సమావేశాల్లోనే దాడులా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమావేశాల్లోనే దాడులా

సమావేశాల్లోనే దాడులా

Written By news on Tuesday, January 13, 2015 | 1/13/2015


కరణం వర్గీయుల బరితెగింపు
* ప్రకాశం భవనం సాక్షిగా వెఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై దాడి
* నన్ను అంతం చేయాలని చూస్తున్నారు: గొట్టిపాటి రవి
* నిరసనగా భైఠాయింపు
* న్యాయం జరగకపోతే మళ్లీ ఆందోళన

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రకాశం భవనం సాక్షిగా జిల్లాలో ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయింది. తెలుగు దేశం పార్టీ అధికారం చేజిక్కించుకున్న అనంతరం దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. గత రెండు, మూడు నెలలుగా అధికార సమావేశాల్లోనే భౌతిక దాడులతో బరితెగించడం అధికార కండకావరాన్ని తెలియజేస్తోంది. పంచాయతీ సమావేశాల నుంచి మండల సమావేశాలు దాటి నేడు నేరుగా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశ ఆవరణల్లోనే బస్తీమే సవాల్ అంటూ వీధి రౌడీల్లా దాడులకు దిగడం ప్రజాస్వామ్యవాదులను  ఆందోళనకు గురిచేస్తోంది.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  గొట్టిపాటి రవికుమార్‌పై దాడికి తెలుగుతమ్ముళ్లు దిగారు.  మాజీ ఎంపీ కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ తమ అనుచరులతో ఈ దాడికి ఒడిగట్టారు. దీంతో కలెక్టరేట్ ఆవరణలో భయానక వాతావరణం ఏర్పడింది. గొట్టిపాటి రవికుమార్ కారును రాళ్లతో ధ్వంసం చేశారు. వారు స్వయంగా రెచ్చగొట్టడంతో అనుచరులు మరింత రెచ్చిపోయారు.

రవికుమార్‌తోపాటు సమావేశానికి వచ్చిన రైతులు, అనుచరులపై  కూడా దాడికి దిగారు. ఈ దాడిలో గొట్టిపాటి అనుచరుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్, గన్‌మెన్, పీఏ తదితరులను కూడా వదలకుండా పిడిగుద్దులకు దిగారు. ఎమ్మెల్యే రవికుమార్ చొక్కా పట్టుకొని లాగే ప్రయత్నం మరి కొందరు చేశారు. దీంతో ఆయన చొక్కా గుండీలు తెగిపోయాయి. వెంటనే గన్‌మెన్‌లు ఆయనను అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లారు.

ఈ దాడిని నిరసిస్తూ  దుండగులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట రవికుమార్ నిరసనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకుంది. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అడిషనల్ ఎస్పీ రామానాయక్, డీఎస్‌పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, పలువురు సీఐలు అక్కడికి చేరుకున్నారు. ఒంగోలు ఆర్డీవో శ్రీనివాసరావు కూడా చేరుకుని ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. మంగళవారం మధ్యాహ్నంలోగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో పది గంటల ప్రాంతంలో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. న్యాయం జరగకపోతే మంగళవారం సాయంత్రం ఇదే కలెక్టరేట్ ముందు మళ్లీ ఆందోళనకు దిగుతామని రవికుమార్ హెచ్చరించారు.

నన్ను అంతం చేయాలని చూస్తున్నారు
అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనను అంతం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గతంలో తన అన్న కిశోర్‌ను చంపారని, ఇప్పుడు మూడుసార్లు వరుసగా ఓడిపోతూ తమకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోవడంతో తనను చంపడానికి కత్తులు నూరుతున్నారని విమర్శించారు. వారికి ప్రజలు మరోసారి గుణపాఠం నేర్పుతారని అన్నారు.

అధికారిక సమావేశాలకు గూండాలు, రౌడీలు ఎలా వస్తారని, అధికారులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా సంయమనం పాటించామని, బయటకు వచ్చే సమయంలో దాడికి దిగారని, ఈ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని అన్నారు.

ఈ ధర్నాలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొట్టిపాటి భరత్, పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, వై. వెంకటేశ్వరరావు, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేపై దాడిని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఖండించారు.
 
గత మూడు నెలలుగా కవ్వింపు చర్యలు...
జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక నుంచి ఇప్పటి వరకూ మూడుసార్లు గొట్టిపాటి రవిపై దాడికి కరణం వర్గీయులు ప్రయత్నించారు. జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక  గొట్టిపాటి రవికుమార్  సమావేశంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌పై దాడి చేశారంటూ తప్పుడు ప్రచారం చేసి దాడికి ప్రయత్నించారు.

నాగార్జునసాగర్ కాల్వలపై జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్ వెళ్లినపుడు మార్టూరు వద్ద తెలుగుదేశం కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. తాజాగా సోమవారం కలెక్టరేట్ వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వాసితుల అంశంపై జరిగిన సమావేశం తర్వాత దాడికి తెగబడ్డారు.
 
హేయమైన చర్య
గొట్టిపాటికి భద్రత పెంచాలంటూ కలెక్టర్, అదనపు ఎస్పీలకు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫోన్
ఒంగోలు:  సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం ముందే ప్రజాప్రతినిధి మీద దాడి జరగడం తీవ్రమైన, హేయమైన చర్యగా  ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందువల్ల తక్షణమే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు భద్రత పెంచాలని పేర్కొంటూ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

భద్రత పెంపుపై తాము వెంటనే ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా అదనపు ఎస్పీతో కూడా ఒంగోలు ఎంపీ ఫోన్‌లో మాట్లాడారు. ప్రజా ప్రతినిధిపైనే దాడి జరిగితే ఇక సామాన్యుడికి రక్షణ ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.  మానవతా వాధులంతా ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.
 
ఓడినవారి అక్కసు ఇది: ముత్తుముల
గిద్దలూరు రూరల్:  గొట్టిపాటి రవికుమార్ పై దౌర్జన్యంకు పాల్పడి దాడికి దిగడం ప్రజాస్వామ్య విరుద్ధమంటూ  వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు స్ధానిక ఎమ్మేల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాల్సి సంఘటన అని అన్నారు. ఓటమి పాలైన టి.డి.పి. నాయకులు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారన్నారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం చూస్తు ఊరుకోవడం మంచి పద్దతి కాదన్నారు.
 
దాడి శోచనీయం... సమావేశాల్లోనే దాడులా  : ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి
మార్కాపురం :  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై సోమవారం రాత్రి ఒంగోలు కలెక్టరేట్ వద్ద బలరాం వర్గీయులు దాడి చేసిన సంఘటనపై మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఖండించారు. ఒంగోలు కలెక్టరేట్‌లో జరిగిన సమావేశానికి హాజరై బయటకు వచ్చిన ఎమ్మెల్యే రవికుమార్‌పై బలరాం వర్గీయులు దాడి చేయడం మంచిదికాదన్నారు. అభివృద్ధి విషయంలో ఒకరినొకరు సహకరించుకుని ప్రజలకు మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు.


Share this article :

0 comments: