ఇక 1,300 గజాల కేటాయింపు లాటరీ కోసం ఎదురు చూడాల్సిందే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇక 1,300 గజాల కేటాయింపు లాటరీ కోసం ఎదురు చూడాల్సిందే..

ఇక 1,300 గజాల కేటాయింపు లాటరీ కోసం ఎదురు చూడాల్సిందే..

Written By news on Friday, January 30, 2015 | 1/30/2015


రాజధాని భూముల్లో సర్కారు వారి ఉరుకులు, పరుగులు
సమీకరణకు అంగీకరించిన రైతుల భూ రికార్డులను మార్చేందుకు సన్నాహాలు.. సీఆర్‌డీఏ పేరుతో భూ రికార్డుల్లో, అడంగల్‌లో నమోదు..
అంగీకారం తెలిపిన రైతుల పేర్లు ఆన్‌లైన్ నుంచి తొలగింపునకు రంగం సిద్ధం
రెవెన్యూ యంత్రాంగానికి ఉన్నత స్థాయి ఆదేశాలు
రైతులు తమ భూములపై బ్యాంకు రుణాలు తీసుకోకుండా వ్యూహం
ఇక 1,300 గజాల కేటాయింపు లాటరీ కోసం ఎదురు చూడాల్సిందే..


సాక్షి, హైదరాబాద్: రాజధాని భూ సమీకరణలో మరో కొత్త అంకానికి రాష్ట్ర సర్కారు తెరలేపింది. రాజధాని ప్రాంత రైతులకు వారి భూములపై ఉన్న హక్కులను హరించేలా పావులు కదుపుతోంది. రైతులు అంగీకార పత్రాలు ఇచ్చిన తర్వాత సదరు భూములపై సర్వహక్కులు ఇక తమవేనని చెబుతూ వాటిని వీలైనంత త్వరగా లాగేసుకునేందుకు చర్యలు చేపడుతోంది. భూములిచ్చే రైతులతో ఏ ఒప్పందం జరగకుండానే.. వారికిచ్చే నివాస, కమర్షియల్ ప్రాంతంపై ఎలాంటి నిర్దిష్ట చర్యల్లేకుండానే సదరు భూములపై రైతుల హక్కులను హరించేందుకు చురుగ్గా కదులుతోంది. నోటిఫికేషన్ ఇచ్చాం.. వచ్చే సీజన్ నుంచి పంటలు వేసుకునేందుకు అనుమతులు లేవని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం భూ సమీకరణకు అంగీకార పత్రాలిచ్చిన రైతుల భూములకు సంబంధించి వివరాలన్నింటినీ మార్చేందుకు కసరత్తు చేపట్టింది.

విశ్వసనీయ సమాచారం మేరకు రైతుల నుంచి సమీకరించిన భూములకు సంబంధించి రికార్డుల్లో(ల్యాండ్ రికార్డుల్లో) రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పేరిట మార్చేందుకు రంగం సిద్ధమైంది. అడంగల్‌లోనూ ఎంజాయ్‌మెంట్(అనుభవదారుడు)లో ఉన్న రైతుల పేర్లను తొలగించి సీఆర్‌డీఏ పేరుతోనే నమోదు చేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగానికి ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు అందాయి. తద్వారా రాజధాని ప్రాంతంలోని రైతులు తమ భూములపై సర్వహక్కులను కోల్పోనున్నారు.

భూములు కోల్పోయిందిగాక అందుకు ప్రతిగా లభించే ప్రతిఫలం కోసం వారిక  ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. మాస్టర్‌ప్లాన్ రూపొందించిన తర్వాత లాటరీ విధానంలో ప్రభుత్వం ప్లాట్లు కేటాయించేంతవరకు నివాస, కమర్షియల్ ప్రాంతంలో 1,300 గజాల హక్కుల కోసం ఎదురు చూడాల్సిన అగత్యం రైతులకు కలగనుంది.

రైతులు తమ భూములపై రుణాలు తీసుకోకుండా ఉండేందుకే..
ఇప్పటివరకు రైతులకుండే భూముల వివరాలను సర్వే నంబర్లతో ‘సర్కారు వెబ్‌ల్యాండ్’లో కంప్యూటరీకరణ చేయడం జరిగింది. సాధారణంగా అడంగల్‌లో ఎంజాయ్‌మెంటు(అనుభవదారుడు) పేరుతో వివరాలన్నింటినీ రెవెన్యూ సిబ్బంది పొందుపరుస్తారు. ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌లో ఈ వివరాలన్నీ కంప్యూటరీకరించిన తర్వాత ఆన్‌లైన్‌లో భూమి సర్వే నంబర్లు నమోదు చేస్తే.. రైతుల పేర్లతోపాటు 1 బి ఖాతా నంబరు వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ వివరాలతోనే రెవెన్యూ యంత్రాంగం ధ్రువీకరణ పత్రాలు ఇస్తే బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరు చేస్తాయి.

అయితే రాజధాని ప్రకటిత 29 గ్రామాల్లోని రైతులు ఇకమీదట భూమి తనఖాతో రుణాలు పొందకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సదరు భూములను సీఆర్‌డీఏ పేరుతో అడంగల్‌తోపాటు ఆన్‌లైన్‌లో చేర్చాలంటూ అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. రాజధాని ప్రాంత రైతులకు రుణాలు మంజూరు చేయవద్దని ఇప్పటికే బ్యాంకులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. అయితే ఒకవేళ రైతులు భూమిపై ఉన్న హక్కులతో ధ్రువీకరణ పత్రాలిస్తే బ్యాంకులు రుణాలు మంజూరు చేసే అవకాశమున్నందున.. వారి భూ హక్కులను హరించేందుకుగాను సర్కారు ఈ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

పాస్ పుస్తకాల స్వాధీన ప్రక్రియకు శ్రీకారం..
రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రారంభించి ఈ గురువారానికి 29 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 8,500 ఎకరాలకు రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు సేకరించారు. మరోవైపు ఈ భూములకు సంబంధించి పాస్ పుస్తకాల స్వాధీన ప్రక్రియ మొదలైంది. భూ సమీకరణకు పూర్తి సుముఖత వ్యక్తం చేసిన రైతుల దగ్గర్నుంచి పాస్ పుస్తకాలను సేకరిస్తున్నారు.

రెండ్రోజుల్లో పదివేల ఎకరాలకు భూ సమీకరణ అంగీకార పత్రాలు సేకరించిన వెంటనే భూముల హక్కుల ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో ఏకకాలంలో రూ.లక్షన్నర రుణమాఫీ కార్యక్రమం కూడా రైతుల భూములపై ఎలాంటి రుణాలు లేకుండా చేసేందుకేనని, తద్వారా సమీకరించిన భూములు ఎలాంటి తనఖాలు లేకుండా ఉండేందుకేనని స్పష్టమౌతోంది.
Share this article :

0 comments: