ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట కాదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట కాదా?

ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట కాదా?

Written By news on Friday, January 9, 2015 | 1/09/2015


ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట కాదా?అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఘాట్ రోడ్డు నుంచి లోతైన లోయలో పడిన బస్సు
 రోడ్డు ప్రమాదాల మీద, వాటిలో రాలిపోతున్న ప్రాణాల మీద ప్రభుత్వాలు శీతకన్ను వేయడం నానాటికీ ఎక్కువవుతోంది. అనంతపురం జిల్లా పెనుకొండ-మడకశిర రోడ్డులో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదం, తదనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన దీనినే రుజువు చేశాయి. పురోగతి కోసం రోడ్లు నిర్మించవలసిందే. కానీ ఆ పేరుతో జరిగే ఉల్లంఘనలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమాలు, నిర్లక్ష్యం సహించరానివి. పెనుకొండ రోడ్డు ప్రమాదంలో జరిగింది అక్షరాలా ఇదే. ఇలాంటి దుర్ఘటనలు ఇంకా ఎన్నాళ్లు? ఈ ప్రభుత్వాలు సరైన దారిలో నడిచేదెప్పుడు? ఇవే ఇవాళ బాధిత కుటుంబాలు వేస్తున్న ప్రశ్నలు. ప్రభుత్వాలు వింటాయా?

 ఇక రెండురోజులే స్కూళ్లు జరుగుతాయి. తర్వాత నుంచి సంక్రాంతి సెలవులు. కానీ భోగిమంటలతో కళకళలాడాల్సిన ఆ లోగిళ్లు... కన్నీటి కాలువలతో కళావిహీనమయ్యాయి. పదిహేను ప్రాణాలు ‘పల్లెవెలుగు’లో కాలిపోయాయి. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. అలసత్వానికి ప్రబల నిదర్శనం. అడ్డూఅదుపూ లేకుండా జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి ఘాట్‌రోడ్డు పునర్నిర్మాణం చేపడితే.. ఆ నిర్మాణంలో జరిగిన అలక్ష్యం ఆ నిండు జీవితాల  పరలోక యాత్రకు దారితీయడమే అతి పెద్ద విషాదం.  గంభీర ప్రకటనలు, మొక్కుబడి చర్యలు తప్ప... ఇంతటి విషా దానికి ప్రధాన కారకులైన కాంట్రాక్టర్లపై ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రతిపక్ష నేత బాధితుల పరామర్శకు బయలుదేరిన సమాచారం  తెలియగానే ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఉన్న జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డిలతో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావులను హుటాహుటిన దుర్ఘటన జరిగిన స్థలానికి పంపారు. మరోమంత్రి నారాయణ అయితే విజయవాడలో ఉండే.. డ్రైవర్ల  నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతు న్నాయని మీడియా ముందు తీర్మానించేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి ప్రతిపక్షాలు విమర్శలను ఎక్కుపెట్ట డం, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేయడం... రెండు రోజుల మీడియా హడావుడి... మళ్లీ అన్నీ మామూలే.. మొన్నటి జబ్బార్ ట్రావెల్స్ దుర్ఘటన నుంచి నిన్నటి అనంతపురం విషాదం వరకూ ఇదే తంతు. ఇదే ప్రహసనం. ప్రమాదం జరిగితే రెండురోజులపాటు హడావుడి తప్పించి అసలు రోడ్డు ప్రమాదాల హేతువును లోతుగా అధ్యయ నం చేయడానికి గాని,  వాటి నివారణకు చిత్తశుద్ధితో కృషి చేయడానికి గాని ప్రభుత్వం కదులు తున్న  దాఖలాలు కనిపించవు. ఇక నిజమైన దోషులను పట్టుకునే ప్రయత్నం అసలేలేదు. రాష్ట్రవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో రోడ్డు ప్రమాదాలతో సంభవిస్తున్న మరణాలదే అగ్రస్థానం కావడం ఇందుకు నిదర్శనం.

మావటూరులో అనిల్ కుమార్ కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ
 అనంతపురం దుర్ఘటననే తీసుకుంటే.. అసలే ఘాట్ రోడ్డు. రోడ్డు నిర్మాణం పనులు సాగుతున్నాయి. రోడ్డును ఆనుకునే (కనీస మార్జిన్ కూడా లేకుండా) 150 అడుగుల లోతున గొయ్యి తీశారు. అలాంటి చోట సర్వ సాధారణంగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన కనీస చర్యలూ తీసుకోలేదు. బారికేడ్ల మాట అటుంచి కనీసం గోతికి రెండడుగుల దూరంలో ప్రమాద హెచ్చరికగా నాలుగు బండరాళ్లు కూడా ఉంచలేదు. ప్రమాద సూచిక బోర్డుల ఊసే లేదు. కొండను తొలచి కొత్త రోడ్డు నిర్మిస్తున్న ఆ ప్రదేశంలో వాస్తవంగా అయితే అప్రోచ్ రోడ్డును నిర్మించాలి. ఆ పనీ చేయలేదు. ఇన్ని రకాలుగా నిర్లక్ష్యం కనిపిస్తున్నా... నారాయణ మంత్రివర్యులు మాత్రం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయంటూ.. ప్రభుత్వం మీద మచ్చ రాకుండా ఉండేందుకు విజయవాడ నుంచే విఫల యత్నం చేశారు. చంద్రబాబు కొలువులోని మంత్రుల్లో ఇటీవలి కాలంలో ఓ వింత పోకడ కనిపిస్తోంది. తుళ్లూరు ప్రాంతంలో పంటపొలాలను ఎవరో దుండగులు తగులబెట్టిన సంఘటనలో.. విచారణకు ఆదేశించిన పోలీసు మంత్రి ఆ మరుక్షణమే ఈ సంఘటనకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలే కారణమని ప్రకటించాడు. అనంతపురంలో బస్సు ప్రమాదం జరిగీ జరగ్గానే డ్రైవర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణం అని మరో మంత్రి ప్రకటిస్తాడు. ఒక సంఘటన జరగ్గానే అందుకు కారణాలపై విచారణ జరగక ముందే ‘తీర్పులు’ ప్రకటించడం ద్వారా మంత్రులు ‘బ్లేమ్‌గేమ్’ పండించగలరేమో కానీ... ఇలాంటి విషాదాల నివారణకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. కలెక్టర్ల సమావేశంలో ఉన్న ముఖ్యమంత్రి సయితం ఇలాంటి వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని సుద్దులు పలికారు. అందుకు తగ్గట్టే మంత్రులు కోరస్ వినిపించారు. అంతకంటే ఏమీ కాదు.

 ఇక్కడ మీడియా గురించి కూడా చెప్పుకోవాలి. 2007లో సెప్టెంబర్‌లో హైదరాబాద్ పంజగుట్ట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ప్రమాదం జరిగింది. బ్రిడ్జి కాంక్రీట్‌కు సపోర్టుగా ఉంచిన ఇనుప పైపులు, దిమ్మెలు కూలి ఆ దారిలో పోయే కార్లమీద పడ్డాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. పూర్వాపరాలు కూడా చూడకుండా  పత్రికలు బ్రిడ్జి కూలిపోయిందనీ, 20 మంది చనిపోయారనీ, కాంట్రాక్టర్‌ను అరెస్టు చేయాలనీ గగ్గోలు పెట్టాయి. వాస్తవంగా ఆ దుర్ఘటనలో మరణించింది ఒక్కరే. కూలింది బ్రిడ్జికాదు. బ్రిడ్జికి సపోర్టుగా ఉంచిన దిమ్మెలు మాత్రమే. ఇప్పుడు.. అనంతపురంలో ఇంతటి విషాదం జరిగితే.. 15 మంది చనిపోతే..రోడ్డుపనుల్లో కాంట్రాక్టరు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా... అవే పత్రికలు కిమ్మనడం లేదు. ఘోర ప్రమాదం వెనక ఉన్న కాంట్రాక్టరు నిర్లక్ష్యాన్ని, అధికారుల అలసత్వాన్ని, ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని పల్లెత్తుమాట అనకుండా విషాదాన్ని వర్ణించడానికే పరిమితం అయ్యాయి.

 అక్కడ ప్రమాదాలు కొత్తేమీ కాదు...
 మడకశిర-పెనుకొండ రహదారిలో ప్రస్తుతం ప్రమాదం జరిగిన సమీపంలోనే గతంలోనూ పలు ప్రమాదాలు జరిగాయి. ఆరు నెలల క్రితం ఇక్కడే  ఓ ప్రైవేటు బస్సు చెట్టును ఢీకొని 20 మందికి గాయాలయ్యాయి. మూడు నెలల క్రితం ఆర్టీసీ బస్సు బోల్తాపడి నలుగురు మరణించారు. అదే రోజు బాట సుంకులమ్మ ఆలయం సమీపంలో డీజిల్ ఆటో బోల్తాపడి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు నెలల క్రితం మరో డీజిల్ ఆటో బోల్తాపడిన సంఘటనలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నా అటు ఆర్టీసీ అధికారులు కానీ, ఇటు రోడ్లు, భవనాల శాఖ అధికారులు కానీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఇక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.

 అనంతపురం జిల్లాలో బస్సు దుర్ఘటనకు తెలుగువారంతా బాధపడ్డారు. చదువుకునే పిల్లల విషాదాంతాన్ని చూసి మరికొందరు ఆవేశపడ్డారు.  ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహాన్ని తక్షణం చల్లార్చేందుకు ఇద్దరు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయడానికే ప్రభుత్వం పరిమితం అయ్యింది. అంటే ఇంత జరిగినా మొక్కుబడి చర్యలే కనిపించాయి. రోడ్డు పనుల పర్యవేక్షణ చేసే ఇద్దరు ఇంజనీర్లను, ఒక డీఈని సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మడకశిర ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కూడా సస్పెండ్ చేశారు. పనుల పర్యవేక్షణలో అలసత్వం చూపారని ఇంజనీర్లను, రోడ్డు ప్రయాణంలో సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆర్టీసీ డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం... అసలు కారకుడైన కాంట్రాక్టర్‌ను మాత్రం వదిలేసింది. వాస్తవంగా అయితే రోడ్డు పనుల్లో నిర్దేశించిన ప్రమాణాలు పాటించకుండా 15 మంది పిల్లల మరణానికి కారణమైన కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచన చేస్తున్న దాఖలాలు కూడా లేవు.

 పరిహారమా? పరిహాసమా!
 ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల వంతున చంద్రబాబు పరిహారాన్ని ప్రకటించారు. ప్రతిపక్షనేత మృతుల కుటుంబాలన్నింటినీ పరా మర్శించి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ప్రమాదానికి ప్రధాన కారణం కాంట్రాక్టరు నిర్లక్ష్యం. ఆపై అధికారుల అలసత్వం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, నువ్వు.. నేను... మనము కడుతున్న పన్నుల డబ్బునుంచే పరిహారాలను బాధిత కుటుంబాలకు ఇవ్వడమే కాకుండా... అంతకు రెండు మూడురెట్ల పరిహా రాన్ని ప్రమాదానికి కారకులైన కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి వసూలు చేసి బాధిత కుటుంబాలకు ఇప్పించాలన్న డిమాండ్ గురించి కూడా ఆలోచిం చాలి. ఇతర రాష్ట్రాలలో ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు ఆయా ప్రభు త్వాలు స్పందిస్తున్న తీరునైనా తెలుగుదేశం ప్రభుత్వం గమనించాలి కదా!
 - మొగిలి రవివర్మ 
Share this article :

0 comments: