అడుగడుగునా వైఎస్ జగన్ సోదరికి ఆత్మీయ ఆదరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగడుగునా వైఎస్ జగన్ సోదరికి ఆత్మీయ ఆదరణ

అడుగడుగునా వైఎస్ జగన్ సోదరికి ఆత్మీయ ఆదరణ

Written By news on Saturday, January 24, 2015 | 1/24/2015


మీ ప్రేమను ఎన్నటికీ మర్చిపోలేం..సల్కునూరులో ఇద్దమ్మ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న షర్మిల
 షర్మిల పరామర్శయాత్రలో వెల్లువెత్తిన అభిమానం
 వైఎస్ కుటుంబంపై ప్రేమను చాటుకుంటున్న మృతుల కుటుంబాలు
 తమ ఇంటికి స్వయంగా వచ్చి పరామర్శించడంతో ఉద్వేగం
 వారి ఆవేదన విని షర్మిల కంటతడి
 అడుగడుగునా వైఎస్ జగన్ సోదరికి ఆత్మీయ ఆదరణ
 నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పరామర్శ యాత్ర

 
 ‘ఇన్నాళ్ల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని వచ్చావా తల్లీ.. మా గుండెల్లో మీ నాన్న (వైఎస్) ఉన్నాడు. మీరు మా కుటుంబంపై చూపిస్తున్న ప్రేమను మేమెన్నటికీ  మర్చిపోలేం..’.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శయాత్రలో అడుగడుగునా వెల్లువెత్తుతున్న అభిమానమిది. తమ బాధలు పంచుకుని, కష్టాల్లో ఓదార్చడానికి వచ్చిన షర్మిలను చూసిన ఉద్వేగమిది.
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు నల్లగొండ జిల్లాలో షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర మూడోరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగింది. ఈ నియోజకవర్గ పరిధిలో నాలుగు కుటుంబాలను ఆమె శుక్రవారం పరామర్శిం చారు. కుటుంబంలో ఒక్కొక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ.. కష్టసుఖాలను తెలుసుకున్నారు. షర్మిల తమ ఇంటికి రావడంతో వారంతా ఉద్వేగానికి లోనయ్యారు. షర్మిల ఒక్కో కుటుంబంతో అరగంటకు పైగా గడిపి, వారి బాగోగులను, సమస్యలను తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల ఆవేదనను విని చలించి కంటతడి పెట్టారు. వారందరికీ తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
 
 మూడో రోజు నాలుగు కుటుంబాలు
 
 మూడో రోజు యాత్రలో తొలుత నందిపాడు క్యాంపులోని పేరం దుర్గమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అక్కడ దుర్గమ్మ కోడలు జ్యోతి షర్మిలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. దుర్గమ్మ కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న షర్మిల.. వారికి ధైర్యాన్ని చెప్పి వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామానికి వెళ్లారు. అక్కడ రేఖ ఇద్దమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. సల్కునూరులో స్థానికులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం షర్మిల శెట్టిపాలెం గ్రామంలో భోజనం చేసి.. అక్కడే ఉన్న వైఎస్ విగ్రహానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి మిర్యాలగూడ వెళ్లి సీతారాంపురంలో అక్కిమళ్ల సుందర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. సుందర్ భార్య కృష్ణవేణి కన్నీటి మధ్య తన కుటుంబ స్థితిగతులను షర్మిలకు వివరించారు. ఆమె ఆవేదనను చూసిన షర్మిల కూడా చలించిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చేరుకుని కొప్పోజు సావిత్రమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఇక్కడ ఆమెకు జనం పెద్దఎత్తున స్వాగతం పలికారు. సావిత్రమ్మ కుటుంబానికి ధైర్యం చెప్పిన షర్మిల మూడోరోజు యాత్రను ముగించారు. షర్మిల వెంట వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా అహ్మద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, రాష్ట్ర నాయకులు షర్మిలా సంపత్, గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్ కుమార్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఎండీ సలీం, మల్లు రవీందర్‌రెడ్డి, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి తదితరులున్నారు.
 
 ఒడిలో చేరిన చిన్నారులు..
 
 నందిపాడు క్యాంపులో పేరం దుర్గమ్మ కుటుంబాన్ని సందర్శించినపుడు దుర్గమ్మ మనువరాళ్లు, మనవడిని కాసేపు షర్మిల ప్రేమతో లాలించారు. వారిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడుతూ ముచ్చట్లు చెప్పించారు. దుర్గమ్మ మనుమరాలు లక్ష్మీ దుర్గాభవాని అయితే షర్మిల చేతిలో చేతులేసి ఊగుతూ చిటిపొట్టి పలుకులతో ముచ్చటించింది. ఆ తర్వాత ఇంట్లో తయారుచేసిన పాయసాన్ని షర్మిలకు తినిపించాలని తీసుకువచ్చింది. వెంటనే షర్మిల ఆ చిన్నారికి తొలుత పాయసం తినిపించి, ఆ తర్వాత తాను కూడా తిన్నారు. దుర్గమ్మ మనవడు విశ్వనాథ్ అయితే ఎగిరి గంతేసి షర్మిల ఒడిలోకి వచ్చాడు. ఒడిలో కూర్చునే మా అమ్మమ్మ చనిపోయిందంటూ ఏడ్చాడు.
 
 ఇన్నాళ్లూ పలకరించిన వాళ్లే లేరమ్మా..
 
 మిర్యాలగూడలోని సీతారాంపురం లో అక్కిమళ్ల సుందర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించినప్పుడు సుందర్ భార్య కృష్ణవేణి కన్నీటి పర్యంతమయ్యారు. భర్త మరణించిన తర్వాత కనీసం తనను పలకరించేవారు లేరని, ఇన్నాళ్లకు కూడా గుర్తుపెట్టుకుని తన వద్దకు వచ్చినందుకు సంతోషంగా ఉందని షర్మిలతో చెప్పారు. తన ఇల్లు, కుమార్తె ఆరోగ్య పరిస్థితి, తన కష్టాల గురించి చెప్పుకొంటూ కన్నీటి పర్యంతమైన కృష్ణవేణిని, ఆమె కుమార్తె పద్మ ఆవేదనను చూసి చలించిపోయిన షర్మిల కూడా కంటతడి పెట్టారు
Share this article :

0 comments: