05 October 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పరిశ్రమకు అమ్మిన భూములను అక్రమించాలని ప్రభుత్వమే ప్రోత్సహించడమా?

Written By news on Saturday, October 11, 2014 | 10/11/2014

ప్రత్యర్థులపై కక్ష సాధింపునకే ప్రాధాన్యం
చంద్రబాబు సర్కారుపై ధర్మాన ఆగ్రహం

సర స్వతి పవర్ సంస్థకు మైనింగ్ లీజు రద్దు చేయటమే ఇందుకు నిదర్శనం
పరిశ్రమ స్థాపనకు రాష్ట్రాలు పోటీ పడుతోంటే ఇలాంటి చర్యలు సమంజసమా?
పరిశ్రమకు అమ్మిన భూములను అక్రమించాలని ప్రభుత్వమే ప్రోత్సహించడమా?

 
హైదరాబాద్: రాష్ట్రంలో తమ ప్రత్యర్థులకు చెందిన పరిశ్రమలను స్థాపించకూడదని, స్థాపించినా అవి నడవకుండా చేయాలని టీడీపీ సర్కారు ఆలోచనగా ఉన్నట్లుందని.. సరస్వతి పవర్‌కు చెందిన సిమెంట్ ప్లాంట్‌కు మైనింగ్ లీజు రద్దు వ్యవహారం దీనికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. పరిశ్రమలు తమ రాష్ట్రంలోనే ఏర్పాటు కావాలని దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్న సమయంలో ఏపీ సర్కారు ఇటువంటి చర్యలకు పాల్పడటం రాష్ట్ర శ్రేయస్సుకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించేవిగా లేవని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తప్పుపట్టారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఆ సంస్థల లీజులను రద్దు చేయలేదేం?

‘‘ప్రభుత్వం చట్టాలు అమలు చేసే తీరు అందరి పట్లా ఒకేలా ఉండాలి. సరస్వతి పవర్ మైనింగ్ లీజు రద్దుకు చూపిన కారణాలు వంటి ఉల్లంఘనలకు పాల్పడిన అన్ని సంస్థల లీజులను ప్రభుత్వం రద్దు చేసిందా..? అలా ఎందుకు చేయలేదు..?’’ అని ధర్మాన ప్రశ్నించారు. ‘‘సరస్వతి పవర్ మైనింగ్ లీజు రద్దు సందర్భంలో ప్రభుత్వ చర్యలు చూస్తే.. రాష్ట్రాభివృద్ధికి నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న మాటలు అన్నీ అసత్యం. రాష్ట్రాభివృద్ధికంటే తమ ప్రత్యర్థులపై కక్ష సాధించాలనే ఆసక్తే ఈ ప్రభుత్వానికి ఎక్కువగా ఉందని ఈ విషయంతో రూఢీ అయిపోయింది’’ అని ఎండగట్టారు. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకే పార్టీకి చెందినవి కొనసాగవు. ఇలాంటి చెడు సంప్రదాయాలను భవిష్యత్‌లో అధికారంలోకి వచ్చే ఇతర పార్టీలు ఒకవేళ కొనసాగిస్తే రాష్ట్ర ప్రజల గతి ఏమవుతుంది?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. ఇలాంటి ధోరణులు మానుకోవాలని హితవుపలికారు.
 
99 శాతం పరిశ్రమలు సకాలంలోపూర్తవుతున్నాయా?

మన రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ మొదలుపెట్టిన వాటిలో 99 శాతం పరిశ్రమలు సకాలంలో పూర్తి అవడం లేదని ధర్మాన గుర్తుచేశారు. పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపులు, భూసేకరణ వంటి ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకునే చర్యలు పరిశ్రమలకు సకాలంలో అనుమతులు రాని పరిస్థితికి కారణమవుతున్నాయన్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వమే మొదలు పెట్టిన వివిధ పరిశ్రమలు, ప్రాజెక్టులు సైతం ఇలాంటి అనుమతుల కారణంగా సకాలంలో పూర్తికాని పరిస్థితి ఉందన్నారు. కొన్ని అనుమతులకు పదేళ్లకు పైగా సమయం పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చిన్న కారణాలు చూపి సరస్వతికి మైనింగ్ లీజు రద్దు చేయడం కక్షసాధింపు చర్యగా అందరికీ అర్థమవుతోందని చెప్పారు.

అమ్మిన భూములను అక్రమించడానికి ప్రభుత్వ ప్రోత్సాహమా?

మైనింగ్‌కు సంబంధించిన భూములు ప్రభుత్వ భూములు కావని ధర్మాన చెప్పారు. ‘‘అవి పూర్తిగా ప్రైవేట్ భూములు. పూర్తిగా డబ్బు చెల్లించి, విక్రేతల అంగీకారంతో కొన్న భూమలు. భూమిలో ఉండే ఖనిజాలు ప్రభుత్వానికి చెందినవి కనుక, ప్రభుత్వం ఆ మేరకు లీజు ఇస్తాయి. అమ్మిన భూములు మళ్లీ అక్రమించండని ప్రభుత్వమే ప్రోత్సహించడం తగునా? ఒక పార్టీ లేదంటే ఒక ప్రభుత్వం ప్రజలకు చెప్పే ఆదర్శం ఇదేనా?’’ అని ఆయన నిలదీశారు.ఇలాంటి సంప్రదాయాలు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఏ మాత్రం ప్రోత్సహం కాదని, ప్రజలు ఇలాంటివి అంగీకరించరని స్పష్టంచేశారు.

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి
ముదిగుబ్బ : మలకవేముల గ్రామంలో అధికారుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై టీడీపీ నాయకులు దాడిచేశారు. బాధిత దంపతుల కథనం మేరకు... శుక్రవారం మలకవేముల గ్రామంలో ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్న అక్కసుతో తమ పింఛన్లు రద్దు చేయించారని టీడీపీ నేత దేవేంద్రరెడ్డిపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను ఉసిగొలిపి తిట్టిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన పద్మావతి, యోగీశ్వర్‌రెడ్డి దంపతులపై దేవేంద్రరెడ్డి తన సమీప బంధువు భాస్కర్‌రెడ్డితో కలిసి అధికారుల సమక్షంలోనే దాడిచేశాడు. గాయపడిన పద్మావతి కదిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.  

చంద్రబాబుపై పార్థసారథి ఫైర్

Written By news on Friday, October 10, 2014 | 10/10/2014

చంద్రబాబుపై పార్థసారథి ఫైర్
విజయవాడ: రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.పార్థసారథి మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. సరస్వతి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లీజ్ ను రద్దు చేయడానికి గల కారణమేమిటో వివరించాలని ప్రభుత్వాన్ని పార్థసారథి డిమాండ్ చేశారు. 
సదరు ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన క్లియిరెన్స్ ఇవ్వకుండా పనులు మొదటు పెట్టలేదనడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పార్థసారథి ప్రభుత్వానికి సూచించారు. నిన్నటి వరకు విజయవాడ చుట్టుపక్కల రాజధాని అని చెప్పి... ఇప్పుడు గుంటూరు జిల్లా చుట్టూ చక్కర్లు కొడుతున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

టీఆర్‌ఎస్‌లో చేరిన ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. తమ పార్టీ టికెట్‌పై గెలుపొంది మరో పార్టీలోకి మారిన మదన్‌లాల్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగ నిబంధనలను, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనాచారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు పార్టీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు పేరుతో రాసిన లేఖను ఆయనకు అందించారు.

సెప్టెంబర్ 1న టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో మదన్‌లాల్ ఆ పార్టీలో చేరారని స్పీకర్‌కు తెలిపారు. ఇందుకు సంబంధించిన పేపర్, వీడియో క్లిప్పింగ్‌లను లేఖతో జతపరిచినట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ సభ్యత్వాన్ని స్వచ్ఛం దంగా వదులుకుని టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మదన్‌లాల్ ప్రకటించిన విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ పార్టీ 2011 మార్చిలోనే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయినట్లు గుర్తుచేశారు. స్పీకర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ నేతలు జనక్‌ప్రసాద్, కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లాసూర్యప్రకాష్ ఉన్నారు.    

ఉపఎన్నిక సందడి షురూ

ఉపఎన్నిక సందడి షురూ
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ
* శోభమ్మ కుమార్తెగా ఈమెకు మంచి పేరు
* గత ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర
* ఆళ్లగడ్డలో అత్యధిక సార్లు భూమా కుటుంబానిదే విజయం
సెంటిమెంట్‌కు టీడీపీ కట్టుబడి ఉంటుందా?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉపఎన్నిక సందడి ప్రారంభమైంది. ఈ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ పేరును గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ఈమె నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల కుమార్తె. గత ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఓటుతో భూమా కుటుంబానికి అండగా నిలవాలని విస్తృత ప్రచారం చేశారు. ఫలితంగా ఆ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డికి అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి.

ఈ నియోజకవర్గంలో మొత్తం 2,20, 812 ఓట్లు ఉండగా శోభా నాగిరెడ్డికి 1,72, 908 వచ్చాయి. సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన గంగుల ప్రభాకర్ రెడ్డికి 74,180 ఓట్లు పోలయ్యాయి. శోభా నాగిరెడ్డి 92,108 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆమె పోలింగ్ కంటే ముందే మృతి చెందడంతో తిరిగి ఉప ఎన్నిక అనివార్యమైంది. రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 14 నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించాలని, వచ్చే నెల 8వ తేదీన పోలింగ్ జరపాలని ఆదేశించింది. వచ్చే నెల 12వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించింది. దీంతో జిల్లాలో ఉప ఎన్నిక హడావుడి మొదలైంది. అయితే ఈ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంటుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. నందిగామ ఉపఎన్నికలో మానవతా దృక్పథంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి విరమించుకుంది.

ఆళ్లగడ్డలో టీడీపీ అదే విధంగా వ్యవహరించనుందో లేదో తెలియాల్సి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ గతంలో జరిగిన ఆళ్లగడ్డ ఎన్నికల్లో అత్యధిక పర్యాయాలు భూమా కుటుంబమే విజయం సాధిస్తూ వచ్చింది. ఈ నియోజకవర్గం 1962లో ఐదు మండలాలతో ఏర్పాటైంది. 2009లో పునర్విభజనతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గోస్పాడు మండలాన్ని నంద్యాలకు కలిపారు. కోవెలకుంట్ల నియోజకవర్గంలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలను ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కలిపారు. వీటితోపాటు శిరివెళ్ల, రుద్రవరం, చాగలమర్రి మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.

ఈ నియోజకవర్గానికి మొత్తం 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా శోభా నాగిరెడ్డి అత్యధికంగా ఐదు సార్లు విజయం సాధించారు. గంగుల ప్రతాపరెడ్డి మూడుసార్లు, ఎస్వీ సుబ్బారెడ్డి, గంగుల తిమ్మారెడ్డి, భూమా నాగిరెడ్డి రెండు సార్లు విజయకేతనం ఎగురవేశారు. అసెంబ్లీకి జరిగిన ప్రతి ఎన్నికలోనూ శోభా నాగిరెడ్డి విజయం సాధించడం గమనార్హం. మొదటి నుంచి ఆళ్లగడ్డలో భూమా, గంగుల గ్రూపుల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతూ వచ్చింది. పార్టీలకతీతంగా గ్రూపు రాజకీయాలకు ఆళ్లగడ్డకు ప్రత్యేకత ఉంది

రోశమ్మే కాదు.. ఇక్కడ ఉసేనమ్మ

రోశమ్మే కాదు.. ఇక్కడ ఉసేనమ్మ
రోశమ్మే కాదు ... ప్రకాశం జిల్లాలో ఓ ఉసేనమ్మదీ అదే దుస్థితి. సారా వ్యతిరేక పోరాటంలో ఉప్పెన కెరటమై లేచిన దూబగుంట రోశమ్మ అందరికీ తెలిసిన పెద్దామె కావడంతో పత్రికల్లో, టీవీల్లో పతాక శీర్షికల్లో వార్తయింది. అధికారులు స్పందించారు. న్యాయం చేశారు. ఈ ఉసేనమ్మ దయనీయ గాథ ఆ గ్రామం దాటి ఎవరికీ తెలియదు. అయినా గత ప్రభుత్వాలు వైకల్యాన్ని గుర్తించి మానవీయ కోణంలో పింఛన్లు మంజూరు చేశాయి. కానీ ఈ హైటెక్ ప్రభుత్వం మాత్రం ఈమెకు ఆధార్ కార్డు లేదంటూ కట్ చేసి పారేసింది. కూతురిని మంచంతో పాటు జన్మభూమి సభకు తల్లి తీసుకురావడంతో ఈ ఉదంతం బయటపడింది.  జిల్లాలో ఇలాంటి కేసులు మరెన్నో ఉన్నాయి.

యర్రగొండపాలెం: అధికారుల చుట్టూ తిరగడానికి కాళ్లు లేవు ... ప్రశ్నించడానికి నోటిమాట అంతంత మాత్రమే. ప్రతిదానికీ లింక్ పెడుతున్న ఆధార్ కార్డు తీసుకుందామంటే చేతులు పని చేయవు ... ఒళ్లంతా వైక్యల్యం వెక్కిరిస్తున్నా కళ్లున్న అధికారుల దృష్టిలో మాత్రం ఈమె వికలాంగురాలు కాదు. గత ప్రభుత్వాల హయాంలో ఎంచక్కా పింఛన్ తీసుకున్న ఈమె టీడీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే పింఛన్ తొలగించడంతో విలవిల్లాడిపోతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వీరభద్రాపురంలో డి.ఉసేనమ్మ  వైకల్యంతో పుట్టింది. ఎప్పుడూ మంచంపైనే ఉండే ఈమెకు 40 సంవత్సరాలు.

20 సంవత్సరాల వయసున్నప్పుడే తండ్రి మరణించాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఖాతునమ్మ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. తన కూలీ డబ్బులకు తోడుగా కూతురికి వచ్చే రూ.200 పింఛనుతో బతుకు బండిని లాక్కుంటూ భారంగా వస్తోంది. కష్టంగా ఉన్నా ఉన్నంతలో సర్దుకొని బతుకుతున్న ఈ కుటుంబంపై పింఛన్ తొలగించిన పిడుగులాంటి వార్త వచ్చి పడింది. రూ.200 నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతామని ప్రకటించి తీరా ఇలా వేటేయడమేమిటంటూ గ్రామంలో గురువారం జరుగుతున్న ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమానికి కూతుర్ని మంచంపై మోసుకొని వచ్చింది. మీరే చూడండి ... ఇలాంటి అభాగ్యురాలికా మీరంతా కలిసి పింఛన్ ఆపారంటూ ఆ తల్లి కళ్లనీళ్లపర్యంతమవుతూ నిలదీసింది. అక్కడున్న అధికారులు, నాయకులు కళ్లప్పగించి చూశారే తప్ప న్యాయం చేస్తామన్న మాట రాకపోవడంతో నిరాశతోనే వెనుతిరిగారు ఆ తల్లీ కూతుళ్లు.

అన్నదాతలకు అన్యాయం జరిగితే సహించేదిలేదు

హిట్లర్‌ను తలపిస్తున్న చంద్రబాబు
- రాజధాని ప్రకటనపై రైతుల్లో ఆందోళన
- అన్నదాతలకు అన్యాయం జరిగితే సహించేదిలేదు
- రుణమాఫీ అమలు కోసం16న వైఎస్సార్ సీపీ ఆందోళన
- ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి రూరల్: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పాలన హిట్లర్ పరిపాలనను తలపిస్తోందని, టీడీపీ ప్రభుత్వం రాజధాని పేరుతో రైతులను బెదిరించి భయపెట్టి భూములను బలవంతంగా లాక్కోవాలని యత్నిస్తోందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంటూరు జిల్లాలోనే రాజధాని ఏర్పాటు వుంటుందని ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలోని మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతుల్లో ఆందోళన నెలకొని ఉందన్నారు.

ప్రభుత్వం రైతులతో చర్చలు జరపకుండా రాజధాని ఏర్పాటు చేయాలని భావించడంతో భావితరాలు నష్టపోవడం ఖాయమన్నారు. మంగళగిరి రాజధాని అనేది దాదాపు ఖాయమైందని, తాజాగా సీఎం ప్రకటనే అందుకు నిదర్శనమన్నారు. రాజధాని విషయంలో వీజీటీఎం ఉడా పరిధిలోని ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఉడా పరిధిలో ఎక్కువ మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలే వుండగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు మాత్రమే వున్నారని చెప్పారు. అసలు ప్రభుత్వానికి అధికార పార్టీ శాసనసభ్యులపైనే నమ్మకం లేదని, పైగా ఉడా పరిధిలోని ఎమ్మెల్యేలను అగౌరవపరిచేవిధంగా వ్యవహరించడం దారుణమన్నారు.

రాజధాని పేరుతో రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధమన్నారు. రుణమాఫీ అమలు విషయంపై ఈనెల 16న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.11న కొండవీటివాగు హైలెవల్ కమిటీ రాక .. మంగళగిరి నియోజవర్గ రైతుల పాలిట దుఖఃదాయనిగా ఉన్న కొండవీటి వాగు ముంపు నివారణ చర్యల్లో భాగంగా ఈనెల 11వ తేదీన హైలెవల్ కమిటీ సభ్యులు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు కురగల్లు-ఐనవోలు బ్రిడ్జి వద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించి 11న రానున్న హైలెవల్ కమిటీకి అందజేస్తామని చెప్పారు.

'మోసం, అబద్దాలకు చంద్రబాబు పెట్టింది పేరు'

Written By news on Thursday, October 9, 2014 | 10/09/2014

'మోసం, అబద్దాలకు చంద్రబాబు పెట్టింది పేరు'
అనంతపురం: మోసం, అబద్దాలకు చంద్రబాబు పెట్టింది పేరని వైఎస్సార్ సీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామని, ముఖ్యమంత్రి అయ్యాక ఆంక్షల పేరుతో జారుకుంటున్నారని దుయ్యబట్టారు.

వైఎస్సార్ సీపీ పోరాటాల పార్టీ అని, చంద్రబాబు మోసాలపై నిరంతరం ఉద్యమిస్తామని చెప్పారు. రుణమాఫీ కోరుతూ ఈనెల 16న నిర్వహించే ధర్నాలు విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

కట్టుకథల రూపంలో వార్తలా?

కట్టుకథల రూపంలో వార్తలా?
హైదరాబాద్: తాము గెలిచిన రోజు నుంచి కొన్ని వార్తా చానళ్లు, పత్రికలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వార్లు, పాయం వెంకటేశ్వర్లు అన్నారు. తాము పార్టీ మారతామంటూ కట్టుకథలు అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజక అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీఎం కేసీఆర్ ను కలుస్తున్నామని స్పష్టం చేశారు. పినపాకలో పవర్ ప్లాంట్ ఏర్పాటు, స్థానికుల ఉపాధి గురించి ముఖ్యమంత్రిని కలిసినట్టు వివరించారు. తాము పార్టీ మారతామన్నది ఊహాజనిత కథనమని కొట్టిపారేశారు. ఆదివాసీ ఎమ్మెల్యేలమైన తమపై కట్టుకథల రూపంలో వార్తలు రావడం బాధాకరమని వాపోయారు.

'ఆళ్లగడ్డ' వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా భూమా అఖిలప్రియ

'ఆళ్లగడ్డ' వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా భూమా అఖిలప్రియవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆళ్లగడ్డ శాసన సభ ఉప ఎన్నిక కోసం అభ్యర్ధిగా దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖారారు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణించినా ఆళ్లగడ్డ ఎన్నికలో అఖండ విజయం సాధించి దేశంలోని ఓ అరుదైన రికార్డును సాధించారు. 
 
అయితే ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నిక సమయంలో పోటీ పెట్టవద్దని  వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ కోరారు. దాంతో నందిగామ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని పోటీకి పెట్టని విషయం తెలిసిందే. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఆళ్లగడ్డ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అన్ని పార్టీలతో సంప్రదింపులు చేయటం కోసం వైస్ జగన్మోహన్ రెడ్డి ఒక ద్విసభ్య కమిటీని నియమించారు. దిసభ్య కమిటి సభ్యులుగా ఎంవీ మైసూరా రెడ్డి, ధర్మాన ప్రసాదరావులను ఎంపిక చేశారు. 

ఏయ్.. ఇది టీడీపీ ప్రభుత్వం

ఏయ్.. ఇది టీడీపీ ప్రభుత్వం
బద్వేలు:
 ‘ఏయ్ ఇది ఎవరి ప్రభుత్వం... టీడీపీ ప్రభుత్వంలో పని చేస్తూ మేం చెప్పినట్లు వినరా... మీరు తగిన ఫలితం అనుభవిస్తారు’... అని బద్వేలు టీడీపీ నేత విజయజ్యోతి అధికారులపై మండిపడ్డారు. బుధవారం పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో జన్మభూమి-మాఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి, ఎటువంటి ఆహ్వానం లేకుండానే టీడీపీ నేత విజయజ్వోతి హాజరయ్యారు. అనంతరం తాను మాట్లాడతానంటూ మైక్ ఇవ్వాలని కోరారు.

దీనికి మండలాధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఆమెను ఏ హోదాలో మాట్లాడిస్తారు.. ఇదేమీ పార్టీ కార్యక్రమం కాదు.. ప్రభుత్వ కార్యక్రమం కదా అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు ఆమెకు అవకాశమ్విలేదు. ఇదే సమయంలో జిల్లాలోని ఉన్నతాధికారులతో అధికారులకు ఫోన్ చేయించి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆమె మరింత అసహనానికి గురయ్యారు. తాను ప్రజల తరుఫున మాట్లాతానని పట్టుబట్టడంతో  ప్రజలకు మధ్యాహ్నం అవకాశమిస్తామని అప్పటి వరకు ఆగాలన్నారు.

దీంతో టీడీపీ నేతలు ఆమెకు మాట్లాడే అవకాశమివ్వాలని కోరుతూ మైక్ అందజేశారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ చిత్తా విజయప్రతాప్, వైఎస్సార్‌సీపీ నాయకులు చిత్తా రవి, రమణ ఆందోళనకు దిగారు ఇదే సమయంలో కొందరు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి ప్రయత్నించడంతో పాటు తీవ్ర పదజాలంతో దూషించారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం విశేషం.

ఈ దశలో సీఐ వెంకటకుమార్, ఎస్‌ఐలు కృష్ణంరాజు నాయక్, హరిప్రసాద్ గొడవను సద్దుమణిగేలా చూశారు. పింఛన్ల పంపిణీ పూర్తయ్యాక విజయజ్యోతి ఎంపీడీఓ నారాయణరెడ్డి, నోడల్ అధికారి కృష్ణమూర్తి వద్దకు వెళ్లి  ‘మీరు మా ప్రభుత్వంలో పని చేస్తున్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోండంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీని పరవ్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుందని వారిపై మండిపడటంతో కార్యక్రమానికి వచ్చిన పలువురు అధికారులు, ప్రజలు అవాక్కయ్యారు.

రోశమ్మ పింఛనూ తీసేశారు..!

రోశమ్మ పింఛనూ తీసేశారు..!వీడియోకి క్లిక్ చేయండి
లేని భూమిని ఆమె పేరిట ఉన్నట్టుగా చెప్పిన అధికారులు 
ఐదెకరాలు దాటిందంటూ వృద్ధాప్య, వితంతు పింఛన్ నిలిపివేత
 
గడచిన నెల రోజుల్లో రాష్ట్రంలో 9.16 లక్షల పింఛన్లకు కత్తెర
రకరకాల కారణాలతో అనర్హులుగా వేటు వేసిన ప్రభుత్వం
ఆ కారణాలు తప్పంటూ జన్మభూమి సభల్లో నిలదీస్తున్న జనం
ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో తలపట్టుకుంటున్న అధికారులు
అనర్హుల జాబితాపై పునఃపరిశీలనకు సర్కారు ఆదేశాలు

 
 సాక్షి, హైదరాబాద్, కలిగిరి (నెల్లూరు):
రోశమ్మ ఎవరో తెలుసా? బహుశా! దూ బగుంట రోశమ్మంటే తెలుస్తుందేమో!? ఎందుకంటే సారా వ్యతిరేక ఉద్యోమానికి అంకురార్పణ జరిగింది దూబగుంటలోనే. మొదలెట్టింది రోశమ్మే. ప్రస్తుతం 80 ఏళ్లు నిండిన రోశమ్మకు ఎన్టీయార్ సీఎంగా ఉన్నప్పుడు పింఛను మం జూరైంది. ఇన్నాళ్లూ నిరాటంకంగా వచ్చింది. కానీ ఇపుడు నిలిచిపోయింది. కారణం... ఆమెకు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉందట!! తనకు ఐదెకరాలు లేనేలేదని, ఉంటే అదెక్కడుందో చూపిస్తే చాలు పెన్షన్ ఇవ్వకపోయినా పర్వాలేదని రోశమ్మ మొత్తుకుంటున్నా వినేవారు లేరు. అదే విషయం స్థానిక ఎంపీడీవోనడిగితే... దానిపై విచారణ జరిపాక తేలుస్తామన్నారు.


శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తూర్పు దూబగుంటలో బుధవారం జరిగిన జన్మభూమి లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ప్రకటిం చిన పింఛనర్ల జాబితాలో 80 ఏళ్లు నిండిన వితంతువు రోశమ్మ పేరు విత్‌హెల్డ్‌లో ఉంచారు. ‘‘నాకు 3.60 ఎకరాల మెట్ట, 45 సెంట్ల మాగాణి ఉంది. ఐదెకరాలకు పైగా భూమి ఉందని అధి కారులు పింఛన్ ఆపేశారు. గతంలో వృద్ధాప్య పింఛన్ వచ్చేది. ఇప్పుడు వితంతు పింఛన్‌కూ నేను అర్హురాలినే. కిడ్నీలు పాడయి, నడవలేని స్థితిలో ఉన్న నాకు... పెన్షన్ ఎపుడిస్తారో తెలియటం లేదు’’ అనేది రోశమ్మ ఆవేదన.

ఇదొక్క రోశమ్మ వ్యవహారమే కాదు. విజ యనగరం జిల్లా సాలూరు మండలం ఖరాసు వలస గ్రామ సభలో కళ్లెదుట కనిపిస్తున్న వృద్ధురాలు చిన్నమ్మిని ఏకంగా నువ్వు మహిళవే కాదంటూ వెనక్కి పంపేశారు. గుంటూరు జిల్లా లో సొంతిల్లు కూడా లేక పూరింట్లో అద్దెకుం టున్న షేక్ గాలిబ్ సాహెబ్‌కు నీకు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉంది కనక పింఛను రాదు పొమ్మన్నారు. అదే జిల్లాలో పండు ముసలి షేక్ మౌలాబీని నీ వయసు 55 ఏళ్లే కనక అనర్హురాలివన్నారు. ఇవన్నీ జరగటానికి కారణం ఒక్కటే! పింఛన్ల భారాన్ని తగ్గించుకోవటానికి, బడ్జెట్లో కేటాయించిన అరకొర మొత్తాన్నే పింఛను దార్లందరికీ సర్దడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. వీలైనన్ని పింఛన్లకు కోత పెడుతోంది. ప్రభుత్వం పెట్టిన కొత్త నిబంధనలు, తనిఖీల కారణంగా గడిచిన 15 రోజుల్లో దాదాపు 9.16 లక్షల మంది పెన్షనర్లు అనర్హులైపోయారు. ఎందుకంటే గత నెలలో రాష్ట్రంలో దాదాపు 43.12 లక్షల మంది పింఛను తీసుకోగా ఈ నెలలో 33.96 లక్షల మందికే ప్రభుత్వం పింఛను మంజూరు చేసింది. అన్ని ధ్రువపత్రా లూ ఇచ్చామని, వేలి ముద్రలు కూడా తీసుకున్నారని, అయినా గ్రామ సభల్లో అందరి ఎదుటా ఇచ్చే పింఛన్లలో అనర్హులు ఎందుకుంటారని లబ్ధిదారులు అడుగుతున్నా వినేవారు లేరు. కొందరి వయసు తగ్గించి, మరికొందరికి భూమి ఉందని చెప్పి... ఇలా రకరకాల కారణాలతో కోతలు వేసేస్తున్నారు. వీటిపై గ్రామ స్థాయిలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాల్లో పింఛనుదారుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక అధికారులు సతమతమవుతున్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో ఐదెకరాల భూమి ఉందంటూ తొలగించినడంతో ఆగ్రహించిన పిం ఛనుదారు ‘‘నాకు పింఛనొద్దు. ఆ భూమి ఎక్క డుందో చూపించండి చాలు’’ అని అధికారుల్ని నిలదీశారు. ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.

దిద్దుబాటులో ప్రభుత్వం

పింఛన్ల కత్తిరింపుపై నిరసనలు వెల్లువెత్తడంతో అధికారులు అప్రమత్తమయింది. తొలగించిన 9,16,310 పింఛను దార్లలో 3,34,569 మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, మున్సిపల్ వార్డు కమిటీలు అనర్హులుగా నిర్ధారించాయి. ఈ కమిటీలు అర్హులుగా పేర్కొన్నప్పటికీ 4.70 లక్ష లమందిని ప్రభుత్వమే అనర్హులంటూ కోతపెట్టింది. మరో 1.11 ల క్షల మంది గ్రామ సభలకు అందుబాటులో లేకపోవటంతో వారూ అనర్హులయ్యారు. ప్రభుత్వం తొలగించిన 4.70 లక్షల మందిలో 90శాతం మంది అర్హులేనని పునః పరి శీలనలో తేలటంతో మొత్తం అనర్హుల జాబితాను మరోసారి పరిశీలించాలని జిల్లా అధికారులకు సూచించినట్లు తెలిసింది. కాగా పింఛను, రేషన్ కార్డు, ఆధార్‌లను అనుసంధానం చేయటంతో వాటిలోని తప్పుల వల్లే భారీ సంఖ్యలో అనర్హులు తేలినట్లు అధికారులు చెబుతున్నారు.  
 
జన్మభూమి సభల్లోనే పింఛన్ల పంపిణీ

పదేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్ల పంపిణీ జరిగే పద్ధతి ఇపుడు పునరావృత్తమైంది. పదేళ్లుగా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 5లోగా గ్రామ, మున్సిపల్ వార్డులో పింఛన్ల పం పిణీ పూర్తయ్యేది. 15వ తేదీ కల్లా జిల్లాలో పంపీ ణీ చేసిన మొత్తం పింఛన్ల వివరాలు జిల్లా అధికారులకు చేరేవి. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ కాలంలో నెలవారీ పింఛన్ల పంపిణీ బదులు జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మూడు నుంచి ఆరు నెలల పింఛన్ల డబ్బు ఒకేసారి ఇచ్చేవారు. ఈ ఏడాది అక్టోబరు నెల పింఛన్‌ను కూడా జన్మభూమి సభల్లోనే పంపిణీ చేస్తున్నారు.
 
 
 ‘‘నాకు 3.60 ఎకరాల మెట్ట, 45 సెంట్ల మాగాణి ఉంది. మొత్తం 4.05 ఎకరాలు. కానీ పెన్షన్ ఎందుకు ఆపేశారని అడిగినపుడు ఐదెకరాలకు పైగా భూమి ఉండటం వల్లనని అధికారులు చెప్పారు. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ఇప్పుడు వితంతు పింఛన్‌కూ నేను అర్హురాలినే. కిడ్నీలు పాడయి, నడవలేని స్థితిలో ఉన్న నాకు... పెన్షన్ ఎపుడిస్తారో తెలియటం లేదు’’  - రోశమ్మhttp://img.sakshi.net/images/cms/2014-10/51412800663_Unknown.jpg
 
కేటాయింపులనాడే తేలిన కోతలు

ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ కొన్ని అంశాలు మీడియా దృష్టికి తెచ్చారు. ‘‘గ్రామీణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రం లో 43.11 లక్షల మంది పెన్షనర్లున్నారు. వీరికి నెలకు చెల్లిస్తున్నది రూ.130 కోట్లు. అక్టోబరు 1నుంచి కనీస పింఛను రూ.1000 చేస్తున్నారు కాబట్టి అప్పటిదాకా ఐదు నెలల పాటు అంటే నెలకు రూ.130 కోట్ల చొప్పున రూ.650 కోట్లవుతాయి. పెండింగ్‌లో ఉన్న 15 లక్షల కొత్త పింఛను దరఖాస్తుల్ని లెక్కలోకి తీసుకోకుండానే ఇవే 43.11 లక్షల పిం ఛన్లకు నెలకు రూ.1000 చొప్పున లెక్కిస్తే కావాల్సింది 431 కోట్లు. రూ.1500 చెల్లించాల్సిన వికలాంగ పెన్షనర్లను పరిగణనలోకి తీసుకుంటే మరో 10 కోట్లు కావాలి. మొత్తం మీద నెలకు కావాల్సింది రూ.440 కోట్లు. 7 నెలలకు రూ.3080 కోట్లవుతాయి. దీనికి 650 కోట్లు కలిపితే బడ్జెట్లో కేటాయించాల్సింది రూ.3730 కోట్లు. కేటాయించింది 1338 కోట్లు. దీనర్థం ఉన్న పింఛన్లను ఊడబెరుకుతామనే కదా?’’ అంటూ ప్రభుత్వం వేయబోతున్న కత్తిరింపుల్ని ముందే మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుత కోతలు అదే తీరులో ఉండటం ప్రస్తావనార్హం.
 జగన్

తెలంగాణలో వైఎస్సార్‌సీపీని పటిష్టపరచాలి

కొమురం భీం స్ఫూర్తితో ముందుకెళ్దాంబుధవారం హైదరాబాద్ లో జరిగిన వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర తొలి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్
*తెలంగాణలో వైఎస్సార్‌సీపీని పటిష్టపరచాలి
*పార్టీ రాష్ట్ర తొలి సర్వసభ్య భేటీలో వైఎస్ జగన్ దిశానిర్దేశం
*రాష్ట్రం కానివారు, భాష తెలియని వారు పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నారు
*ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసిన మనం ఎందుకు ముందుకు రాకూడదు?
*దమ్మూ, ధైర్యం, విశ్వసనీయత ఉంటే దేవుడు, ప్రజలే ఆశీర్వదిస్తారు
*నాలుగేళ్లలో టీఆర్‌ఎస్, టీడీపీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయం
*రాష్ట్రంలో వైఎస్ మృతిని తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు

సాక్షి, హైదరాబాద్: గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్ పోరాట స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో బ్రిటిష్, నిజాం సామ్రాజ్యాలకు ఎదురొడ్డిన స్ఫూర్తిని నేతలు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకొని పార్టీని పటిష్టపరచాలని సూచించారు. రాష్ట్రం కానివారు, భాష తెలియని నేతలే రాష్ట్రంలో పట్టు కోసం ప్రయత్నం చేస్తుంటే... ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసిన వైఎస్సార్‌సీపీ వంటి ఓ తెలుగు పార్టీ ఇక్కడి ప్రజలకు మంచి చేయడానికి ఎందుకు ముందుకు రాకూడదని ప్రశ్నించారు.

రానున్న నాలుగేళ్లలో టీఆర్‌ఎస్, టీడీపీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయమని, అప్పుడు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లే మిగిలి ఉంటాయన్నారు. ప్రస్తుతం తమ బలం తక్కువగా ఉన్నా, రానున్న రోజుల్లో దమ్మూ, ధైర్యం, ప్రజా అండ, విశ్వసనీయత తో ముందుకు వెళ్తే ఆ దేవుడే ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతి రోజైన బుధవారం మెహదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్‌లో... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు.
జగన్ ఏమన్నారో ఆయన మాట ల్లోనే..
 ‘‘కొమురం భీం స్ఫూర్తిని మన పార్టీలోకి తెచ్చుకొని ముందడుగు వేసేందుకు ఈ సమావేశం ఓ నిదర్శనం. రాష్ట్రంలో పార్టీ, ఉంటుందా, ఉండదా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్న వ్యక్తులకు ఒక్కటే చెబుతున్నా. యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి. సోనియాది మన రాష్ట్రం కాదు. ఆమెకు మన భాష రాదు. అయినా కాంగ్రెస్ ఉండాలని అంటున్నారు. ప్రధాన మోడీకి సైతం ఇక్కడి భాష రాకపోయినా బీజేపీ బలపడటానికి ప్రయత్నం చేస్తోంది. తెలుగు భాష రాని వాళ్లే ఇక్కడ పరిపాలన చే యాలని ప్రయత్నిస్తుంటే, ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసి, ఇక్కడి ప్రజలకు మంచి చేయాలనుకునే తెలుగు పార్టీ ఎందుకు ముందుకు రాకూడదు?

 ఆ పార్టీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయం..
 మరో నాలుగేళ్లలో టీఆర్‌ఎస్, టీడీపీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయే రోజు వస్తుంది. కేసీఆర్‌కు ప్రజా వ్యతిరేకత రావడానికి ఏడాది పట్టొచ్చు. కానీ చంద్రబాబుకు మాత్రం నాలుగు నె లలు మాత్రమే పట్టింది. రోజుకో అబద్ధం, పూటకో మోసం చేస్తున్న బాబుకు ఏపీలో పట్టిన గతే తెలంగాణలోనూ పడుతుంది. ఎవరిని మోసం చేయడానికి వచ్చావని ప్రజలు నిలదీసే రోజు వస్తుంది.

 ప్రజా వ్యతిరేకతలో టీడీపీ, టీఆర్‌ఎస్‌లు కొట్టుకుపోవడం ఖాయం. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లు మాత్రమే మిగులుతాయి. ఈరోజు మన బలం తక్కువగా ఉందని, మన పార్టీ నేతలను గాలం వేసి లాక్కుంటున్నారు. వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌ను టీఆర్‌ఎస్ అలాగే లాక్కుంది. పార్టీ నుంచి వెళ్లే నాయకులకు ఒక్కటే చెబుతున్నా. నాలుగేళ్ల తర్వాత టీఆర్‌ఎస్ కొట్టుకుపోతే ఎటు పోవాలో నేతలు గుండెల మీద చేయివేసి తేల్చుకోవాలి.

 ఖలేజా, విశ్వసనీయత ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారు..
 నాయకుడు ఎదగాలన్నా, పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రజలు మనవైపు ఉన్నారా.. లేరా? అన్నదే ముఖ్యం. నాలుగేళ్ల కిందటే సోనియాను వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన సమయంలో నేను, అమ్మ విజయమ్మ మాత్రమే ఉన్నాం. మా వెంట ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు, దేవుడే మమ్మల్ని నడిపించారు. మనలో ఖలేజా, విశ్వసనీయత ఉంటే ప్రజలు, దేవుడు ఆశీర్వదిస్తారు. మనం సినిమాకు వెళ్తే అందులో 14వ రీల్ వరకు హీరోను విలన్లు అన్ని రకాల ఇబ్బందులు పెడతారు. 14వ రీల్ దాకా విలన్ విజయం సాధించినా, 15వ రీల్‌లో హీరో ఒక్కడే అడ్డంగా కథ మార్చేస్తారు. దమ్మూ, ధైర్యం ఉంటే మనమూ అది సాధించవచ్చు.

 సంక్షేమ పథకాలను కత్తిరిస్తున్నాయి..
 తెలంగాణ, ఏపీలో టీఆర్‌ఎస్, టీడీపీ ప్రభుత్వాలు బడ్జెట్ కత్తిరింపుల పేరుతో పింఛన్లు, ఇళ్లు, ఫీజులకు కోత పెట్టే ఆలోచనలు చేస్తున్నాయి. కానీ వైఎస్ హయాంలో ప్రతి పేదవానికీ, ఇంటింటికీ సేవ చేశారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. సువర్ణపాలన వైపు అడుగులు వేయిస్తుంది. రాష్ట్ర ఖజానాలో డబ్బు ఎంతున్నది లెక్కచేయకుండా సంక్షేమ ఫలాలను అమలు చేద్దాం. పార్టీ జెండా రెపరెపలాడించేందుకు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి.

 జనంలోకి షర్మిల...
 వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తానని మాటిచ్చా. ఆ మాటే నన్ను చాలా మార్చింది. ఎవరూ వెళ్లని గ్రామాలు, తిరగని పూరి గుడిసెలు తిరిగా, పేదల కష్టనష్టాలు తెలుసుకుంటే బుర్రలో ఆలోచనలు రావడం ఖాయం. మంచి నాయకుడు కావడం ఖాయం. ఖమ్మంలో ఓదార్పు పూర్తి చేసినా మిగతా జిల్లాల్లో వీలుకాలేదు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఓదార్పు అంటే బాగుండదు కనుక.. పరామర్శ పేరుతో నా సోదరి షర్మిల ఆ కుటుంబాలను కలుస్తారు. వారు ఎలా జీవిస్తున్నారో తెలుసుకునే బాధ్యతను షర్మిలపై పెడుతున్నా. వారికి తోడుగా, వారి బతుకులు మార్చే కార్యక్రమాన్ని చూసుకోవాలి. రానున్న రోజుల్లోనూ షర్మిల పార్టీ కార్యకర్తలకు పూర్తిగా అందుబాటులో ఉంటుంది. వేరే ఏవైనా సమస్యలు ఉంటే నేనొస్తా.. ధర్నాకు దిగుతా. మీకు అండగా ఉంటా’’

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సర్వ సభ్య సమావేశంలో పలువురు నేతలు తీర్మానాలు చేశారు. మొదటగా ఇటీవల మరణించిన పార్టీ సీనియర్ నేతలు శోభానాగిరెడ్డి, వడ్డేపల్లి నర్సింగరావు సహా పలువురు నేతలకు సంతాపం తెలుపుతూ తీర్మానాలు చేశారు. అనంతరం మరికొన్ని తీర్మానాలను పార్టీ నేతలు కె.శివకుమార్, జనక్‌ప్రసాద్, ఎ.విజయకుమార్, జి.నాగిరెడ్డి, బి.రవీందర్, సత్యం శ్రీరంగం, ఎం.జయరాజు చదివి వినిపించారు. తీర్మానాలు ఇవీ..
దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి
24 గంటల విద్యుత్ అమలు జాబితాలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మాదిరే తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి
గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పట్టాలు వెంటనే ఇవ్వాలి
అర్హులైన పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయాలి
ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలి
రైతు రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి
రూ.5 కోట్ల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం అందించి దళితులను పారిశ్రామిక వేత్తలుగా చేయాలి
దళితులకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలి
కరెంట్ కోతల వల్ల జరుగుతున్న రైతుల ఆత్మహత్యల నిరోధానికి కేంద్రం యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి విద్యుత్‌ను ఇచ్చి ఆదుకోవాలి

దివాన్ చెరువులో వైఎస్ఆర్ సిపి విజయం

Written By news on Wednesday, October 8, 2014 | 10/08/2014


రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు పంచాయతీ ఎన్నికలలో  వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు విజయం సాధించారు. వైఎస్ఆర్ సిపి మద్దతుదారు చంద్రరావు 792 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. గ్రామంలోని 16 వార్డులలో 12 వార్డులలో వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్ మూడు వార్డులలో, టిడిపి ఒక వార్డులో విజయం సాధించాయి. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు.

ఈ పంచాయతీని దివాన్‌చెరువు, శ్రీరామపురంగా విభజించేందుకు 1996లో అప్పటి పాలకవర్గం తీర్మానించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు స్థానికులు హైకోర్టుకు వెళ్లారు.  గత ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టు తీర్పు వారికి అనుకూలంగా ఇచ్చింది.  విభజించకుండానే గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. గత మార్చిలో పంచాయతీ ఎన్నికలు జరిగిన సమయానికి ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు జరగలేదు. అందువల్ల అప్పట్లో దివాన్‌చెరువు పంచాయతీ ఎన్నికలు జరగలేదు. తరువాత ప్రాదేశిక, పురపాలక, సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కూడా జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజు ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు.

 దివాన్‌చెరువు పంచాయతీకి శ్రీరామపురం, రఘునాథపురం శివారు గ్రామాలుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 8,597. సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు.  మల్లారపు సత్యానందం, కొవ్వాడ చంద్రరావు, నిడమర్తి సత్తిరాజు, బుంగా భాస్కరరావు, విజయ ప్రియదర్శిని సర్పంచ్ స్థానానికి బరిలో నిలిచారు. మొత్తం 16 వార్డులలో 15 చోట్ల ద్విముఖ, ఒక చోట త్రిముఖ పోటీ జరిగింది.

టీడీపీ విషసంస్కృతిని అమలు చేస్తోంది


'టీడీపీ విషసంస్కృతిని అమలు చేస్తోంది'
హైదరాబాద్: కొత్త రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికార టీడీపీ విషసంస్కృతిని అమలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రైతుల భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. దీనిపై అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్లు దౌర్జన్యాలు చేస్తున్నారని అంబటి రాంబాబు వాపోయారు.

కాగా, సరస్వతి సిమెంట్స్ భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అవి పూర్తిగా కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకున్న భూములని ఆయన స్పష్టం చేశారు.

15వ రీలులో హీరో కథ మార్చేస్తాడు: వైఎస్ జగన్


''సినిమాలో హీరో 14వ రీలు వరకు అష్టకష్టాలు పడతాడు.. అప్పటివరకు అప్పటివరకు విలన్ దే పైచేయి అవుతుంది. కానీ 15వ రీలు దగ్గరకు వచ్చేసరికే కథ మొత్తం మారుతుంది. అప్పుడు హీరో ఒక్కడే అయినా కథ మొత్తం మార్చేస్తాడు'' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ తెలంగాణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంటును ప్రకటించేందుకు మెహిదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్స్ లో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన ఉత్తేజపూరితంగా మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

* నిజాం సామ్రాజ్యాన్ని కూడా వ్యతిరేకించిన కొమురం భీమ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి.
* తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉంటుందా, ఉండదా అని రకరకాల వ్యక్తులు రకరకాల అనుమానాలు తెస్తున్నారు. అలాంటి వాళ్లందరికీ నేను చెప్పబోయేది ఒక్కటే. యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి.
* దమ్ము, ధైర్యం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు తోడుంటారు. మన మనసు మంచిదైతే ప్రజలు మన మాటలు నమ్ముతారు. మనలో ఖలేజా ఉంటే, దమ్ము, ధైర్యం ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారు. నిజాయితీతో ప్రజల చెంతకు ముందడుగు వేయాలి.
* సోనియాగాంధీ మన రాష్ట్రం కాదు. అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండాలని పట్టుబడుతున్నారు. ఆమెది మన రాష్ట్రం కాదు, మన భాష అంతకన్నా కాదు.
* ఇటీవల బీజేపీ కూడా బలపడేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీకి చెందిన నేత నరేంద్ర మోదీగారికి కూడా తెలుగు రాదు.
*  తెలుగు భాష రానివాళ్లు కూడా వచ్చి, ఇక్కడ తామే పరిపాలన చేయాలనుకున్నప్పుడు.. ఇక్కడే పుట్టి, ఇక్కడ ఇన్నాళ్లుగా ఉండి, ఇక్కడి సమస్యలు తెలిసినప్పుడు, ఇక్కడవాళ్లకు మంచి చేయడానికి ఒక తెలుగు పార్టీ ఎందుకు ముందు రాకూడదని అడుగుతున్నా.
* ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. రాబోయే నాలుగేళ్లలో ఈ పార్టీ ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయే రోజు వస్తుంది.
* చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో పరిపాలన చేస్తున్నారు. రోజుకో అబద్ధం, పూటకోమోసం చేస్తున్నారు. అక్కడ కేసీఆర్ గారికి ప్రజా వ్యతిరేకత రావడానకిఇ ఏడాది పడుతుందేమోగానీ, నాలుగు నెలల్లోనే బాబుపై వ్యతిరేకత వస్తుంది.
* నాలుగేళ్ల తర్వాత ప్రజా వ్యతిరకతతో టీఆర్ఎస్, టీడీపీ వెళ్లిపోతాయి. ఆ తర్వాత మిగిలి ఉండేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ మాత్రమే.
* ఇప్పుడు మన బలం తక్కువ ఉండచ్చు, నాయకులు ఉండకపోవచ్చు. కానీ మన నాయకులను లాక్కుంటున్నారు. వాళ్లు గాలం వేసినప్పుడు చిక్కుకునేవాళ్లు ఆలోచించాలి. నాలుగేళ్ల తర్వాత ఆ పార్టీకి ప్రజా వ్యతిరేకత వస్తే ఇక ఏ పార్టీకి వెళ్తారు?
* సోనియాగాంధీకి వ్యతిరేకంగా నిలిచి పోరాడిన వ్యక్తులు ఇద్దరమే.. నేను, మా అమ్మ. మేమిద్దరమే ఆ పార్టీ నుంచి బయటపడ్డాం. ఆరోజు మా వెనక ఎవరూ లేరు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పేరుమోసిన నాయకులు ఎవరూ లేరు. మీరే మమ్మల్ని ముందుండి నడిపించారని గర్వంగా చెబుతున్నా.
* బడ్జెట్ కొంచెమే ఉంది కాబట్టి పింఛన్లలోను, ఫీజు రీయింబర్స్ మెంట్ లోను అన్నింటిలో కోతలు పెడుతున్నారు. ఇలాంటి కోతలు లేకుండా అడుగులు వేయడంలో వైఎస్ఆర్ సీపీ ముందుంటుంది.
* తెలంగాణలోనూ వైఎస్ఆర్ సీపీ జెండా ఎగిరే రోజు వస్తుంది.

నవంబర్ 8న ఆళ్లగడ్డ స్థానానికి ఉప ఎన్నిక

Written By news on Tuesday, October 7, 2014 | 10/07/2014

నవంబర్ 8న ఆళ్లగడ్డ స్థానానికి ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: వైఎస్ఆర్సీపీ నేత, దివంగత భూమా శోభానాగిరెడ్డి మృతితో ఖాళీ ఏర్పడిన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి నవంబర్ 8 తేదిన ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం అక్టోబర్ 14 తేదిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈసీ ప్రకటన చేసింది. 
 
నవంబర్ 8 తేదిన పోలింగ్ నిర్వహించి.. 12 తేదిన ఓట్ల లెక్కింపు జరుపనున్నట్టు ప్రకటనలో పేర్కోన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదంలో భూమా శోభానాగిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. మరణానంతరం జరిగిన ఆళ్లగడ్డ స్థానానికి జరిగిన ఎన్నికలో శోభానాగిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 

వైఎస్ఆర్ సీపీ కమిటీల నియామకం

ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను నియమించారు. వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హరీష్ కుమార్, భూషణ్ భవనం ను నియమించారు.

వైఎస్ఆర్ సీపీ స్టూడెంట్ వింగ్, అడ్ హక్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ సలాం బాబును నియమించారు.  స్టూడెంట్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిగారి రాఖేష్ రెడ్డి నియమితులయ్యారు. మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఫయాఖీ నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరిని పదవుల్లో నియమించారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయం మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీ రెడ్డి కన్నుమూత

Written By news on Monday, October 6, 2014 | 10/06/2014


ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీ రెడ్డి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కేర్ ఆస్పత్రిలో గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. సీసీ రెడ్డి మృతికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
గతంలో సీసీ రెడ్డి కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 'రూమ్ మేట్స్, మీ శ్రేయోaభిలాషి, గౌతమ్ ఎస్ఎస్సీ తదితర చిత్రాలకు ఆయన నిర్మాణ సారథ్యం వహించారు.

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

Written By news on Sunday, October 5, 2014 | 10/05/2014

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. దైవత్వానికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకని జగన్ పేర్కొన్నారు.

ముస్లింలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే పండుగ బక్రీద్ అని వైఎస్ జగన్ తెలిపారు. దైవ ప్రవక్తను స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే బక్రీద్ పండుగ భక్తి భావానికి చిహ్నమని జగన్ అన్నారు.

రైతులను బెదిరిస్తే ఊరుకోం


రైతులను బెదిరిస్తే ఊరుకోం
వైఎస్సార్‌సీపీ హెచ్చరిక ... రాజధాని నిర్మాణంపై సీఎం మాటలు గర్హనీయం
 
హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో విజయవాడ, గుంటూరు పరిసరాల రైతులను సీఎం చంద్రబాబు బెదిరిస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తే గట్టిగా ప్రతిఘటిస్తామని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి హెచ్చరించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం భూసేకరణపై రైతులు అత్యాశకు పోవద్దని, అత్యాశకు పోతే అనర్థాలేనని చంద్రబాబు శుక్రవారం చేసిన ప్రకటన తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు. ‘ల్యాండ్ పూలింగ్ కావాలా లేక భూసేకరణ కావాలా? రైతులే నిర్ణయించుకోండి. భూమి ఇస్తే ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అనుసరిస్తాం... లేదంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తాం...’ అని బాబు బెదిరించడం గర్హనీయమన్నారు. ఆయన మాట తీరు చూస్తూంటే  ఏమాత్రం మారలేదనేది స్పష్టమవుతోందని దుయ్యబట్టారు. అదేదో పోటా చట్టం మాదిరిగా భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని సీఎం రైతులను బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని రైతులు తమ భూములకు మార్కెట్ విలువ కావాలని కోరుకోవడం అత్యాశ అవుతుందా? అదే చంద్రబాబు వందిమాగధులు, ఆయన వర్గీయులు, తాబేదారులు ఎక్కువ ధరకు భూములను అమ్మకానికి పెడితే అత్యాశ కాదా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక చక్కటి రాజధాని కావాలనేది వైఎస్సార్‌సీపీ అభిమతమని, దాని నిర్మాణానికి తాము మనస్ఫూర్తిగా సహకరిస్తామని, అయితే రైతులను ఇబ్బందులు పెడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టంచేశారు.

వాస్తవానికి విజయవాడ, గుంటూరు పరిసరాల్లో 35 నుంచి 40 వేల ఎకరాల మేరకు ప్రభుత్వ భూమి ఉందని, ముందుగా దానిని రాజధాని అవసరాల కోసం తీసుకుని ఆ తరువాత రైతుల భూముల గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. టీడీపీ నేతల ప్రకటనలు, భూసేకరణ కోసం వేసిన కమిటీ తీరును చూసినపుడు అసలు ప్రభుత్వ ఉద్దేశ్యం మంచి రాజధాని నిర్మించడం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి పోషించి తన వాళ్లందరికీ పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చడమేనన్నది వెల్లడవుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి ఓట్లేయని లక్షలాది మంది పింఛన్లను ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా తొలగించారని తెలిపారు. పామర్రు నియోజకవర్గంలో జన్మభూమి సభలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేద్దామని వెళ్లిన తమ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరిపోతారంటూ ఆమె చేతిలో ఓటమిపాలైన వర్ల రామయ్య మాట్లాడ్డం అభ్యంతరకరమన్నారు.

మీ ఆటలు సాగనివ్వను


మీ ఆటలు సాగనివ్వను
- గుడివాడ క్లబ్‌లో జూదం నిర్వహణకు ఏర్పాట్లు
- అడ్డుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని
- వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన
- వెనుదిరిగిన నిర్వాహకులు
గుడివాడ : స్థానిక గుడివాడ క్లబ్‌లో పేకాట కార్యకలాపాల ప్రారంభాన్ని వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అడ్డుకున్నారు. విజయదశమి(శుక్రవారం) రోజు గుడివాడ క్లబ్‌లో పేకాట నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమచారం అందడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి వెళ్లిన కొడాలి నాని ఆందోళన నిర్వహించారు. తాను గుడివాడలో ఉండగా.. పేకాట ఆడనివ్వబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో క్లబ్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు నిర్వాహకులు పేకాట నిర్వహణను విరమించుకోవడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది.

ఆరేళ్ల క్రితం పేకాటకు బ్రేక్..

స్థానిక పోస్టాఫీసు రోడ్డులో ఉన్న ది గుడివాడ క్లబ్‌లో ఆరేళ్ల క్రితం పేకాట, జూద కార్యక్రమాలను నిలిపివేశారు. గతంలో 20 ఏళ్ల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ క్లబ్‌లో పేకాట పెద్ద ఎత్తున కొనసాగేది. పోలీసులు ఈ క్లబ్ వైపు చూడటానికి   కూడా సాహసించేవారు కాదు. ఆరేళ్ల క్రితం క్లబ్‌లో పేకాట నిర్వహణపై ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) నాయకత్వంలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిరాహార దీక్షలు నిర్వహించారు. ఫలితంగా క్లబ్‌లో జూద కార్యకలాపాలకు తెరపడింది. అప్పటి నుంచి పలుమార్లు క్లబ్‌లో పేకాట ఆడించటానికి ప్రయత్నించినా అడ్డుకుంటూ వచ్చారు.
 
మంత్రి, ఎంపీ అండతో మళ్లీ గ్రీన్ సిగ్నల్..
కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలోని కొందరు ప్రజా ప్రతినిధులు ఈ క్లబ్‌లో పేకాట ఆడించటానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అందులో భాగంగా శుక్రవారం విజయ దశమి రోజు పశ్చిమ గోదావరికి చెందిన అధికార పార్టీ ఎంపీ, జిల్లాకు చెందిన మంత్రి ఆధ్వర్యాన క్లబ్‌లో పేకాట ఆడించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారితో కూడా మాట్లాడినట్లు సమాచారం. విజయదశమి రోజు సాయంత్రం 6 గంటలకు పేకాట క్లబ్ ప్రారంభమవుతుందని వివిధ ప్రాంతాల్లో ఉన్న సభ్యులందరికీ సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యాన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున క్లబ్ వద్దకు చేరుకున్నారు. పేకాట ఆడేందుకు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో గుడివాడ డీఎస్పీ నాగన్న తన సిబ్బందితో కలిసి వచ్చారు. అప్పటికే క్లబ్ ప్రాంగణమంతా ఆందోళనకారులతో కిక్కిరిసిపోయింది.
 
పేకాట ఆడనివ్వను : కొడాలి నాని
క్లబ్‌ను పరిశీలించిన అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ పేకాట ఆడేందుకు టేబుళ్లు సిద్ధం చేశారని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితిలోనూ ఈ క్లబ్‌లో పేకాట ఆడనివ్వబోనని చెప్పారు. గతంలో ఎన్నో ఆందోళనల ఫలితంగా క్లబ్‌లో పేకాటను నిషేధించారని తెలిపారు. గతంలో మంత్రిగా ఉన్న పిన్నమనేని ఆధ్వర్యాన ఇక్కడ పేకాట బాగా ఆడేవారని, ఎంతో కష్టపడి నిలిపివేయగలిగామని చెప్పారు. గడచిన ఆరేళ్లుగా పేకాట ఆడనివ్వడం లేదని పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ పేకాట వంటి జూదాల నిర్వహణను ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు.

కొందరి స్వార్థం కోసం మంత్రులు, ఎంపీలు కలిసి క్లబ్‌లో పేకాట ఆడించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి రెవెన్యూ స్థలాన్ని ఆక్రమించుకుని క్లబ్ నిర్మించారని, అంతటితో ఆగకుండా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం దారుణమన్నారు. క్లబ్ పక్కన రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో 40 అడుగులు ఉండగా, క్లబ్ నిర్వాహకులు ఆక్రమించుకుని 20 అడుగులకు కుదించారని తెలిపారు. ఈ రోడ్డును వెంటనే 40 అడుగులకు విస్తరించాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుకు సూచించారు. పేకాట వల్ల తమ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఎందరో మహిళలు తన వద్ద ఆందోళన వ్యక్తంచేశారని నాని చెప్పారు. క్లబ్‌లో పేకాటకు పోలీసులు అనుమతిస్తే ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోమని ఆయన స్పష్టంచేశారు.  

క్లబ్ ఎదుట ఆందోళన
పేకాట క్లబ్ ప్రారంభోత్సవానికి మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబు వస్తున్నారని తెలియడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పేకాట ఆడించడం లేదని ప్రకటించే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో డీఎస్సీ నాగన్న జోక్యం చేసుకుని పేకాట ఆడించబోమని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, వైఎస్సార్ సీపీ నాయకులు పాలేటి చంటి, పాలడుగు రాంప్రసాద్, కౌన్సిలర్లు చొరగుడి రవికాంత్, వసంతవాడ దుర్గారావు, గొర్ల శ్రీనివాసరావు, వెంపల హైమావతి, సూర్యప్రభ, మాదాసు వెంకటలక్ష్మి, మూడెడ్ల ఉమా, కాటి విశాల, శశికళా, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంవీ నారాయణరెడ్డి, దేశిరెడ్డి రామ్మోహనరెడ్డి, ఆ పార్టీ నందివాడ కన్వీనర్ పి.ఆదాము పాల్గొన్నారు.

బాబుకు గ్రేడింగ్ ఇస్తే సున్నా


బాబుకు గ్రేడింగ్ ఇస్తే సున్నా
పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన
పామర్రు :  అధికారం చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన 5 హామీల్లో ఇంతవరకు స్పష్టత రాలేదని,   ప్రభుత్వం వెంటనే వీటిపై స్పష్టత ఇవ్వాలని  పామర్రు ఎమ్మెల్యే ,శాసనసభలో వైఎస్సార్‌సీపీ డెప్యూటీ ప్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయలలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేయకుండా మార్గదర్శకాల పేరిట కమిటీలను ఏర్పాటు చేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు.  రైతు, డ్వాక్రా రుణాలపై సాధికారిత కమిటీలను ఏర్పాటు చేసి సంవత్సరానికి   20శాతం రుణాలను  మాత్రమే రద్దు చేస్తామని చెప్పడం వారిని అయోమయానికి గురిచేస్తోందని తెలిపారు.  
 
ప్రస్తుతం సీఎం చంద్రబాబు తమ మంత్రులకు గ్రేడింగ్ ఇస్తున్నారని, మరి సీఎంకు గ్రేడింగ్ పెడితే ‘0’ వస్తుందని ప్రజలు వాపోతున్నరన్నారు.    జన్మభూమి-మావూరు కార్యక్రమంపై సీఎం తెలిపిన విధి విధానాల ప్రకారం ప్రతీ కార్యక్రమాన్ని ఆయా పరిధిలోని  ఎంపీ, ఎమ్మెల్యేల ద్వారా  నిర్వహించాలని ఉందన్నారు. కానీ పామర్రు నియోజకవర్గంలో  ప్రభుత్వ  కార్యక్రమంలా లేదన్నారు. ఇది కేవలం టీడీపీ సమావేశంలా ఉందన్నారు. ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించడం లేదన్నారు.   అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన చోట ఓడిపోయిన టీడీపీ నాయకులను వేదికలపైకి ఎక్కించి పార్టీల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారన్నారు.

జెడ్పీ చైర్ పర్సన్  గద్దె అనూరాధ  పక్కనే ఉన్నా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి వర్ల రామయ్య వేదిక మీదకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు.  ప్రోటోకాల్ ఉల్లంఘన, ఎమ్మెల్యే హక్కులకు భంగం కల్గించినందుకు, జన్మభూమికి సంబంధం లేని వ్యాఖ్యలు చేసి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరుగనీయనందుకు, ఎమ్మెల్యే, సర్పంచులను అవమానపర్చినందుకు వర్లపై ‘సభా హక్కుల కమిటీ’లో ఫిర్యాదు చేస్తామన్నారు.   కార్యక్రమం సక్రమంగా నిర్వహించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరతామని అన్నారు.  ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా చేయవద్దని వర్లని హెచ్చరించారు.  పామర్రు గ్రామ ఉపసర్పంచి అరేపల్లి శ్రీనివాసరావు, తోట్ల వల్లూరు మండలం ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, కనుమూరు సర్పంచి బొప్పూడి మేరి కమల, కురుమద్దాలి, కొండిపర్రు ఎంపీటీసీలు కొలుసు ఆదిలక్ష్మీ, బీవీ రాఘవులు,  నాయకులు ఆర్.వెంకటేశ్వరరావు  పాల్గొన్నారు.
 
వర్లకు మతి భ్రమించింది....
కనుమూరు(పామర్రు) : ప్రజా ప్రతినిధులు, అధికారుల  ఆధ్వర్యంలో జరుగుతున్న  కార్యక్రమాలకు  టీడీపీకి చెందిన  వర్ల రామయ్యను  ఏ హోదాలో ఆహ్వానించారని సంబంధిత అధికారిపై   ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం  వ్యక్తం చేశారు.   కనుమూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద  నిర్వహించిన ‘జన్మభూమి-మా వూరు’ కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామ సర్పంచి బొప్పుడి మేరికమలకు అధ్యక్ష  స్థానం  ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.  ప్రజా ప్రతినిధుల విజిట్ పుస్తకంలో వర్ల రామయ్య సంతకం పెట్టడంపై కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది పార్టీ కార్యక్రమం కాదు, వర్ల రామయ్య ప్రజా ప్రతినిధి కాదు అయినా ఆయనతో ఏ హోదాతో   సంతకం  పెట్టించారని సంబంధిత  అధికారిని ప్రశ్నించారు. దీనిపై అధికారులు నీళ్లు నమిలారు.  దీంతో  వర్ల  కల్పనపై విరుచుకు పడారు. వర్ల మాట్లాడుతూ  ఇది తమ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమమని, పార్టీ సభ్యుడుగా తాను పాల్గొన్నానని చెప్పారు. ఎమ్మెల్యేనుద్దేశించి అవహేళనగా మాట్లాడారు.  దీనిపై ఆగ్రహించిన  కల్పన మాట్లాడుతూ ఓటమి చెందడంతో  మతి భ్రమించి కుసంస్కారంతో మాట్లాడవద్దని హితవు పలికి సభాప్రాంగణం నుంచి వాకౌట్ చేశారు.

గోసుల కృష్ణారెడ్డిని పరామర్శించిన జగన్


గోసుల కృష్ణారెడ్డిని పరామర్శించిన జగన్
హైదరాబాద్: అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న వైఎస్సార్ జిల్లాకు చెందిన గోసుల కృష్ణారెడ్డిని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పరామర్శించారు. కృష్ణారెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి స్నేహితుడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు గంట సేపు ఆసుపత్రిలో గడిపారు.

కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి శేషగిరిరావును అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు కూడా పరామర్శించారు.

Popular Posts

Topics :