మోసపోయిన రైతులు, మహిళల పక్షాన ప్రశ్నించేందుకే జగన్ దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మోసపోయిన రైతులు, మహిళల పక్షాన ప్రశ్నించేందుకే జగన్ దీక్ష

మోసపోయిన రైతులు, మహిళల పక్షాన ప్రశ్నించేందుకే జగన్ దీక్ష

Written By news on Thursday, January 29, 2015 | 1/29/2015


మోసపోయిన రైతులు, మహిళల పక్షాన ప్రశ్నించేందుకే జగన్ దీక్ష
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన వెల్లడి

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఎదురుచూసి మోసపోయిన రైతులు, మహిళలు, రాష్ట్ర ప్రజల పక్షాన నిలిచేందుకే ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో ప్రతిపక్ష నేత నిరాహారదీక్షకు పూనుకుంటున్నారని ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

జగన్ దీక్ష ఎందుకు చేస్తున్నారని టీడీపీ మంత్రులు, నేతలు ఏమీ తెలియనట్లు నటిస్తూ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.  వ్యవసాయ రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ రద్దు చేస్తానని చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ఎన్నికల సమయంలో ప్రకటించి ఆ తరువాత మోసగించడంతో గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. డ్వాక్రా రుణాలు రద్దు కాకపోవడంతో మహిళా సంఘాలన్నీ నిర్వీర్యం అయ్యాయన్నారు. చంద్రబాబు చేసిన నమ్మకద్రోహంపై ప్రజలను జాగృతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే జగన్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేతిలో ప్రజలు మోసపోయినపుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ ముందుండి పోరాడుతుందనే విషయం తాము రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు.

‘‘ఎన్నికల నాటికి విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రైతుల రుణాలు రూ. 87 వేల కోట్లు, డ్వాక్రా మహిళల రుణాలు రూ. 14 వేల కోట్లు. ఈ రెండింటిపై వడ్డీ సుమారు మరో రూ. 14 వే ల కోట్లు. ఇవన్నీ కలిపితే రూ. 1.14 లక్షల కోట్లు అవుతాయి. బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం ఇంత భారీగా ఉంటే టీడీపీ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది కేవలం రూ. 5 వేల కోట్లు. అందులోనూ ఇప్పటికి విడుదల చేసింది రూ. 3,900 కోట్లు మాత్రమే. ఇది వడ్డీ మొత్తంలో సగానికి కూడా సరిపోదు. బాబు మోసంపై ప్రశ్నించేందుకే ప్రతిపక్ష నేతగా జగన్ ఈ దీక్ష చేస్తున్నారు. తన దీక్షతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిపించాలని, టీడీపీ చేసిన వాగ్దానాలను మళ్లీ వారికి గుర్తు చేయాలన్నదే ఆయన సంకల్పం’’ అని ధర్మాన చెప్పారు.

వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
రైతు రుణాలు మాఫీ కాకపోవడం వల్ల బ్యాంకుల నుంచి వారికి అప్పులు ఇచ్చే వ్యవస్థ కుప్పకూలిందని, ఫలితంగా రుణాల కోసం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అప్పులు పుట్టక, బీమా సౌకర్యం లేక కనీసం మద్దతుధర లభించక రైతులు దిగాలు పడి గ్రామాల్లో కూర్చుని ఉంటే చంద్రబాబు దావోస్, జపాన్ గురించి చెబుతూ వారిని రంగుల లోకంలో విహరింప జేయాలని చూస్తున్నారని ధర్మాన మండిపడ్డారు. మంత్రులు జగన్ దీక్ష గురించి ఏం మాట్లాడినాగానీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఆయనకు మద్దతునివ్వాలని ధర్మాన విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: