
⇒ఎవరెస్టు శిఖరంలా ఎదిగిన నాయకుడు వైఎస్
⇒తెలుగుజాతి ఉన్నంత వ రకు ఆయన ఉంటారు
⇒మాట నిలబెట్టుకునేందుకే యాత్ర: పొంగులేటి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘ఇది వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేయడానికి చేస్తున్న యాత్ర కాదు.. ఆయన ఆశయాలు, ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన అద్భుత పథకాలకు మీరే సంరక్షకులుగా మారాలని మిమ్మలను అభ్యర్థించేందుకు చేస్తున్న యాత్ర. ఆ మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ప్రాణాలొదిలిన మహనీయుల గొప్పతనాన్ని గుర్తించేందుకు చేస్తున్న యాత్ర ఇది’ అని వైఎస్ షర్మిల ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.
దివంగత సీఎం వైఎస్ హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో మరణించిన మూడు కుటుంబాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వైఎస్ షర్మిల సోమవారం పరామర్శించారు. ఐదురోజుల పాటు జిల్లాలో సాగే పరామర్శయాత్రలో భాగంగా మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లిలో ఆమె ప్రసంగించారు. ‘తెలుగు ప్రజలను గుండెల్లో పెట్టుకుని సొంతబిడ్డల్లా ప్రేమించిన నాయకుడు వైఎస్. అందుకే రాజన్న అయ్యాడు.

వైఎస్ ఎవరెస్ట్ శిఖరం
‘తెలుగు జాతి చరిత్రలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. మరెంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ వైఎస్ మాత్రమే ఎవరెస్ట్ శిఖరంగా ఎదిగారు. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ లేనివిధంగా ఒక నాయకుడు చనిపోతే వందల గుండెలు ఆగిపోవడం ఎక్కడైనా చూశారా’ అని షర్మిల ప్రశ్నించారు. ‘అన్నం పెట్టే అన్నదాత అప్పులపాలు కాకూడదని రుణమాఫీ అమలుచేశారు. ఏడు గంటలు ఉచిత కరెంట్ ఇచ్చారు.
మద్దతు ధర ఇచ్చారు. తెలుగునేలను సస్యశ్యామలం చేయాలని ముందు చూపుతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఘనత వైఎస్‌కు దక్కుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ‘ఏ ఒక్క పేద బిడ్డ చదువుకు దూరం కాకూడదని ఫీజు రీయంబర్స్‌మెంట్, పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా ఇచ్చేందుకు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారని ఆమె గుర్తుచేశారు. ఐదేళ్ల పాలనలో గ్యాస్, ఆర్టీసీ, కరెంట్ ఇలా ఏ ఒక్కచార్జీ పెంచకుండా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.

మాట నిలబెట్టుకునేందుకే: పొంగులేటి
మహానేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో అనేక మంది గుండె ఆగి చనిపోయారు. చనిపోయిన ప్రతీ కుటుంబాన్ని కలిసి ఓదారుస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కొంచెం ఆలస్యమైనా మాట నిలబెట్టుకునేందుకు పరామర్శ యాత్ర చేపట్టినట్లు వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సీఎంగా వైఎస్ ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ అనే తేడా లేకుండా కులం, మతం, ప్రాంతం సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా సేవచేశాడు. ఆయన ప్రేమ, అభిమానం ప్రతీ పేదవాడి గుండెల్లో గూడు కట్టుకుని ఉంది. రాజన్న కల నెరవేర్చడంలో వైఎస్ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రతీ కుటుంబంలో వైఎస్ ముద్ర: పాయం
వైఎస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రవేశపెట్టిన పథకం ప్రతీ కుటుంబానికి ఏదో విధంగా ఉపయోగపడిందని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. అటువంటి దేవుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో వర్కింగ్ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు.
అభిమానంతో వచ్చారు: ఎడ్మ కిష్టారెడ్డి
పేదలకు ఎనలేని సేవలందించిన వైఎస్ కుటుంబంపై అభిమానంతోనే ప్రజలు పెద్దఎత్తున తరలొచ్చారని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. నల్లకాలువలో ఇచ్చిన హామీ జగన్ నెరవేరుస్తున్నారని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment