* బాబు సర్కారుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
* ఎన్నికలకు ముందు చంద్రబాబు అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు
* ఇప్పుడేమో ఒక్కటీ అమలు చేయలేకపోతున్నారు
* మైనార్టీ గురుకుల పాఠశాలకు ఆరుగురు మంత్రులు.. 9సార్లు వచ్చి ఏం చేశారు?
* పిల్లలు పడుకోవడానికి చోటు లేక క్లాస్ రూమ్‌లో పడుకుంటున్నారు
* స్నానం చేయడానికి స్నానాల గదులు లేని దౌర్భాగ్యం
* విద్యార్థులకు తాగడానికి మంచినీరు ఇవ్వలేరా?
* ఎంపీ గ్రాంటు కేటాయించి సమస్యలు తీరుస్తామని జగన్ హామీ

ఈ సందర్భంగా అక్కడ విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల (ఇంగ్లిష్ మీడియం) రాయలసీమలో ఒక్కటి మాత్రమే ఉందని, దీన్ని కూడా ప్రభుత్వం ఇంత అధ్వానంగా నడుపుతూ విద్యార్థుల సంక్షేమాన్ని మరిచిపోయిందన్నారు. ఆధునిక యుగంలో ఉన్నాం.. చిన్నారులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ఆయన ప్రశ్నించారు.
మైనార్టీ పాఠశాలలో 250 మంది విద్యార్థినులు చదువుతుంటే.. కేవలం 7 బాత్రూములను ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు కనీసం స్నానం చేసుకోవడానికి కూడా బాత్రూములను పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యమైన చర్యగా అభివర్ణించారు. అంతమంది విద్యార్థులకు ఏడు బాత్రూములు ఎలా సరిపోతాయని ఆలోచన చేయకపోవడం విచారకరమన్నారు. చివరకు విద్యార్థినులు పడుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని... ప్రత్యేక వసతి గదుల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ఇప్పటికీ తరగతి గదిలో పడుకుంటుండటం ప్రభుత్వానికి సిగ్గు చేటు అని అన్నారు. పాఠశాల ఆవరణలో లైట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. తాగడానికి మంచినీటి సరఫరా కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆరుగురు మంత్రులు 9సార్లు వచ్చి ఏం చేశారు?
‘‘తెలుగుదేశం ప్రభుత్వానికి చెందిన ఒక ఉప ముఖ్యమంత్రి సహా ఆరుగురు మంత్రులు.. వేంపల్లెకు తొమ్మిదిసార్లు వచ్చారు. ఏమి చేశారు.. చివరకు పాఠశాలలో నెలకొన్న చిన్న, చిన్న పనులను కూడా పూర్తి చేయలేదు.. మంత్రులు కూడా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు వస్తే ఏం ప్రయోజనం?’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఇన్నిసార్లు వేంపల్లెకు వచ్చినా.. విద్యార్థుల మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించకపోవడం ఏమిటన్నారు.
ఎంపీ నిధులతో మౌలిక వసతులు కల్పిస్తాం
విద్యార్థులు సమస్యలపై ఏకరువు పెట్టడంతో వెంటనే జగన్ స్పందించారు. పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో మాట్లాడి.. పాఠశాలకు సంబంధించి బాత్రూములు, లైట్లు, మినరల్ వాటర్ ప్లాంటు, పెండింగ్‌లో ఉన్న డార్మేటరి బిల్డింగుల నిర్మాణాలకు ఎంపీ నిధులు వెచ్చించి పూర్తి చేస్తామని చిన్నారుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
నెహ్రూ చిత్రపటం వద్ద వైఎస్ జగన్ నివాళి
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన జవహర్‌లాల్ నెహ్రూ చిత్ర పటానికి జగన్‌మోహన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రభావతి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వేంపల్లె మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్‌వలీ తదితరులు పాల్గొన్నారు.