటుందే తప్ప మరొకటి కాదు. మీరు నా అభిప్రాయంతో ఏకీభవిస్తారని భావిస్తున్నాను.
Share this article :

0 comments: