వడ్డీ కూడా మాఫీ కాలేదు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వడ్డీ కూడా మాఫీ కాలేదు!

వడ్డీ కూడా మాఫీ కాలేదు!

Written By news on Sunday, January 11, 2015 | 1/11/2015


* పార్టీ కర్నూలు జిల్లా సమీక్షా సమావేశంలో వైఎస్ జగన్
* అబద్ధం చెప్పకపోతే ప్రజలు రాళ్లతో కొడతారని బాబుకు తెలుసు
* అందుకే రోజుకో అబద్ధం చెబుతున్నారు
* రాష్ర్టంలో దిక్కుమాలిన, దుర్మార్గపు పాలన సాగుతోంది
* రుణమాఫీ చేస్తానన్నారు.. కనీసం వడ్డీ కూడా పూర్తిగా మాఫీ కాలేదు
* కొత్త రుణాలు లేవు... కరువొచ్చినా బీమా తీసుకోలేని పరిస్థితి
* ప్రజలు విసుగెత్తిపోయారు.. వారి సమస్యలపై పోరాడదాం

 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కళ్లార్పకుండా అబద్ధం చెప్పే ఏకైక వ్యక్తి చంద్రబాబేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అవ్వాతాతల పింఛన్లలో కోత విధిస్తూ, రోజుకొక అబద్ధం చెబుతూ పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ర్టంలో దిక్కుమాలిన, దుర్మార్గపు పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కర్నూలులో రెండురోజుల పాటు జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు శనివారంతో ముగిశాయి. శనివారం కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.
 
 ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా రోజుకో అబద్ధం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన మనస్సాక్షిని తనే ప్రశ్నించుకుంటే... ప్రతిరోజూ అబద్ధం చెబుతున్న విషయం అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. అబద్ధం చెప్పకపోతే ప్రజలు రాళ్లు తీసుకుని కొడతారనే విషయం బాబుకు తెలుసని, అందుకే రోజుకో అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలన మాకొద్దు బాబోయ్ అంటూ ప్రజలు విసుగెత్తిపోయారని, వారి సమస్యలపై పోరాటం చేద్దామని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
 
 వడ్డీ కూడా మాఫీ కాలేదు!
 చంద్రబాబు ఇచ్చిన హామీల్లో రుణమాఫీ ఒకటని, అయితే ఏ ఒక్క రైతుకీ కనీసం వడ్డీ కూడా పూర్తిగా మాఫీ కాలేదని జగన్ స్పష్టం చేశారు. పైగా చంద్రబాబును నమ్మి రుణాలు కట్టనందుకు రైతులు అపరాధ రుసుంతో కలిపి ఏకంగా 14 శాతం వడ్డీ కట్టాల్సి వచ్చిందని తెలిపారు. ‘ఈసారి ఖరీఫ్, రబీ సీజన్‌లో రైతులకు రూ.56 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ఇచ్చింది కేవలం రూ.13 వేల కోట్లే. అంటే మిగిలిన రూ.43 వేల కోట్ల మేర రుణాల కోసం రైతులు రూ.2 లేదా రూ.3 వడ్డీకి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు తీసుకోవాల్సి వచ్చిందన్నమాట.
 
  సకాలంలో రుణాలు చెల్లించి ఉంటే వడ్డీ లేని రుణాలు అందుకోవాల్సిన రైతులు కాస్తా ప్రైవేటు వ్యక్తులకు వడ్డీలు కట్టాల్సి వచ్చింది. రుణాలు మాఫీ చేసేందుకు రూ.87 వేల కోట్లు కావాలి. మరోవైపు వీటి మీద వడ్డీ భారం రూ.12 వేల కోట్లు అవుతుంది. కానీ రుణమాఫీ కోసం చంద్రబాబు కేటాయించింది కేవలం రూ.4,600 కోట్లు మాత్రమే. అంటే ఆయన కేటాయించిన మొత్తం సగం వడ్డీకి కూడా సరిపోదని అర్థమవుతోంది. రుణం మాఫీ కాకపోవడంతో కొత్త రుణాలు రాలేదు. కొత్త రుణాలు తీసుకోనందుకు పంటల బీమాను కూడా కోల్పోయే దుస్థితి ఏర్పడింది. కరువు వచ్చినా బీమాను తీసుకోలేని పరిస్థితి ఉంది’ అని జగన్ వివరించారు. ‘రుణమాఫీ అంటే చంద్రబాబు అర్థం ఏమిటంటే.. రాష్ర్టంలో మొత్తం 1.05 కోట్ల రైతుల బ్యాంకు ఖాతాలు ఉంటే 20 లక్షల ఖాతాలకు తగ్గించడం.
 
 రూ.87 వేల కోట్ల రుణాలు ఉంటే కేవలం రూ.4,600 కోట్లు కేటాయించడం..’ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాదిరిగా రూ.87 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తామనే అబద్ధపు వాగ్దానాలు, హామీలు ఇవ్వనందుకే పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గాలి కూడా చంద్రబాబుకు కాస్తో కూస్తో కలిసి వచ్చిందని అభిప్రాయపడ్డారు.
 
బాబు సీఎం అయినా బంగారం రాలేదు
 ఎన్నికల ముందు రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకులోని బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు సీఎం కావాలంటూ ఊదరగొట్టారని.. తీరా చంద్రబాబు సీఎం అయితే అయ్యాడు కానీ.. బ్యాంకుల్లోని బంగారం వేలానికి పెడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన భార్య మెడలోని నగలు మాత్రం అట్లానే భద్రంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. చివరకు అవ్వాతాతల పింఛన్లకు కూడా కోత పెడుతున్నారన్నారు. ఇందుకోసం సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ మంత్రులు చూపిన వ్యక్తులను నియమిస్తున్నారని మండిపడ్డారు. వీరి పనేమిటయ్యా అంటే... అవ్వాతాతల పింఛన్లను తగ్గించడమేనన్నారు.
 
 ఇంత దుర్మార్గపు, దిక్కుమాలిన పాలన రాష్ర్టంలో సాగుతోందని జగన్ విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, సీజీసీ సభ్యుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరిత, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ, గుమ్మనూరు జయరాం, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, సీఈసీ సభ్యులు కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, హఫీజ్ ఖాన్, సీనియర్ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Share this article :

0 comments: