పెట్రో ధరలపై బాబు నోరుమెదపరేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెట్రో ధరలపై బాబు నోరుమెదపరేం?

పెట్రో ధరలపై బాబు నోరుమెదపరేం?

Written By news on Sunday, January 18, 2015 | 1/18/2015


పెట్రో ధరలపై బాబు నోరుమెదపరేం?మీడియాతో మాట్లాడుతున్న గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డివీడియోకి క్లిక్ చేయండి
 అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా ఎన్డీయే సర్కారు ఆ మేరకు ఎందుకు తగ్గించట్లేదని వైఎస్సార్‌సీపీ సూటిప్రశ్న
 
 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన ముడి చమురు(క్రూడ్ ఆయిల్) ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. పార్టీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సగానికి తగ్గినా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ రేట్లను ఆ మేరకు తగ్గించడంలేదని తప్పుపట్టారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడూ ఏమీ మాట్లాడ్డం లేదన్నారు. గత జూన్‌లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 115 డాలర్లుగా ఉంటే అది సగానికంటే తక్కువగా ప్రస్తుతం 47.5 డాలర్లకు పడిపోయిందని, కానీ దేశంలో ఆ మేరకు ధరలు తగ్గలేదని అన్నారు. ఒక బ్యారెల్ ధర 115 డాలర్లుగా ఉన్నపుడు ఇక్కడ లీటరు పెట్రోలు ధర రూ.80లుగా ఉండేదన్నారు. 47.5 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో ఒక లీటరు పెట్రోలు ధర రూ.45, రూ.50ల మధ్య ఉండాలని, అయితే అదింకా రూ.67, రూ.68ల మధ్యే ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించకుండా ఎన్డీయే ప్రభుత్వం ఆ భారాన్ని ఇంకా దేశప్రజలపై మోపుతోందని వారు విమర్శించారు. వాస్తవానికి వీటి ధరలను అంతర్జాతీయ మార్కెట్‌తో ముడిపెట్టిందే గతంలో ఎన్డీయే ప్రభుత్వమేనని వారు గుర్తు చేశారు. ‘‘అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినపుడు, ఇక్కడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచిన కేంద్రం... ఇపుడు తగ్గిన ధరలకనుగుణంగా వీటి రేట్లను ఎందుకు తగ్గించట్లేదు?’’ అని సూటిగా ప్రశ్నించారు. సార్క్ దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్‌లోనూ భారత్‌కంటే పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. కేంద్రం మొక్కుబడిగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిందేతప్ప నిష్పత్తి ప్రకారం ధరలను తగ్గించలేదన్నారు. కేంద్రం పెట్రోలు, డీజిల్‌పై పన్నులు వేసి ఆదాయాన్ని పెంచుకుంటోందని విమర్శించారు.

 బాబు మాట్లాడరేం?

 దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పన్నులు వసూలు చేస్తున్నారని, వాటిని తగ్గించాల్సిన అవసరముందని ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు డిమాండ్ చేసిన చంద్రబాబు ఇపుడు భారత్‌లో పెట్రోలు, డీజిల్‌పై ఎక్కువగా వసూలు చేస్తున్న పన్నులను తగ్గించాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎందుకు కోరట్లేదని వారు ప్రశ్నించారు. మనమే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లట్లేదని నిలదీశారు. ముడిచమురు ధరల ప్రకారం ఇక్కడ పెట్రోలు, డీజిల్ రేట్లను ఉద్దేశపూర్వకంగానే ఎన్డీయే ప్రభుత్వం తగ్గించడం లేదేమోనని వారు అనుమానం వెలిబుచ్చారు. గతంలో ఇవే ధరలకు ముడిపెట్టి ఆర్టీసీ, రైల్వే చార్జీలను అమాంతం పెంచేశారని, ఇపుడు తగ్గుతున్న ధరలను బట్టి వాటినీ ఎందుకు తగ్గించట్లేదని ప్రశ్నించారు. పెట్రో ధరల పేరు చెప్పి నిత్యావసర సరుకులు, ఎరువుల ధరలు ఆకాశానికి అంటాయని, ఇపుడు వాటిని తగ్గించడానికీ చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా విఫలమయ్యాయని వారు దుయ్యబట్టారు.
Share this article :

0 comments: