ఏపీ రాజధాని ప్రాంత రైతులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఏపీ రాజధాని ప్రాంత రైతులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

ఏపీ రాజధాని ప్రాంత రైతులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

Written By news on Tuesday, January 6, 2015 | 1/06/2015


* ఏపీ రాజధాని ప్రాంత రైతులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా
* మీ అంగీకారం ఉంటేనే భూ సమీకరణ జరుగుతుంది
* లేకపోతే చంద్రబాబే కాదు.. వాళ్ల నాయన దిగివచ్చినా తీ
సుకోలేరు

సాక్షి, హైదరాబాద్: ‘మీ అందరి అంగీకారం లేకుండా  మీ భూములను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాదు కదా, వాళ్ల నాయన దిగి వచ్చినా తీసుకోలేరు. మీ అంగీకారం ఉంటేనే అక్కడ రాజధాని కోసం భూ సమీకరణ జరుగుతుంది లేకుంటే లేదు’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంత గ్రామాల రైతులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకునే ప్రతి చర్యను తమ పార్టీ గట్టిగా ప్రతిఘటిస్తుందని చెప్పారు.
 
  రైతులను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాటాలు, నిరసనలు చేస్తామని హెచ్చరించారు. బాధిత రైతాంగానికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. సారవంతమైన, అత్యంత విలువైన తమ భూములను వదులుకోవడానికి ఇష్టపడని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నవులూరు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో సోమవారం ఉదయం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జగన్‌ను కలుసుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. భూములు ఇవ్వబోమన్నందుకు రైతులను దొంగల మాదిరిగా పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు. కొందరైతే తమ బాధలు వివరించేటప్పుడు కన్నీటిని ఆపుకోలేకపోయారు. సుమారు రెండు గంటల పాటు రైతులు చెప్పింది విన్న తర్వాత జగన్ మాట్లాడారు. రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు అక్కడి పరిస్థితులను వివరిస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. అసెంబ్లీలో సీఆర్‌డీఏ చట్టాన్ని చేసేటప్పుడు రైతులు స్వచ్ఛందంగా ఒప్పుకుంటేనే వారి భూములను తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం.. పోలీసులతో బెదిరించడం దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్య ఏమాత్రం లేని గ్రామాల్లోకి పోలీసులు అడుగు పెట్టాలంటే ఏదో ఒకసాకు కావాలని, ఆ సాకు కోసమే వాళ్లంతట వాళ్లే పొలాలను కాల్చేశారని చెప్పారు. పైగా రైతులను పోలీస్‌స్టేషన్లకు పిలిచి వారిని మానసిక క్షోభకు గురిచేయడమే కాకుండా, కొందరిపై చేయి కూడా చేసుకోవడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  ప్రజల సంక్షేమం కోసం పాటు పడాల్సిన ప్రభుత్వం వారి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలను కోవడం దారుణమన్నారు. ‘రాజధాని కోసం సేకరిస్తున్న 50 వేల ఎకరాలకు గాను 25 వేల ఎకరాల్లో రోడ్ల నిర్మాణం, కనీస సదుపాయాల కల్పన చేస్తారట. మిగిలిన 25 వేల ఎకరాల్లో నుంచి రైతులకు పోను మిగిలిన 13 వేల ఎకరాల్లో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందట. ప్రభుత్వం చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటి?’ అంటూ  ప్రశ్నించారు. ‘ప్రభుత్వం వాస్తవంగా చేయాల్సిందేమిటంటే..
 
 ఫలానా ప్రాంతం రాజధానికి సంబంధించినదని నోటిఫై చేయాలి. దాని చుట్టూ రోడ్డు వేయాలి. రోడ్లు వేయడానికి కావాల్సిన మేరకు భూమిని తీసుకుంటే అభ్యంతరం లేదు. రోడ్లు వేశాక జోనింగ్ చేయాలి. ఫలానాది రెసిడెన్షియల్ (జనావాసం), ఫలానాది కమర్షియల్ (వాణిజ్యం) అంటూ జోనింగ్ చేసి వదలాలి. వ్యాపారం చేసుకోవాలనుకుంటే రైతులే ఆ పని చేసుకుంటారు. అలా కాకుండా రైతుల భూమితో చంద్రబాబు సింగపూర్‌తోనో మరొకరితోనో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు చేసుకోవాలి..’ అని నిలదీశారు. రైతుల భూములను లాక్కుని, వారికి కాస్తో, కూస్తో శనక్కాయలు (వేరుశనగలు), బెల్లం ఇచ్చినట్లుగా స్థలాన్ని ఇచ్చి, వారి భూములతో అధిక లాభాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వం దిగుతోందని జగన్ మండిపడ్డారు.
 
 ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదల్చుకుంటే సారవంతమైన భూములు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఇప్పుడు రాజధాని ప్రాంతంగా ప్రకటించిన చోటికి ఓ నాలుగడుగులు అటువైపు వినుకొండ ప్రాంతంలో కావాల్సినంత ప్రభుత్వ భూమి, అటవీ భూమి ఉందని అక్కడ వారు ఇదే వ్యాపారం చేసుకోవచ్చని సూచిం చారు. పార్టీ ముఖ్య నేతలు ధర్మాన ప్రసాదరావు, కె.పి.సారథి, మైసూరారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డీఏ సోమయాజులు, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉప్పులేటి కల్పన, మహ్మద్ ముస్తఫా, కొడాలి నాని, గొట్టిపాటి రవికుమార్, కోన రఘుపతి, నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి, మేరుగ నాగార్జున, కరణం ధర్మశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 ‘అధికారం ఉంది కదా అని చంద్రబాబు ఇష్టానుసారం చేస్తున్నారు. అయితే ఈ అధికారం దేవుడు అనుగ్రహిస్తే నాలుగేళ్లు ఉండొచ్చు, అసలు నాలుగేళ్లు ఉంటుందో.. జ్యోతిష్కులంతా రెండేళ్లలోనే పడిపోతుందంటున్నారు. నాకైతే తెలియదు గానీ ఆయన ఏం చేసినా ఈ అధికారం పోయే లోపే. నేను ప్రతి రైతుకూ చెబుతున్నా... మీ అంగీకారం ఉంటేనే భూ సేకరణ జరుగుతుంది. బలవంతంగా ఏ కార్యక్రమం చేసినా కచ్చితంగా తిరగదోడి పునరుద్ధరిస్తాం. భూములపై మళ్లీ రైతులకు హక్కులు కల్పిస్తాం. ఈ విషయంలో న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తాం. ఈ ప్రభుత్వం ఎంతవరకు ఉంటే అంతవరకు పోరాడుదాం. ఆ తర్వాత మాత్రం మీ కొడుకు, మీ మనవడు, మీ తమ్ముడు, మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడని, అందరికీ న్యాయం చేస్తాడనే సంగతి మాత్రం గుర్తుంచుకోండి..’    
 - రాజధాని రైతులతో వైఎస్ జగన్
Share this article :

0 comments: