రైతులు దేశద్రోహులా.. దొంగలా..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతులు దేశద్రోహులా.. దొంగలా..!

రైతులు దేశద్రోహులా.. దొంగలా..!

Written By news on Tuesday, January 6, 2015 | 1/06/2015


* త్యాగాల పేరు చెప్పి మా పీకలు కోసేస్తారా?
* రైతులు దేశద్రోహులా.. దొంగ
లా..!
* పోలీసుల దౌర్జన్యం ఏమిటి?
* గ్రామాల్లో తిరగనివ్వడం లేదు
* ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో గోడు వెళ్లబోసుకున్న రాజధాని రైతులు

సాక్షి, హైదరాబాద్: తమకు జీవనాధారమైన సారవంతమైన భూములను లాగేసుకోవడమంటే తమ పీకలను తెగ్గోసినట్లేనని, ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని ఏపీ రాజధాని ప్రాంత రైతులు తెగేసి చెప్పారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నవులూరు గ్రామాలకు చెందిన రైతులు పెద్దసంఖ్యలో సోమవారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ గ్రామాల్లో భూసేకరణను వ్యతిరేకిస్తున్నందుకు తమపై ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తోందని, అకారణంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి వేధిస్తున్నారని, చేయి చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 త్యాగాల పేరుతో తమ కుత్తుకలు కోయడానికి సిద్ధమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మా భూములు ఇవ్వం అంటే దేశద్రోహమా! దొంగల మాదిరిగా చూస్తారా?’ అని పలువురు ఆవేదనగా ప్రశ్నించారు. ఈ గ్రామాల్లో భూములివ్వడానికి వ్యతిరేకిస్తున్న రైతులవన్నీ చిన్నచిన్న భూకమతాలేనని, చాలా సారవంతమైనవని వారు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే స్వచ్ఛందంగా ఇచ్చే వారినుంచే భూములు తీసుకోవాలని చెబుతున్నామన్నారు. ఏడాదికి 365 రోజులూ పూలు, పళ్లు, కూరగాయలు పండే అత్యంత ఖరీదైన పచ్చటి పొలాలే రాజధానికి కావాల్సి వచ్చాయా? అని పలువురు కంట తడిపెట్టారు. ఉద్వేగం, ఆవేశం, ఆగ్రహం, ఆందోళన నిండిన వాతావరణంలో రైతులు తమ వెతలు చెబుతుంటే అక్కడున్న వైఎస్సార్ సీపీ నేతలంతా బాధాతప్త హృదయంతో ఆలకించారు. రైతుల వెతలు వారి మాటల్లోనే..
 
 త్యాగాల పేరుతో మా పీక కోసేస్తారా?
నేను ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ, ఎంటెక్ చదివి హైదరాబాద్‌లో నెలకు రూ.13 వేలకు ఉద్యోగం చేసుకునేవాడిని. ఆ మొత్తం చాలక పోవడంతో ఇంటినుంచి ప్రతి నెలా ఐదు వేలు తెప్పించుకునేవాడిని. ఇలా చేయడం బాగోదనిపించి స్వగ్రామానికి వెళ్లిపోయి నాకున్న ఎకరంతో పాటు రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా.  ఏడాదికి రెండు లక్షల రూపాయలకు పైగా మిగిలేది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ పేరుతో భూమిని ప్రభుత్వం లాక్కుంటే ఆ ఉపాధి కూడా పోతోంది. కొందరు రాజధాని కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా అని ప్రశ్నిస్తున్నారు. మీడియా కూడా ‘భూములిస్తే మీకేంటి నష్టం’ అని ప్రశ్నిస్తోంది. త్యాగానికీ ఓ హద్దుంటుంది. మా సర్వస్వాన్ని వదులుకోవడానికి మేం సిద్ధంగా లేము. ఇక్కడ  ప్రశ్న త్యాగానిది కాదు. మా పీకలు కోసేస్తున్నారు. మా సర్వస్వాన్ని, మా యావదాస్తిని చంద్రబాబుకు రాసిచ్చేసి మేమేం చేయాలి.     
 - శివరాములు, నిడమర్రు
 
 వికలాంగుడినన్నా వదల్లేదు
 నేను చాలా చిన్న రైతును. నా భార్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. భూ పరిరక్షణ సమితిలో సభ్యుడిని కావడంతో పోలీసులు వచ్చి స్టేషన్‌కు రమ్మన్నారు. వృద్ధురాలైన మా తల్లికి నన్ను పోలీసులు తీసుకెళ్లిన విషయం తెలిస్తే గుండె ఆగి మరణిస్తుందని వేడుకున్నాను.  భూపరిరక్షణ కమిటీ అంటే కేవలం ఊర్లో చిన్నపాటి సమావేశాలు నిర్వహణ కోసం ఏర్పడిందేన ని చెప్పాను.  వేధింపులుంటాయని భయపడే నేను కమిటీకి రాజీనామా కూడా చేశాను. నేను పోలీస్ స్టేషన్‌కు వెళితే నా పిల్లలను చూసే వారుండరని మొరపెట్టుకున్నా కనికరం లేకుండా ‘ఐజీ గారు పిలుస్తున్నారు.. రా..’ అం టూ తీసుకెళ్లారు. నేనే తప్పూ చేయలేదు. నాపై 144వ సెక్షన్ కింద కేసు పెట్టారు. బైండోవర్ చేశారు. 
  - మన్నం హనుమంతరావు, పెనుమాక (ఒక కన్ను లేదు)
 
 అల్లుడు ఏమంటాడోనని భయంగా ఉంది
 ఎకరం పొలంలో కొంతమేరకు గడ్డి పెంచుకుంటూ మిగతా దాన్లో కూరగాయలు పండించుకుని బతుకుతున్నాం. పెద్దమ్మాయికి ఈ పొలంతోనే పెళ్లి చేశాను. మా పిల్లల వాళ్ల నాన్నగారు చనిపోయారు.. (ఏడుస్తూ) అమ్మాయి పెళ్లయి నాలుగు నెలలైంది. మాకు పొలం ఉందని చేసుకున్నారు. ఇపుడు ల్యాండ్ పూలింగ్ కింద పొలం తీసేసుకుంటే ఏమవుతుందోనని భయంగా ఉంది. అల్లుడు ఏమంటాడో తెలియడం లేదు. ఇద్దరు పిల్లలకు పెళ్లిచేసే బాధ్యత నాపై ఉంది. వారి గురించి ఆలోచిస్తూంటేనే బాధగా ఉంది.     -గాదె మల్లీశ్వరి, ఉండవల్లి
 
 మేం చేసిన తప్పేంటి?
 మా పొలాలు లాక్కుంటామంటున్నారు. మేం చేసిన తప్పేంటి? వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలబడటమేనా? మీ భూములు ఇవ్వకపోతే ఊరుకోబోమని అంతా వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. మా భూములను రాజధానికి ఇవ్వబోమని పంచాయతీ తీర్మానం కూడా చేశాం. మాకిద్దరు పిల్లలు. ఈ ఎకరా పొలం పోతే మేమెలా బతకాలి. మా ఊరికి, మా పొలంలోకి చుట్టుపక్కల ఉండే ఏడు ఊర్ల నుంచి కూలీలు వచ్చి పని చేసుకుంటారు.  నేను కూడా పూలు కోస్తాను. మా పరిస్థితి దయనీయమవుతుంది.
  - కె. నాగరత్నం, ఎంపీటీసీ సభ్యురాలు, నిడమర్రు
 
 ఎమర్జెన్సీ కన్నా ఘోరం..
 మా గ్రామాల్లో ఎమర్జెన్సీ కంటే అధ్వానమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతటి వేధింపులు రైతులు ఎప్పుడూ చూడలేదు. అంగీకారంతోనే భూములు తీసుకుంటామని ఓ వైపు చెబుతూనే మరో వైపు బెదిరింపులకు దిగుతున్నారు. కరుడుగట్టిన కమ్యూనిస్టు ప్రాంతమిది. ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతాంగానీ మా పొలాలను ఇవ్వం.
  - దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఎంపీపీ, తాడేపల్లి
 
 లోకేశ్ ఆస్తులు త్యాగం చేస్తారా?
 రాజధాని కోసం త్యాగాలు చేయాలంటున్నారు, చంద్రబాబు కుమారుడు లోకేశ్ తన ఆస్తులను త్యాగం చేస్తారా? బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఇప్పుడు ఉన్న జాబులే పోతున్నాయి. నా పొలాన్ని లాగేసుకుంటే రేపు బాబు ఇంటికాడనో రోడ్డు మీద నో మేమంతా అడుక్కుతినాలా? సింగపూర్ లాంటి రాజధానికి లక్ష ఎకరాలు ఎందుకు?
 - ధనుంజయరెడ్డి, డిగ్రీ విద్యార్థి
Share this article :

0 comments: